హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులతో జలాశయాలు ఎండిపోతుంటే, ప్రభుత్వం రాజకీయ కక్షతోనే కాళేశ్వరం పంపులను నడుపడం లేదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. మేడిగడ్డ బరాజ్ గేట్లను ముట్టకుండా, వాటిని మూయకుండానే 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్నెపల్లి పంప్‌హౌస్ మోటర్లను ఆన్‌చేసి నీటిని ఎత్తిపోయవచ్చని సాంకేతిక ఆధారాలతో స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం రాసిన వివరణాత్మక లేఖను మీడియాకు విడుదల చేశారు. ప్రస్తుతం కన్నెపల్లి వద్ద పంపులు నడుపడానికి గోదావరి అవసరమైన దానికంటే ఎకువ ఎత్తులోనే ప్రవహిస్తున్నదని, రోజుకు 2 టీఎంసీల చొప్పున రాబోయే 100 రోజుల్లో 200 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేస్తే ఉత్తర తెలంగాణలోని రిజర్వాయర్లన్నింటినీ నింపి, రైతాంగాన్ని కరువు నుంచి కాపాడవచ్చని గణాంకాలతో సహా వివరించారు.
తెలంగాణభవన్‌లో శనివారం శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, లోక్‌సభలో పార్టీ మాజీ ఫ్లోర్ లీడర్ నామా నాగేశ్వర్రావు, మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య, మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ చీఫ్‌విప్ వెంకటరమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ధర్మారెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఇది కేవలం రాజకీయ పరమైన సబ్జెక్ట్ కాదని, రాష్ట్ర ప్రయోజనాలకు, లక్షలాది మంది రైతాంగానికి సంబంధించిన అంశమని చెప్పారు. అందువల్లే తాము ఇంజినీర్ల లెకలు, సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) అధికారిక గణాంకాలతో సహా క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఈ సమావేశానికి వచ్చినట్టు తెలిపారు. ‘ప్రస్తుతం గోదావరి బేసిన్ పరిధిలో తెలంగాణలో మొత్తం 57 మీడియం, మేజర్ రిజర్వాయర్లు ఉన్నయ్. వాటి మొత్తం కంబైన్డ్ స్టోరేజీ కెపాసిటీ 418 టీఎంసీలు కాగా, శనివారం ఉదయం 11 గంటల లెకల ప్రకారం వాటిలో 94 టీఎంసీల నీరే ఉన్నది. రాష్ట్రంలోని జలాశయాలు 23 శాతమే నిండి ఉన్నయ్. ఇంకా 77 శాతం జలాశయాలు పూర్తిగా ఖాళీగా ఉన్నయ్. రాష్ట్రంలోని చెరువుల మొత్తం కంబైన్డ్ స్టోరేజీ 253 టీఎంసీలు ఉంటే 50 శాతానికిపైగా చెరువులు ఖాళీగా ఉన్నయ్’ అని ఆందోళన వ్యక్తంచేశారు.
మోటర్లు నడుపాలని రిటైర్డ్ ఇంజినీర్ల లేఖ
రాష్ట్రంలో వర్షాల్లేక, జలాశయాల్లో నీరు లేక రైతులు అల్లాడుతుంటే ప్రభుత్వం చేతులెత్తేసిందని కేటీఆర్ మండిపడ్డారు. ఈ సమస్యను ఎలా అధిగమించవచ్చో వివరిస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం (రిటైర్డ్ ఇంజినీర్స్ అసోసియేషన్) అధ్యక్షుడు శ్యామ్ ప్రసాద్‌రెడ్డి, జనరల్ సెక్రటరీ వెంకటేశం డీటెయిల్డ్ లెటర్ రాశారని తెలిపారు. ఇందుకు సంబంధించిన లేఖను మీడియాకు చూపించారు. లేఖలోని కీలకమైన అంశాలను ప్రస్తావిస్తూ మేడిగడ్డ బరాజ్‌కు, కన్నెపల్లి పంప్ హౌస్‌కు మధ్య దాదాపు 14 కిలోమీటర్లకు పైగా దూరం ఉన్నదని చెప్పారు. మేడిగడ్డ బరాజ్ గేట్లను ముట్టకుండా, వాటిని మూయకుండా, యథాతథ స్థితిని కొనసాగిస్తూనే పంపులు నడుపవచ్చని తెలిపారు. కన్నెపల్లి దగ్గర గోదావరి ప్రవాహం 93.5 మీటర్లు నమోదైతే వెంటనే మోటర్లను ఆన్ చేయవచ్చని ఇంజినీర్లు స్పష్టంగా చెప్పారని గుర్తుచేశారు. ఈ రోజు కన్నెపల్లి వద్ద గోదావరి 96.79 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్నదని, అంటే సాంకేతికంగా పంపులు నడుపడానికి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టంచేశారు.
