KTR | హైదరాబాద్ సిటీబ్యూరో, మే 25 (నమస్తే తెలంగాణ ) : కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టినట్టు నిరూపించినా తాను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. ఎస్సీ, ఎస్టీలకు 6 లక్షలు, మిగతా వారికి 5 లక్షల ఇండ్లు ఇస్తామని చెప్పి ఒక్కటి కూడా కట్టలేదని స్పష్టంచేశారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధ్యక్షతన సోమవారం నగరంలో నిర్వహించిన కూకట్పల్లి నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో కాంగ్రెస్ నాటకాలు ఆడుతున్నదని మండిపడ్డారు. రెండున్నరేండ్లు దాటుతున్నా ప్రభుత్వం హైదరాబాద్‌లో గానీ, కూకట్పల్లి నియోజకవర్గంలో గానీ పేదల కోసం ఒక ఇైల్లెనా కట్టిం దా? ఒక ఇటుకైనా పేర్చిందా? అని నిలదీశారు.
ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన, ఇందిరమ్మ ఇండ్లు అంటూ పెద్దపెద్ద డైలాగులు చెప్పిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక శని, ఆదివారాలు వస్తే చాలు పేద ల ఇండ్లు కూలగొట్టడమే పనిగా పెట్టుకున్నదని విమర్శించారు. హైడ్రా పేరుతో పేదల జీవితాల్లో కాంగ్రెస్ అరాచకం సృష్టిస్తున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ కొద్ది కాలంలోనే రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైందని వాపోయారు. సెంట్రింగ్ కార్మికులు, హమాలీలు ఉపాధి కోల్పోయి ఇంది రాపార్ వద్ద ఆందోళన చేశారని, వారికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మద్దతుగా నిలిచారని తెలిపారు. భవన నిర్మాణ రంగ కార్మికులకు గులాబీ జెండా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
మళ్లీ వచ్చేది బీఆర్ఎస్సే
2028లో ముమ్మాటికీ వచ్చేది గులాబీ జెండాయేనని, ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆరేనని కేటీఆర్ స్పష్టంచేశారు. ‘నాడు 24 గంటల కరెంట్ ఎలాగైతే ఇచ్చామో, రేపు అధికారంలోకి రాగానే హైదరాబాద్ మహానగరంలో 24 గంటల ఉచిత తాగునీరు ఇచ్చే బాధ్యత కూడా నాదే’ అని ఆడబిడ్డలకు మాట ఇచ్చారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు కాంగ్రెస్ పాలనలో కరెంట్, నీటి కొరత తీవ్రంగా ఉండేదని, పట్టుదలతో 24 గంటల నిరంతర కరెంట్‌ను హైదరాబాద్ నగరానికి, రాష్ట్రానికి అందించామని గుర్తుచేశారు. తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే దగ్గరుండి మరీ హైదరాబాద్ నగరానికి 24 గంటల తాగునీటిని అందించేందుకు తానే బాధ్యత తీసుకుంటానని ప్రకటించారు. ప్రతి వర్గాన్నీ మోసం చేసింది కాంగ్రెస్ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ వచ్చాక హైదరాబాద్ నగరానికి రూపాయి కూడా అదనంగా ఖర్చు చేయలేదని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన అనేక ఫ్లై ఓవర్ల నుంచి మొదలుకొని టిమ్స్ దవాఖానల వరకు రిబ్బన్ కట్ చేసి ప్రతీది తామే కట్టినట్టు రేవంత్‌రెడ్డి బిల్డప్ ఇస్తున్నాడని ఎద్దేవాచేశారు.
దొంగ ఓట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి
పదేండ్లలో అభివృద్ధే లక్ష్యంగా తదేక దీక్షతో పని చేశామని, ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కష్టకాలంలో పార్టీ వెంట ఉన్న ప్రతి ఒక కార్యకర్తనూ, నాయకుడినీ గుర్తుంచుకొని తగిన అవకాశాలు కల్పిస్తామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ‘ప్రతి కార్యకర్తకూ, నాయకుడికీ ఇది నా హామీ’ అని చెప్పారు. ఈసారి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం డిజిటల్ రూపంలోనే నిర్వహిస్తున్నామని, సభ్యత్వ నమోదుకు సంబంధించిన కార్యక్రమం, కమిటీల ఏర్పాటు దాదాపు 50 రోజుల నుంచి 60 రోజుల పాటు కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. సభ్యత్వ నమోదుకు సంబంధించి కూడా పార్టీ కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)పై కేటీఆర్ ప్రత్యేకంగా ప్రజెంటేషన్ ఇచ్చారు. కాంగ్రెస్, బీజేపీ నమోదు చేయించిన దొంగ ఓట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, అర్హులైన ఏ ఒకరి ఓటు కూడా పోకుండా పార్టీ శ్రేణులు ప్రజలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రతి బూత్ నుంచీ తగిన ప్రణాళికతో ముందుకు పోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కుర్మయగారి నవీన్ రావు, శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, సీనియర్ నాయకులు గజ్జెల నగేశ్, రాగిడి లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేటర్లు మందాడి సత్యనారాయణ, జూపల్లి సత్యనారాయణ, ముద్దం నర్సింహయాదవ్, ఆవుల రవీందర్‌రెడ్డి, శ్రవణ్, పండాల సతీశ్‌గౌడ్, సబీహాబేగం, ఎర్రబెల్లి సతీశ్‌రావు పాల్గొన్నారు.