Hydraa | హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): కనికరం లేకుండా హైడ్రా చేపట్టిన కూల్చివేతలతో రోడ్డున పడ్డ కుటుంబాలకు చెందిన చిన్నారుల ఆవేదన ఇది! సున్నం చెరువు కూల్చివేతల పర్వంలో అధికారుల అత్యుత్సాహం విమర్శలకు దారితీస్తున్నది. కనీసం పుస్తకాలను కూడా తీసుకోనివ్వకుండా, స్కూల్ బ్యాగులను సైతం ముట్టుకోనివ్వకుండా బుక్స్ తీసుకుంటామంటే సమయం ఇవ్వకుండా పుస్తకాలన్నీ బయట పడేసి తమను పోలీసులు గుంజుకుంటూ బయటకు పంపించి ఇండ్లు కూలగొట్టారంటూ సున్నంచెరువు కూల్చివేతల బాధిత చిన్నారులు రోదించిన తీరు హృదయాలను కలిచివేస్తున్నది.
పుస్తకాలపైకీ బుల్డోజరా?: కేటీఆర్
చిన్నారుల మాటలకు చలించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీఎం రేవంత్‌పై తీవ్రంగా మండిపడ్డారు. ‘చిన్నారుల మాటలు వినైనా మీకు బాధనిపించలేదా? ఓ చిన్నారిపైనా ఈ సీఎం ప్రతాపం’ అంటూ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇండ్లపైకే కాక పుస్తకాలపైకీ బుల్డోజర్లు పంపుతారా?’ అని ప్రశ్నించారు. చిన్నారుల గూడు చెదరగొట్టిన రేవంత్ సర్కారుకు పేదలపై ప్రేమలేదని, పసిహృదయాలను గాయపరిచిన సీఎంకు మనసే లేదని విమర్శించారు.
బుక్స్ తీసుకుంటమంటే గ్యాప్ ఇవ్వకుండా మమ్మల్ని పోలీసులు పట్టుకొని గుంజేసిండ్రు. బుక్స్ బయటకు తీయకుండా.. మమ్మల్ని కూడా తీసుకోనివ్వకుండా రోడ్డున పడేస్తే మేమెట్ల చదువుకోవాలి? ఎక్కడుండాలి?
-మరో చిన్నారి ప్రశ్న
నా బుక్స్ అక్కడనే పడిపోయినయ్. అందరి బుక్స్ అక్కడనే ఉన్నయ్.. బ్యాగులు కూడా తీసుకోనియ్యలే..
-ఓ చిట్టితల్లి ఆవేదన