మహబూబ్ నగర్: రాష్ట్రంలో కాంగ్రెస్ ( Congress ) ప్రభుత్వ పనితీరు వల్ల అన్ని వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ( Srinivas Goud ) ఆరోపించారు. ప్రజల కష్టాల్లో పాలుపంచుకోవడానికి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ( KCR ) త్వరలో బస్సు యాత్ర ( Bus Yatra ) ను చేపట్టనున్నారని వెల్లడించారు.
గురువారం బీఆర్ఎస్ మహబూబ్ నగర్ జిల్లా కార్యాలయంలో సర్ ( SIR ) పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు పైన ఉన్న ప్రాజెక్ట్‌ల ఎత్తు పెంచుతుండడం వల్ల తెలంగాణకు నీళ్లు వచ్చే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే కర్ణాటక వెళ్లి అక్రమ ప్రాజెక్ట్ ల నిర్మాణం పరిశీలన చేసి వాటిని ఆపాలని కోరామని వివరించారు.
భవిష్యత్ లో అన్ని అక్రమ ప్రాజెక్ట్‌లపై పోరాటం చేస్తామని పేర్కొన్నారు. త్వరలో కేసీఆర్ బస్సు యాత్ర అనంతరం కేటీఆర్ పాదయాత్ర ఉంటుందని స్పష్టం చేశారు. గతంలో రైతులకు 24 గంటల ఫ్రీ కరెంట్ ఇస్తే వాటికిమీటర్లు పెట్టాలని బీజేపీ చూస్తుందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తరువాత నిలిచిన అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని, పెండింగ్ ప్రాజెక్ట్ పనులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని వెల్లడించారు. అధికార పార్టీ బెదిరింపులకు ఎవరు భయపడవద్దని సూచించారు.
రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాల్యా నాయక్, రాష్ట్ర నేత అభిలాష్ రావు సర్ ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, పట్టణ అధ్యక్షులు శివరాజ్, మహబూబ్ నగర్ మండల అధ్యక్షులు దేవేందర్ రెడ్డి, హన్వాడ మండల అధ్యక్షులు కరుణాకర్ గౌడ్, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ ఆంజనేయులు, కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.