మా పర్యటనతో కాంగ్రెస్ బండారం బట్టబయలు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భేషజాల వల్లనే పంపులు ఆన్ చేయడం లేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. అన్నారం, సుందిల్ల బరాజ్‌ల వద్ద గ్రౌటింగ్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయని, అకడ మినిమమ్ డ్రా డౌన్ లెవెల్ (ఎండీడీఎల్) మెయింటైన్ చేస్తూ నీటిని పైకి సాఫీగా పంపవచ్చని ఇంజినీర్లే చెప్తున్నారని తెలిపారు. లక్ష్మీ, సరస్వతి, పార్వతి మూడు పంపింగ్ స్టేషన్లను సమన్వయంతో నడిపిస్తే అన్నారంలో 5.1 టీఎంసీలు, సుందిల్లలో 3.78 టీఎంసీల నీటిని నిల్వ చేస్తూ మొత్తం 8.8 టీఎంసీల వరకు నిల్వ ఉంచి ఎల్లంపల్లికి పంపవచ్చని చెప్పారు. వచ్చే వంద రోజుల్లో 200 టీఎంసీలు నింపుకోవచ్చని తెలిపారు. ఈ నిజాన్ని ఒప్పుకోవడానికి ముఖ్యమంత్రికి భేషజాలు అడ్డం వస్తున్నాయని మండిపడ్డారు. ‘మమ్మల్ని అడుగడునా అడ్డుకున్నా ఏడుగంటలు ప్రయాణం చేసి మొన్న కన్నెపల్లి వెళ్లి అకడ పారుతున్న లక్షల క్యూసెకుల నీటిని ప్రజలందరికీ చూపించినం. దాంతో కాంగ్రెస్ బండారం బయటపడ్డది. తెలంగాణ రైతుల మీద కక్షతోనే రేవంత్‌రెడ్డి పంపులకు తాళాలు వేసిండు’ అని నిప్పులుచెరిగారు.
అది మేడిగడ్డ కాదు.. మేటిగడ్డ
మేడిగడ్డ గేట్లు మూసి నీళ్లు ఎత్తాలని తాము ఏనాడూ చెప్పలేదని కేటీఆర్ స్పష్టంచేశారు. కానీ గేట్లు దించితే మేడిగడ్డ కొట్టుకుపోదని, భద్రాద్రి రాముడికి ముప్పు వస్తదని రేవంత్‌రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘రేవంత్‌రెడ్డి అవగాహన పెంచుకోవాలి. 2022 జూలై 15న అంటే నాలుగేండ్ల క్రితం దాదాపు ఇదే సమయంలో గోదావరిలో భయంకరమైన వరద వచ్చింది. 500 సంవత్సరాల్లో ఎన్నడూ రానంత వరద అది. దాదాపు 28.50 లక్షల క్యూసెక్కుల వరద. 247 టీఎంసీల నీరు ఉప్పెనలా వచ్చింది. ఇప్పుడు వచ్చే ప్రవాహం కన్నా 28.50 రెట్లు ఎక్కువ. 15 రోజులు వరుసగా వస్తే కూడా మేడిగడ్డ కొట్టుకుపోలేదు. అన్నారానికి, సుందిళ్లకు ఏమీ కాలేదు. బ్రహ్మాండంగా తట్టుకొని నిలబడ్డది. అది మేడిగడ్డ కాదు.. మేటిగడ్డ అని రుజువు చేసింది’ అని పేర్కొన్నారు. ‘247 టీఎంసీల వరదను తట్టుకున్న మేడిగడ్డ ఇప్పుడు వచ్చే తొమ్మిది టీఎంసీలను తట్టుకోలేదా? అన్నారం, సుందిళ్లలో గ్రౌటింగ్ చేసిన మాట వాస్తవం కాదా? రిటైర్డ్ ఇంజినీర్లు చెప్తున్న మాట మీకు వినిపించడం లేదా? అని ప్రశ్నించారు. తాము మేడిగడ్డను ముట్టుకోవాలనో, గేట్లు దించాలనో అనడం లేదని, 15 రోజులు వరుసగా 240కి పైగా టీఎంసీల వరదకు ఏమీకాని భద్రాచలం.. లక్ష క్యూసెక్కులకు కొట్టుకుపోతదని సీఎం అబద్ధాలు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఇలా మాట్లాడుతున్న ముఖ్యమంత్రిని పిచ్చోడనాలా? మంచోడనాలా? అనేది రాష్ట్ర ప్రజలు, రైతులు ఆలోచన చేయాలి’ అని సూచించారు.
