KTR | హైదరాబాద్ : గోదావరి జలాలతో మూసీ నదిని 365 రోజులు పారిస్తామని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం ద్వారా గోదావరి నీళ్లను హైదరాబాద్‌కి దగ్గర్లోని కొండపోచమ్మ సాగర్‌కి తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వం అని కేటీఆర్ గుర్తు చేశారు. కొండపోచమ్మ సాగర్ నుండి గండిపేట చెరువుకి గోదావరి నీళ్లను తేవడానికి 2022 లోనే రూ. 1,100 కోట్లతో ప్రతిపాదనకు ఆమోదం ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం అని తెలిపారు.
మూసీ నదికి చేరే 2000 ఎంఎల్డీ మురికి నీటిని శుద్ధి చెయ్యడం కోసం మొత్తం 36 ఎస్టీపీల (Sewerage Treatment Plant) నిర్మాణం చేపట్టి పూర్తి చేసింది కేసీఆర్ ప్రభుత్వం. మూసీలో ఐదు కిలోమీటర్ల మేర నాగోల్ ప్రాంతంలో సుందరీకరణ చేసింది, మూసీ నది ఒడ్డున ఉప్పల్ భాగాయత్‌లో శిల్పారామం ఏర్పాటు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. మొత్తం రంగమంతా కేసీఆర్ ప్రభుత్వం సిద్ధం చేసి, రూ.16,000 కోట్లతో మాస్టర్ ప్లాన్, డీపీఆర్ తయారు చేస్తే స్కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్టిమేట్స్ని రూ. 1,50,000 కోట్లకు పెంచి తెరలేపిన మహా దోపిడీని ముమ్మాటికీ ఎండగడుతాం అని కేటీఆర్ తేల్చిచెప్పారు.
మీరు చెయ్యబోతున్న ప్రజా ధనం దోపిడీని ఖచ్చితంగా అడ్డుకుంటాం. ఢిల్లీకి మూటలు పంపుతూ పదవిని కాపాడుకోవడానికే మీరు పడుతున్న తాపత్రయం, దానికి నగర అభివృద్ధి అనే అందమైన ముసుగు అన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఒక వైపు నోరు తెరిస్తే కాళేశ్వరం కూలిపోయింది అని పచ్చి అబద్దాలు చెబుతూ మరోవైపు అదే కాళేశ్వరంలో అంతర్భాగం అయిన కొండపోచమ్మ సాగర్ నుండి గోదావరి నీటిని తీసుకుంటాం అని చెప్పడం కూడా విజ్ఞులైన తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు అని కేటీఆర్ తెలిపారు.