Hitler Home : జర్మన్ నియంత, లక్షలాది మంది మరణానికి కారణమైన అడాల్ఫ్ హిట్లర్ (Adolf Hitler) పుట్టిన ఇంటిని ఆస్ట్రియా ప్రభుత్వం (Austria Govt) పోలీస్ స్టేషన్ (Police Station) గా మార్చింది. నయా-నాజీలకు, తీవ్రవాద భావజాలం ఉన్నవారికి ఈ భవనం ఒక పుణ్యక్షేత్రంగా మారకుండా నిరోధించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టంచేసింది. సుదీర్ఘకాలంపాటు కొనసాగిన వివాదాలకు ముగింపు పలుకుతూ పునరుద్ధరించిన ఈ భవనాన్ని జూలై 22న అధికారికంగా ప్రారంభించారు.
ఆస్ట్రియాలోని బ్రానో అమ్ ఇన్ పట్టణంలో జర్మనీ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఈ ఇంట్లో హిట్లర్ 1889 లో జన్మించాడు. అయితే అతను ఇక్కడ కొద్ది కాలం మాత్రమే నివసించాడు. నాజీల పాలనలో ఈ భవనాన్ని ఒక స్మారక చిహ్నంగా, ఆర్ట్ మ్యూజియంగా మార్చారు. నాజీల పతనం తర్వాత ఈ భవనం నయా-నాజీలకు ఆకర్షణ కేంద్రంగా మారింది. ఏటా హిట్లర్ పుట్టినరోజున ఇక్కడికి వచ్చి నివాళులర్పించడం వివాదాలకు దారితీసింది.
ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ఆస్ట్రియా ప్రభుత్వం 2017లో ఈ భవనాన్ని చట్టపరంగా బలవంతంగా స్వాధీనం చేసుకుంది. అనంతరం సుమారు 20 మిలియన్ యూరోలకుపైగా భారీ వ్యయంతో దీనిని పునరుద్ధరించి పోలీస్ స్టేషన్‌గా మార్చింది. భవనం ముందు ఇప్పుడు కేవలం ‘పోలీస్’ అనే బోర్డు మాత్రమే కనిపిస్తుంది. హిట్లర్‌కు సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు లేకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. అయితే భవనం బయట గతంలోనే ఏర్పాటు చేసిన ‘మరోసారి ఫాసిజం వద్దు’ అని రాసి ఉన్న స్మారక శిలను మాత్రం అలాగే ఉంచారు.
ప్రభుత్వ నిర్ణయంపై స్థానిక అధికారులు, ప్రజల నుంచి ఎక్కువగా మద్దతు లభిస్తోంది. దీనివల్ల ఈ ప్రాంతంలో వివాదాలు సమసిపోతాయని ప్రశాంతత నెలకొంటుందని వారు ఆశిస్తున్నారు. అయితే ఈ నిర్ణయంపై విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. హోలోకాస్ట్ బాధితుల సంఘమైన ‘మౌతాసెన్ కమిటీ’ వంటి సంస్థలు ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. చరిత్రను గుర్తుచేసుకుని, భవిష్యత్ తరాలకు దాని తీవ్రతను తెలియజేయడానికి బదులుగా దానిని పూర్తిగా మరుగునపరిచే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తున్నారు.
పోలీస్ స్టేషన్‌కు బదులుగా ఈ భవనాన్ని ఒక చారిత్రక మ్యూజియం లేదా విద్యా కేంద్రంగా మార్చి ఉంటే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ చర్య ద్వారా, వివాదాస్పద చారిత్రక ప్రదేశాలను రోజువారీ వినియోగంలోకి తేవడం ద్వారా వాటి ప్రాధాన్యతను తగ్గించాలన్న ఆస్ట్రియా వ్యూహం స్పష్టమవుతోంది.