ట్యూషన్ చెప్పించుకోండి
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఇరిగేషన్ వ్యవస్థపై కనీస అవగాహన లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ప్రెస్మీట్లలో పకన మంత్రులను కూర్చోబెట్టుకొని అజ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నారని, దేవాదుల ప్రాజెక్ట్ ఏ బేసిన్ కిందకు వస్తుందో కూడా తెలియని వ్యక్తి రేవంత్‌రెడ్డి అని దుయ్యబట్టారు. కాళేశ్వరం అనేది అధిక వర్షపాతం, సాధారణ వర్షపాతం, ఎల్ నినో ప్రభావంతో కరువు వచ్చినప్పుడు కూడా రాష్ట్రాన్ని కాపాడే మూడు రకాల అద్భుతమైన ప్రణాళికలతో కట్టిన కల్పతరువు అని స్పష్టంచేశారు. ‘సీఎం.. వరద నీటిని ఎత్తిపోయడానికే కదా కాళేశ్వరం అంటారు? మీకు తెలియకపోతే.. మేము చెప్పేది వినడం ఇష్టం లేకపోతే మీ ఇంజినీర్లతో ట్యూషన్ చెప్పించుకోండి. మూడు రకాల పరిస్థితులను సద్వినియోగం చేసుకొనే గొప్ప అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం. రాష్ట్రంలో అధిక వర్షపాతం నమోదైతే శ్రీరామ్‌సాగర్ కెనాల్ ద్వారా డైరెక్టుగా మిడ్‌మానేరుకు నీళ్లు వస్తయ్. అక్కడి నుంచి లిప్టు చేసుకోవచ్చు. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటది. ఇది ఒక విధానం.
సాధారణ వర్షపాతం ఉంటే ఎస్సారెస్పీ నిండి, కాకతీయ కాలువ ద్వారా కడెం నుంచి ఎల్లంపల్లికి నీళ్లు వస్తయ్. అక్కడి నుంచి నీళ్లు ఎత్తిపోసుకోవచ్చు. ఇది రెండో విధానం. ఒకవేళ ఈ రోజు లాంటి కరువు పరిస్థితులుంటే.. ఎక్కడ నీళ్లు ఉంటాయని వెతికి, పట్టుకున్న పాయింట్ కాళేశ్వరం. అక్కడ ఎలాంటి కరువు పరిస్థితుల్లో అయినా నీళ్లు ఉంటయ్. ఇప్పుడు కూడా తొమ్మిది టీఎంసీల నీళ్లు పోతున్నయ్. తొమ్మిది టీఎంసీలు అంటే తొమ్మిది హుస్సేన్‌సాగర్‌లతో సమానం. మా మీద కక్ష ఉంటే కేసులు పెట్టు. మా మీద కక్ష ఉంటే బూతులు తిట్టు. ఇంకా రోత మాటలు మాట్లాడు. మాకేం పర్వాలేదు. కానీ, దయచేసి రైతులపై పగబట్టకు. రైతులపై కోపం తీర్చుకోకు. కాళేశ్వరాన్ని కూలేశ్వరం అనే పనికిమాలిన మాటలు మానెయ్యాలె. లక్షలాది మంది రైతుల నోట్లో మట్టికొట్టొద్దు’ అని హితవుపలికారు.
