హైదరాబాద్, మే 23(నమస్తే తెలంగాణ): ధాన్యం కుప్పలపై రైతన్నలు కుప్పకూలిపోతున్నా ఈ కరశ కాంగ్రెస్ సర్కార్‌కు కనికరం కలుగడం లేదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, కేంద్రాల్లో రైతుల ఇబ్బందులపై శనివారం ఆయన ఎక్స్(ట్విట్టర్) వేదికగా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యవస్థలు పూర్తిగా కుప్పకూలాయని ధ్వజమెత్తారు. ‘రైతులు రాలిపోతున్నా చలనం లేని రాక్షసపాలన సాగుతున్నది. అన్నదాతల చావులను చూసి ముఖ్యమంత్రి ఆనందిస్తున్నారా?’ అంటూ ఘాటుగా ప్రశ్నించారు. కేంద్రాల వద్ద మండుటెండల్లో రైతుల గుండెలు ఆగిపోతున్నా ప్రభుత్వానికి కనీస కనికరం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు కొనకుండా రైతులను ఇంకెంతకాలం యాతన పెడుతారని ప్రశ్నించారు. ఇంకెన్ని చావులు కావాలి? ఇంకెన్ని కుటుంబాలు రోడ్డున పడాలి? ప్రభుత్వం దున్నపోతు మీద వానపడ్డట్టు ప్రవర్తించడం ఆపాలి’ అంటూ విమర్శించారు. క్యాబినెట్ మీటింగ్‌ను ప్రస్తావిస్తూ ‘ఇకనైనా సోయి తెచ్చుకొని, ధాన్యం కొనుగోలుపై చిత్తశుద్ధితో చర్చించాలి. తక్షణమే పంట కొనుగోళ్లు పూర్తి చేసి, రైతన్నల తిప్పలు తప్పించాలి’ అని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.