హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పత్తి రైతులు సంక్షోభంలో కూరుకు పోయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొద్దు నిద్ర పోతున్నాయని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) నిప్పులు చెరిగారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకుందామంటే రైతులకు దికులేని పరిస్థితి నెలకొన్నదని ఆదివారం ఎక్స్ వేదిక ద్వారా ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని రైతుల కష్టాలు తీర్చాలని డిమాండ్ చేశారు. ఈ సంక్షోభానికి దేశంలోని బీజేపీ సర్కారు, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత నిర్లక్ష్యమే ప్రధాన కారణమని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం, పత్తి రైతుల పాలిట శాపంగా మారిందని ధ్వజమెత్తారు. దాదాపు 50 లక్షల ఎకరాల పత్తి పండించిన రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే, ప్రభుత్వాలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నాయని దుయ్యబట్టారు. ఇప్పటికైనా రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు, ఎంపీలు ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి కేంద్ర ప్రభుత్వంతో, ముఖ్యంగా సీసీఐతో చర్చించి రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అడ్డగోలు నిబంధనలు, కుంటి సాకులతో కొనుగోళ్లను నిలిపివేసిన సీసీఐ వైఖరిని ఎండగట్టారు.
రైతులకు కనీస మద్దతు లేదు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాకంతో రైతులకు కనీస మద్దతు ధర దక్కడం లేదని కేటీఆర్ మండిపడ్డారు. ఇప్పటికే భారీ వర్షాలు పడి పంటలు తీవ్రంగా దెబ్బతిని ఇబ్బందులు పడుతున్న రైతులు, మిగిలిన పంటను అమ్ముకోలేక అరిగోస పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర పత్తి రైతులను పట్టించుకోకుండా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు సరికాదని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ సర్కారు విఫలం
పత్తి కొనుగోళ్ల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవడంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కేటీఆర్ మండిపడ్డారు. రైతులకు అండగా నిలవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రాన్ని ప్రశ్నించకుండా ఉండటం సమంజసం కాదని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో లక్షలాది మంది రైతులు తాము పండించిన పత్తిని కొనుగోలు చేసే దికులేక ఆందోళనలు చేస్తున్నా సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటివరకూ స్పందించకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు.
క్వింటాల్‌కు రూ.6వేలు దక్కడం కష్టం
ప్రస్తుతం పత్తి క్వింటాల్‌కు రూ. 8,110 కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ఉన్నా బహిరంగ మారెట్లో రూ. 6,000 నుంచి రూ. 7,000 కూడా రైతులకు దకడం కష్టంగా ఉన్నదని కేటీఆర్ వాపోయారు. ప్రతి క్వింటాల్‌పై రైతు దాదాపు రూ. 2,000 పైగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వర్షాలతో పత్తి తడిసిపోయి తేమ శాతం పెరగడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, మరోవైపు ఇదే సాకుగా చపి సీసీఐ తేమ ఎకువగా ఉన్న పత్తిని కొనుగోలును చేయకుండా కఠినంగా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్తి రైతుల విజ్ఞప్తులను ఏమాత్రం పట్టించుకోకపోవడం, వారి పట్ల ప్రభుత్వాలకు ఉన్న ఉదాసీనతకు నిదర్శనమని విమర్శించారు.
ఉద్దేశ పూర్వకంగానే కేంద్రం కొర్రీలు
పత్తి కొనుగోళ్ల విషయంలో కేంద్రంలోని బీజేపీ సరారు ఉద్దేశ పూర్వకంగా కొర్రీలు పెడుతున్నదని కేటీఆర్ విమర్శించారు. గతంలో ఎకరాకు 12 క్వింటాళ్ల వరకు కొనుగోలు పరిమితి ఉండగా, దాన్ని ఏకంగా 7 క్వింటాళ్లకు తగ్గించడం రైతులకు మరింత ఇబ్బంది కరంగా మారిందని చెప్పారు. జిన్నింగ్ మిల్లుల అవినీతి అంటూ కుంటి సాకులు చెప్తూ కేవలం 7 క్వింటాళ్లే కొనుగోలు చేస్తే మిగిలిన పంటను రైతులు ఎకడ అమ్ముకోవాలని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరి వల్ల జిన్నింగ్ మిల్లులు ఒకేసారి ప్రారంభం కాకపోవడం కూడా కొనుగోళ్లకు ఆటంకంగా మారిందని దుయ్యబట్టారు. ఇప్పటికీ పలు జిల్లాల్లో పత్తి కొనుగోళ్లు చేయడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన క్యాటగిరీల విభజనను నిరసిస్తూ సోమవారం నుంచి జిన్నింగ్ మిల్లులు మరోసారి బంద్‌కు పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.
