హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): పేద, మధ్య తరగతి వర్గాలు ప్రయాణించే సిటీ బస్సు చార్జీల పెంపు దుర్మార్గమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఇప్పటికే విద్యార్థుల బస్‌పాస్ చార్జీలు, టీ-24 టికెట్ల రేట్లను పెంచిన ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా సిటీ బస్సు చార్జీలను 50 శాతానికి పైగా స్టేజీకి పది రూపాయలు పెంచడం దారుణమని ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్ణయంతో ప్రతినెలా ఒక్కో ప్రయాణికుడిపై సుమారు రూ. 500కు పైగా భారం పడుతుందని వాపోయారు. కాంగ్రెస్ సర్కారు అసమర్థ పాలన, అసంబద్ధ విధానాలతో నష్టాలపాలైన ఆర్టీసీని గట్టెక్కించేందుకు చార్జీలు పెంచి ప్రజల నడ్డివిరుస్తున్నదని ఫైర్ అయ్యారు. ప్రభుత్వ దుర్మార్గమైన నిర్ణయం పేద, మధ్యతరగతి ప్రయాణికుల జేబులు కొల్లగొట్టేందుకు పన్నిన కుట్ర అని నిప్పులు చెరిగారు. మూలిగే నక్కపై తాటి పండు చందంగా ఇప్పటికే నిత్యావసరాల ధరల పెరుగుదలతో అల్లాడుతున్న తరుణంలో సిటీ బస్సు చార్జీలు పెంచి మరో పిడుగు వేశారని విమర్శించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓట్లెయ్యలేదనే పగతో జంట నగరాల జనంపై రేవంత్ సర్కారు కక్ష సాధిస్తున్నదని దుయ్యబట్టారు. అందుకే ప్రతి ప్రయాణికుడిపై రూ. 500పైగా భారం మోపిందని నిప్పులు చెరిగారు. చార్జీల పెంపుతో నిత్యం బస్సుల్లో ప్రయాణించే దినసరి కూలీలు, వేతనజీవులు బతికిదేట్లా? అని ప్రశ్నించారు. పాలనావైఫల్యంతో రాష్ర్టాన్ని దివాలా తీయించిన సీఎం రేవంత్‌రెడ్డి రాజధానివాసుల నడ్డివిరిచేలా ప్రతిరోజూ సుమారు కోటి రూపాయలను ముక్కుపిండి వసూలు చేయడం బాధాకరమని వాపోయారు. తుస్సుమన్న ఉచిత బస్సు పథకంతో తెలంగాణ ఆర్టీసీని నష్టాలపాల్జేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు సామాన్యులపై కక్ష సాధిస్తున్నదని విమర్శించారు. రేవంత్‌రెడ్డి అసమర్థ పాలనతో రాష్ర్టా ప్రగతి రథ చక్రాలనే కాదు..ఆర్టీసీ ప్రగతి రథ చక్రాలను సై తం ధ్వంసం చేశారని తూర్పారబట్టారు. ఈ పాపం కాంగ్రెస్ సర్కారును కుప్పకూల్చే వరకు వెంటాడుతూనే ఉంటుందని ఆదివారం ఎక్స్‌వేదికగా హెచ్చరించారు.