భద్రాచలానికి పోలవరంతోనే ముప్పు
భద్రాచలానికి ప్రమాదం ముమ్మాటికీ పక రాష్ట్రం కడుతున్న పోలవరంతోనే గానీ కాళేశ్వరంతో కాదని కేటీఆర్ స్పష్టంచేశారు. పోలవరం ముంపు కోసమే భద్రాచలంలోని ఏడు మండలాలను బీజేపీ సర్కార్ ఏపీలో కలిపింది నిజం కాదా? అని ప్రశ్నించారు. ‘పోలవరం గురించి గట్టిగా మాట్లాడితే మీ గురువుకు కోపం వచ్చి ఇబ్బంది అయితదని రేవంత్‌రెడ్డి మాట్లాడట్లేదు. భద్రాచలానికి ముప్పు కేవలం పోలవరం ఎత్తుతో తప్ప మరొకటికాదు. పోలవరం ఎత్తు పెంచడం వల్ల భద్రాచలం మునుగుతదని హరీశ్‌రావు పోలవరం అథారిటీకి ఫిర్యాదు చేస్తే కేంద్రం సర్వేల కోసం అధికారుల బృందాన్ని పంపించింది’ అని గుర్తుచేశారు. ఏ ముఖ్యమంత్రి అయినా తన రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడుతారని, కానీ, ఈ ముఖ్యమంత్రి సొంత రాష్ట్ర ప్రాజెక్టుతో సొంత గడ్డకే ప్రమాదమని వాదిస్తున్నారని మండిపడ్డారు. హరీశ్‌రావును పట్టుకొని పరిజ్ఞానం ఉన్నదా? అని రేవంత్ అంటున్నారని, పరిజ్ఞానం ఎవరిదో.. మిడిమిడిజ్ఞానం ఎవరిదో.. ప్రజలకు ఇప్పటికే అర్థమైందని హితవుపలికారు. ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకొని దేవుండ్లను కూడా నీచ రాజకీయాల కోసం వాడుకోవడం బంద్ చేయాలని సూచించారు. ఎన్నికల ముందు ఇదే భద్రాచలం వెళ్లి రాములవారి మీద, యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి మీద, కనబడ్డ దేవుళ్లందరి మీద రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని, మరి అమలుచేశారా? అని ప్రశ్నించారు. దేవుళ్ల గురించి, శ్రీరాముడి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకొని ఉండాలని, మేడిగడ్డతో రాముడు మునిగిపోతడు అంటే ఆయనకు కోపమొస్తదని, అది సీఎంకే నష్టదాయకమని హెచ్చరించారు.
ఒక్కసారైనా ఎత్తిపోతలపై రివ్యూ చేశారా?
‘ప్రభుత్వంలో ఉన్నది మీరు. ప్రభుత్వాన్ని నడుపుతున్నది మీరు. ఇంజినీరింగ్ విభాగం మొత్తం మీ ఆధీనంలో ఉంటది. ఒక్కసారైనా రివ్యూచేశావా? కన్నెపల్లిలో పంపులు స్టార్ట్‌చేస్తే ఏమైతది? రిటైర్డ్ ఇంజినీర్లు ఉత్తరం రాశారు కాదా? వెంటనే స్టార్ట్ చేయవచ్చా? అని ఒక్కసారైనా అధికారులతో రివ్యూ చేశావా?’ అని ముఖ్యమంత్రిని కేటీఆర్ ప్రశ్నించారు. అన్నారం, సుందిళ్లలో గ్రౌటింగ్ జరిగిన విషయమైనా తెలుసా? అని నిలదీశారు. ‘దేవాదుల ఏ బేసిన్లో ఉన్నదో తెల్వదు.. నల్లమల ఏ రాష్ట్రంలో ఉన్నదో తెల్వదు. ఎంతసేపు సర్వే నంబర్లు, రియల్ ఎస్టేట్, ఏది బ్లాక్లిస్టుల పెట్టాలె? ఏది ఎట్లా డీల్ చెయ్యాలె? ఎవన్ని పిలువాలె? ఎవని మెడకు తుపాకీ పెట్టాలె? ఎవన్ని బెదిరించాలె? సాయంత్రం గల్లాపెట్టె లెక్కబెట్టుకోవాలె. ఇదీ నువ్వు.. నీ అన్నదమ్ములు చేస్తున్న దందా తప్ప మరోటి లేదు. ఎంతసేపు ఎనుముల గురించే కాదు.. అప్పుడప్పుడు అన్నారం గురించి కూడా ఆలోచించు. ఎనుముల కుటుంబం అన్నదమ్ములే కాదు.. మీపైసలు, మీ సంపాదనే కాదు.. రాష్ట్ర ప్రజల గురించి కూడా పట్టించుకో’ అని హితవుపలికారు.
