KTR | హైదరాబాద్ : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ సర్కార్ తీవ్రమైన వేధింపులకు గురి చేస్తుందని మండిపడ్డారు. మండల, గ్రామస్థాయి నాయకులను తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. జడ్చర్లలో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
బీఆర్ఎస్ నాయకుల మీద కాంగ్రెస్ సర్కార్ కేసులు పెడుతుంది.. దేవరకద్రలో మండల పార్టీ ప్రెసిడెంట్ మీద లేని కేసు పెట్టి జైలుకు పంపించారు. పార్టీ మారితే కేసు తీసేస్తాం.. పార్టీ మారకపోతే జైల్లో వేస్తాం అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునే నాయకులపై కక్ష సాధింపు చర్యలుకు పాల్పడుతున్నారు. పోలీసులు, జీఎస్టీ అధికారులను పంపించి మానసికంగా వేధిస్తున్నారు. తెలంగాణలో ఎక్కడ చూసినా చౌకబారు రాజకీయం జరుగుతుంది. ఇకనైనా కళ్లు తెరిచి, నిద్రలో నుంచి మేల్కొని, బయటకు వచ్చి.. వెంటనే పాలమూరు ఎత్తిపోతలను సత్వరమే పూర్తి చేయాలి. ఇది పూర్తి చేస్తే జిల్లా రైతాంగం, మేం అభినందిస్తాం. లేదంటే ప్రజల తరపున నిలదీస్తాం.. ఎండగడుతాం అని కేటీఆర్ హెచ్చరించారు.