నెలలో 1.12 లక్షల టన్నులే కొనుగోళ్లా?
నెలలో సీసీఐ కొన్నది కేవలం 1.12 లక్షల టన్నుల పత్తి మాత్రమేనని, ఈ సీజన్లో అంచనా వేసిన 28.29 లక్షల టన్నుల ఉత్పత్తితో పోలిస్తే ఇది చాలా స్వల్పమని కేటీఆర్ తూర్పారబట్టారు. కేవలం రాజకీయాలపైనే దృష్టి సారించకుండా రాష్ట్రంలో నెలకొన్న పత్తి కొనుగోళ్ల సంక్షోభంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మొత్తం 325 జిన్నింగ్ మిల్లులకు బదులుగా 256 మిల్లులనే ఓపెన్ చేసి మిగిలిన వాటిని తెరవకుండా రైతులను ఇబ్బందులు పెట్టడం ప్రభుత్వాల ఉద్దేశపూర్వక నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. మరోవైపు రైతులు తమ పత్తిని అమ్ముకునేందుకు మొబైల్ యాప్‌ను కచ్చితంగా వినియోగించాలన్న నిబంధనను సడలించాలని, రైతులు పత్తి ఎప్పుడు తెస్తే అప్పుడు కొనుగోలు చేసే అవకాశం కల్పించాలి డిమాండ్ చేశారు.
ఢిల్లీకి ప్రత్యేక బృందాన్ని పంపండి
రాష్ట్రంలోని పత్తి రైతుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఢిల్లీకి ప్రతినిధి బృందాన్ని పంపి కేంద్రంపై ఒత్తిడి తేవాలని సీఎం రేవంత్‌రెడ్డిని కేటీఆర్ డిమాండ్ చేశారు. గతంలో ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం మొండికేసినప్పుడు, గత సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రుల బృందం ఈ అంశంలో ప్రత్యేక చొరవ చూపిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో వెంటనే కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
పత్తి కొనుగోళ్లు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తేవడంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. సీఎం రేవంత్‌రెడ్డి 57 సార్లు ఢిల్లీకి వెళ్లినా, రాష్ట్రం నుంచి 8మంది బీజేపీ, 8 మంది కాంగ్రెస్ ఎంపీలున్నా పత్తి రైతుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లకపోవడం దుర్మార్గం. రైతులకు అండగా నిలవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రాన్ని ప్రశ్నించకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది.
-కేటీఆర్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి వల్ల పత్తి రైతులకు కనీస మద్దతు ధర కూడా దక్కడం లేదు. ఇప్పటికే భారీ వర్షాలు కురిసి పంటలు నష్టపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులు, మిగిలిన పంటను కూడా అమ్ముకోలేక నష్టాల పాలవుతున్నరు. రాష్ట్రంలో దాదాపు 50 లక్షల ఎకరాల్లో పత్తి పండిస్తున్న రైతన్నలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దారుణం.
-కేటీఆర్
పత్తి కొనుగోళ్లపై కేంద్రంలోని బీజేపీ సరారు ఉద్దేశ పూర్వకంగానే కొర్రీలు పెడుతున్నది. గతంలో ఎకరాకు 12 క్వింటాళ్ల దాకా కొనుగోలు పరిమితి ఉంటే, దాన్ని 7 క్వింటాళ్లకే తగ్గించడం రైతులకు తీవ్ర ఇబ్బంది కరంగా మారింది. జిన్నింగ్ మిల్లుల అవినీతి అంటూ కుంటి సాకులు చెప్తూ కేవలం 7 క్వింటాళ్లే కొంటే మిగిలిన పంటను రైతులు ఎకడ అమ్ముకోవాలి?
-కేటీఆర్