గోదావరిలో నీళ్లు లేకుంటే పట్టిసీమ ఎలా నడుస్తున్నది?
కాళేశ్వరాన్ని బదనాం చేయాలనే ఒకే ఒక శాడిస్టిక్ ప్లెజర్తో రేవంత్‌రెడ్డి రోజుకు 9 టీఎంసీల నీటిని సముద్రం పాలుచేస్తున్నాడని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కన్నెపల్లి వద్ద లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా పోతున్నా ముఖ్యమంత్రి అక్కడ నీళ్లు లేవని అంటున్నాడని, ఆయన మాటే నిజమైతే ఆంధ్రాలో ఇదే గోదావరి మీద పట్టిసీమ లిఫ్టు మోటర్లు ఎట్లా నడుపుతున్నారని ప్రశ్నించారు. ఏపీ సర్కార్ పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మోటర్లను ఆన్‌చేసి బ్రహ్మాండంగా నీటిని ఎత్తిపోసుకుంటుంటే, ఇకడ మన రైతులకు నీళ్లు లేవని సీఎం అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు. సీఎం అబద్ధాలను రైతులు అర్థంచేసుకొని ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతున్నారని దుయ్యబట్టారు. ‘కేసీఆర్ నాలుగేండ్లలో అంతగొప్ప కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. మరి మీరు నాలుగు-ఐదు దశాబ్దాలు శ్రీరామ్‌సాగర్ కట్టారు. కాళేశ్వరానికి చిన్న సమస్య వస్తే పరిష్కరించలేరా? సుతారీలు లేరా? సిమెంట్ లేదా? ఇంజినీర్లు లేరా? అని ఓ సామాన్య రైతు నిలదీశారు’ అని గుర్తుచేశారు. దీన్ని తట్టుకోలేకనే రేవంత్‌రెడ్డి దిక్కుమాలిన డైలాగులు కొడుతున్నాడని ఎద్దేవాచేశారు.
200 టీఎంసీలు ఎత్తిపోస్తే సగం తెలంగాణ సస్యశ్యామలం
కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ ఇచ్చిన 50-60 ఏండ్ల్ల డాటాను పరిశీలిస్తే, జూలై నుంచి అక్టోబర్ వరకు గోదావరిలో ఇదే తీరున ప్రవాహం కొనసాగుతుందని కేటీఆర్ వివరించారు. అంటే ఈ రోజు నుంచి అక్టోబర్ వరకు దాదాపు 100 రోజులపాటు నిరంతరాయంగా నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నదని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో నిర్మించిన కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున నీటిని లిఫ్ట్ చేసే కెపాసిటీ ఉన్నదని తెలిపారు. ఈ వంద రోజుల్లో రోజుకు రెండు టీఎంసీల చొప్పున మొత్తం 200 టీఎంసీల నీటిని గనుక లిఫ్ట్ చేస్తే తెలంగాణ గోదావరి బేసిన్ రూపురేఖలే మారిపోతాయని వివరించారు. ఈ 200 టీఎంసీల నీటితో మిడ్‌మానేరు, లోయర్ మానేరు, శ్రీరామ్‌సాగర్ (ఎస్సారెస్పీ), మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, అనంతగిరి, మల్కపేట, బస్వాపూర్ లాంటి అన్ని రిజర్వాయర్లను నింపి, ఉత్తర తెలంగాణలోని ఆరు, ఏడు ఉమ్మడి జిల్లాల రైతాంగాన్ని, వారి పంటలను సుభిక్షంగా కాపాడుకోవచ్చని గణాంకాలతో సహా స్పష్టంచేశారు. ఇది తన అభిప్రాయం కాదని, తమ నేతల మాట కాదని, దశాబ్దాలపాటు ఇరిగేషన్‌శాఖలో పనిచేసిన రిటైర్డ్ ఇంజినీరింగ్ అధికారులు ఆధారాలతో చెప్తున్న విషయమని పేర్కొన్నారు.
మోటర్లు రెడీ.. ఎందుకు నడుపరు?
