హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అంటేనే మోసం, దగా, నయవంచన అనే నిజం ఫార్మా సిటీ భూముల వ్యవహారంతో మరోసారి నిరూపితమైందని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు. అబద్ధపు హామీలివ్వడం, యథేచ్ఛగా చట్టాలను ఉల్లంఘించడం, ప్రశ్నించిన వారిని వేధించడం, సిగ్గులేకుండా భూ కబ్జాలు చేయడమే మూల స్తంభాలుగా రేవంత్ ప్రభుత్వ పాలన నడుస్తున్నదని మండిపడ్డారు. అంతరించి పోయాయని అనుకున్న రాబందులు కాంగ్రెస్ నేతల రూపంలో తెలంగాణ ప్రజలను పీకు తింటున్నాయని విమర్శించారు. అధికారంలోకి వస్తే ఫార్మా సిటీని రద్దుచేసి భూములను తిరిగి ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇతర అవసరాలకు వాటిని మళ్లించడం అత్యంత నీచమైన చర్యగా అభివర్ణించారు. అధికారం ఉన్నదన్న అహంకారంతో ప్రజల అనుమతి లేకుండా భూముల సర్వే జరపాలనుకోవడం ఫాసిస్టు చర్య అని విమర్శించారు. మా భూములు మాగ్గావాలె అని మర్లవడ్డ రైతులపై అక్రమ కేసులు పెడుతున్న రేవంత్ రాక్షసత్వాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ఫార్మా రైతులను నిలువునా ముంచి అనుముల అన్నదమ్ముల కోసమే ఫ్యూచర్ సిటీని రేవంత్‌రెడ్డి నిర్మిస్తున్నారని విమర్శించారు.
మర్లవడుతున్నా బుద్ధి వస్తలేదు
రాష్ట్రంలో ప్రభుత్వ తీరుపై అడుగడుగునా అన్నదాతలు మర్లవడుతున్నా, ఏకంగా ఎమ్మెల్యేల ఇండ్లు ముట్టడిస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బుద్ధిరావడం లేదని కేటీఆర్ విమర్శించారు. చట్టప్రకారం భూములను తిరిగి పొందే హకు ఉన్న రైతులతో ప్రభుత్వం ఎందుకు చర్చించడం లేదని ప్రశ్నించారు. ఓ వైపు ఫార్మా సిటీ రద్దు చేస్తున్నట్టు ప్రకటించి, మరోవైపు కొనసాగిస్తామని హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన రేవంత్ ప్రభుత్వం అటు ప్రజలను, ఇటు న్యాయస్థానాలను మోసం చేసిందని మండిపడ్డారు. ఫార్మాసిటీ రద్దయితే తమ భూములు తిరిగి వస్తాయని ఆశపడ్డ రైతుల నోట్లో మట్టికొడుతున్న రేవంత్‌రెడ్డికి కర్రుగాల్చి వాతపెట్టేందుకు అన్నదాతలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. లగచర్ల గిరిజన రైతుల భూములు, కంచగచ్చిబౌలి అటవీ భూములు, అనుముల బ్రదర్స్ కోసం ఇప్పుడు ఫార్మాసిటీ అన్నదాతల భూములను చెరబట్టే పన్నాగాల దాకా రేవంత్ పాపాల పుట్ట రోజురోజుకూ పెరిగిపోతూనే ఉన్నదని విమర్శించారు. దోస్తులకు దోచిపెట్టేందుకు చీకటి ఒప్పందాలతో తెరపైకి తెచ్చిన ఫ్యూచర్ సిటీకి అక్రమంగా భూములు కేటాయిస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. భూములు తిరిగి ఇచ్చేవరకు రైతుల పక్షాన బీఆర్ఎస్ ఉద్యమిస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఇది కేసీఆర్ లెగసీ!
హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దూరదృష్టి, అవిశ్రాంత కృషికి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిదర్శనమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తెలిపారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామంలో శుక్రవారం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్యూనిట్-1 (800 మెగావాట్లు)ను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన సందర్భంగా, ఈ ఇంజినీరింగ్ అద్భుతాన్ని సాధ్యం చేసిన కేసీఆర్ విజన్‌ను శుక్రవారం ఎక్స్ వేదికగా కేటీఆర్ గుర్తుచేసుకున్నారు. ‘యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ 4000 మెగావాట్ల (5×800) స్థాపిత సామర్థ్యంతో భారతదేశంలో రాష్ట్రం నడిపే అతిపెద్ద థర్మల్ పవర్ ప్లాంట్. భారతీయ విద్యుత్తు రంగంలో పబ్లిక్ సెక్టార్ యూనిట్‌కు ఇచ్చిన అతిపెద్ద ఆర్డర్‌గా 20,400 కోట్లతో భెల్ (బీహెచ్ఈల్)కు ఆర్డర్ ఇవ్వబడింది. అన్ని రంగాలకు 247 విద్యుత్ సరఫరా నిర్ధారించడానికి, విద్యుత్తు కోతలు, అంతరాయాలను అంతం చేయడానికి నిర్మించబడింది. తెలంగాణ స్థాపిత విద్యుత్తు సామర్థ్యం 2014లో 7,778 మెగావాట్ల నుంచి కేవలం 10 పదేండ్లలో దాదాపు 20,000 మెగావాట్లకు పెరిగింది. తెలంగాణపై కేసీఆర్ మరో చెరగని ముద్ర. ఈ విజయం కేసీఆర్ నాయకత్వం, రాష్ట్రాభివృద్ధి కోసం ఆయన చేసిన అవిశ్రాంత కృషికి నిదర్శనం’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
బలగం బృందానికి కేటీఆర్ అభినందన
హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): బలగం సినిమాలోని ‘ఊరు.. పల్లెటూరు’ పాటకు బెస్ట్ లిరిక్స్ విభాగంలో జాతీయ అవార్డు సాధించిన ప్రముఖ గేయ రచయిత కాసర్ల శ్యామ్‌కు, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్కు, బలగం టీమ్‌కు బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందనలు తెలిపారు. తెలంగాణలోని పల్లెవాసనకు పట్టంకట్టి ఆ పరిమళాలను విశ్వవ్యాప్తంగా వెదజల్లిన బలగం సినిమాకు నేషనల్ అవార్డు దకడం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ఎంతో గర్వకారణమని తెలిపారు. దూరమవుతున్న మానవ సంబంధాలను తట్టిలేపిన గొప్ప సినిమాలోని ఊరు-పల్లెటూరు పాట కుటుంబాలను ఏకం చేయడమే కాదు.. మూడు తరాలను దగ్గర చేసిందని పేర్కొన్నారు.‘బలగం’లోని ప్రతి ఒక సభ్యుడికి కేటీఆర్ అభినందనలు తెలిపారు.