హైదరాబాద్, ఏప్రిల్ 24(నమస్తే తెలంగాణ) : ‘నర్సంపేట డిపో ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్‌ది ఆత్మహత్య కాదు.. అది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యే.. రెండున్నరేండ్లుగా సీఎం రేవంత్‌రెడ్డి ఆర్టీసీ కార్మికులకు చేస్తున్న ద్రోహాన్ని తట్టుకోలేకే ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. పది రోజుల ముందే నోటీసులిచ్చి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నా కాంగ్రెస్ సర్కార్‌కు కనీస సోయి కూడా లేదని ఎక్స్ వేదికగా నిప్పులు చెరిగారు. అంతులేని నిర్లక్ష్యంతోనే తెలంగాణ ఉద్యమకాలం నాటి పరిస్థితులు, ఆత్మబలిదానాలు చేసుకొనే దుస్థితిని చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల కోసం సవాలక్ష హామీలు గుప్పించిన రేవంత్‌రెడ్డి, కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చకపోవడం దురదృష్టకరమని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వ్యవహారశైలితోనే ఆర్టీసీ కార్మికలోకం తీవ్ర నిరాశా నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నదని స్పష్టంచేశారు. రాష్ట్రంలో గురువారం ఒకేరోజు ముగ్గురు ఆర్టీసీ డ్రైవర్ల ఆత్మహత్యాయత్నాల ఘటనలు తీవ్రంగా కలచివేశాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ రోజు తెలంగాణ చరిత్రలో చీకటి రోజుగా మిగిలిపోతుందని ఆయన అభివర్ణించారు. ఏకకాలంలో ఇన్ని అమానవీయ ఘటనలు జరిగినా కాంగ్రెస్ సర్కార్‌లో కదలిక లేకపోవడం సిగ్గుచేటని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
నివాళులర్పించే అవకాశం ఇవ్వకపోవడం దుర్మార్గం
ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, తోటి కార్మికుల హక్కుల సాధన కోసం ప్రాణత్యాగం చేసిన శంకర్‌గౌడ్ పార్థివదేహాన్ని నర్సంపేట ఆర్టీసీ డిపో వద్దకు తీసుకెళ్లి నివాళులర్పించే అవకాశం ఇవ్వకపోవడం దుర్మార్గమని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. పెద్దదిక్కును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న శంకర్‌గౌడ్ కుటుంబసభ్యులకు అండగా నిలిచిన నర్సంపేట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, ఆర్టీసీ కార్మికులు, కార్మిక సం ఘాల నాయకులను అరెస్ట్ చేయడం దారుణమని దుయ్యబట్టారు. అణచివేతలు, కుట్రలు, కుతంత్రాలతో దౌర్జన్యాలకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ప్రభుత్వ ఉద్యోగం, కోటి పరిహారం ఇవ్వాలి
రేవంత్ రాక్షసపాలనకు బలైపోయిన శంకర్‌గౌడ్ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని కేటీఆర్ పేర్కొన్నారు. వెంటనే రూ.కోటి పరిహారంతో పాటు శంకర్‌గౌడ్ కుటుంబీకుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేశారు. ఇప్పటికైనా భేషజాలు వీడి ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని, అక్రమంగా అరెస్ట్ చేసిన బీఆర్ఎస్, కార్మిక సంఘాల నాయకులను బేషరతుగా విడుదల చేసి కేసులను ఎత్తేయాలని డిమాండ్ చేశారు.
నిరంకుశ సర్కార్‌పై సంఘటితంగా పోరాడాలి
ఆర్టీసీ కార్మికుల్లారా ఎట్టి పరిస్థితుల్లో మనోధైర్యం కోల్పోవద్దని కేటీఆర్ విజ్ఞప్తిచేశారు. దుర్మార్గపు నిరంకుశ కాంగ్రెస్ సర్కార్‌కు వ్యతిరేకంగా సంఘటితంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. బలిదానాలతో సమస్యలు పరిష్కారం కావనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితబోధ చేశారు. కార్మికుల ఉద్యమానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని ప్రకటించారు. వారి తరఫున ప్రజాక్షేత్రంలో, చట్టసభల్లో గళమెత్తుతామని భరోసానిచ్చారు.