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌రెడ్డి బురద జల్లుతున్నారని, 2022 నాటి ఫొటోలు చూపించి కన్నెపల్లి పంప్‌హౌస్ మునిగిందని చెప్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఇప్పుడు కన్నెపల్లిలో మోటర్లు రెడీగా ఉన్నాయని, బటన్ నొక్కితే పనిచేస్తాయని చెప్పారు. నీళ్లు లేక రైతులు ఏడుస్తుంటే.. బీఆర్ఎస్పై కోపంతో నీళ్లు ఎత్తక పైశాచికానందం పొందుతున్నారని విమర్శించారు. ‘ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు చెప్తున్నరు. దాని ప్రభావంతో ఎక్కడా నీళ్లు లేవు. ఒక్క కన్నెపల్లి దగ్గర మాత్రమే నీళ్లు ఉన్నయ్. గోదావరిలో ప్రాణహిత నుంచి నీళ్లు వస్తున్నయ్. అక్టోబర్ వరకు ఈ వరద వస్తూనే ఉంటుంది. వచ్చే వారం రోజులు వానలు లేవని శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు. మేడిగడ్డ బరాజ్‌ను ముట్టుకోకుండానే దానికి 14-15 కిలోమీటర్ల దూరంలోని కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద 97 మీటర్ల మీదుగా ప్రవహిస్తున్న గోదావరి నుంచి నీళ్లు ఎత్తిపోస్తే.. ఆ నీళ్లతో అన్నారం, సుందిళ్ల.. ఎల్లంపల్లి, మిడ్‌మానేరు.. ఇలా మొత్తం జలాశయాలను నింపొచ్చు’ అని సూచించారు. ‘ఇది కాలం తెచ్చిన కరువు కాదు. కాంగ్రెస్ కక్షతోనే తెచ్చిన కరువు. ఈ విషయాన్ని రైతులు గ్రహించాలి. ఓ వైపు రైతులు పంటలు ఎట్లా కాపాడుకోవాలి. అప్పులు ఎట్లా తీర్చాలని మదన పడుతుంటే.. మరోవైపు కాంగ్రెస్ రాజకీయ కక్షలు, సెటిల్మెంట్లలో బిజీ అయిపోయింది’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
2022 జూలై 15న అంటే నాలుగేండ్ల కింద దాదాపు ఇదే సమయంలో గోదావరిలో భయంకరమైన వరద వచ్చింది. 500 ఏండ్లలో ఎన్నడూ రానంత వరద.. దాదాపు 28.50 లక్షల క్యూసెక్కుల వరద. 247 టీఎంసీల నీరు ఉప్పెనలా వచ్చింది. ఇప్పుడు వచ్చే ప్రవాహం కన్నా 28.50 రెట్లు ఎక్కువ.. 15 రోజులు వరుసగా వస్తే కూడా మేడిగడ్డ కొట్టుకుపోలే. అన్నారానికి, సుందిళ్లకు కూడా ఏమీ కాలే. బ్రహ్మాండంగా తట్టుకొని నిలబడ్డది.. అది మేడిగడ్డ కాదు..మేటిగడ్డ అని రుజువు చేసింది.
-కేటీఆర్
ప్రస్తుతం గోదావరి బేసిన్లో తెలంగాణలో మొత్తం 57 మీడియం, మేజర్ రిజర్వాయర్లున్నయ్. వాటి మొత్తం కంబైన్డ్ స్టోరేజీ కెపాసిటీ 418 టీఎంసీలు. శనివారం ఉదయం 11 గంటల లెకల ప్రకారం వాటిలో 94 టీఎంసీల నీరే ఉన్నది. 23 శాతం జలాశయాలే నిండి ఉన్నయ్. ఇంకా 77 శాతం పూర్తిగా ఖాళీగా ఉన్నయ్. రాష్ట్రంలోని చెరువుల మొత్తం కంబైన్డ్ స్టోరేజీ 253 టీఎంసీలు. అవికూడా 50 శాతానికిపైగా ఖాళీ ఉన్నయ్.
-కేటీఆర్
మేడిగడ్డ బరాజ్ గేట్లను ముట్టకుండా.. వాటిని మూయకుండా.. యథాతథ స్థితిని కొనసాగిస్తూనే కన్నెపల్లి దగ్గర నదీ ప్రవాహం 93.5 మీటర్లు నమోదైతే వెంటనే పంప్‌హౌస్ మోటర్లు ఆన్ చేయవచ్చని రిటైర్డ్ ఇంజినీర్లు స్పష్టంగా చెప్పిండ్రు. ఈ రోజు కన్నెపల్లి దగ్గర గోదావరి నది 96.79 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్నది. అంటే సాంకేతికంగా పంపులు నడుపడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. -కేటీఆర్