JP Morgan | ప్రపంచ వ్యాప్తంగా ఏఐ ప్రభావం ఉద్యోగాలపై పడుతున్న సంగతి తెలిసిందే. కానీ అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ (International Investment Banking) సంస్థ జేపీ మోర్గాన్ భారతదేశ వ్యాప్తంగా 1000 టెక్ నిపుణుల (Tech Experts)ను ఉద్యోగులుగా నియమింనుంది. జేపీ మోర్గాన్ భారత్లోని కొన్ని నగరాల్లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ (GCC)లను ఏర్పాటు చేసింది. వీటిలోకి 1000 మంది నిపుణులను తీసుకోనుంది.
నిపుణులు అవసరం
బ్యాంకింగ్ రంగంలో ఏఐ (Artificial Intelligence) వాడకం వల్ల సిబ్బంది అవసరం సుమారు 30 నుంచి 40 శాతం వరకు తగ్గిందని జేపీ మోర్గాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జెమీ డైమన్ ఇటీవల వెల్లడించారు. కానీ ఏఐ ఎంత అభివృద్ధి చెందినా ఇంజినీరింగ్, ఏఐ ఆధారిత సేవలు, డేటా నిపుణుల అవసరం ఎప్పుడూ ఉంటుందని అదే సంస్థ చేపట్టనున్న నియామకాల వల్ల స్పష్టమవుతుంది.
నియామకాలు
అభ్యర్థులు జేపీ మోర్గాన్ తన GCCల్లో క్లౌడ్ ఆర్కిటెక్చర్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ డేటా పైప్లైన్, హ్యాకర్ ర్యాంక్ ఆధారిత పరీక్షలకు హాజరుకావాలి. వీటిలో వారి కోడింగ్ నైపుణ్యాలు, డేటా స్ట్రక్చర్, అల్గారిథమ్స్, సిస్టమ్ ఆర్కిటెక్చర్ నైపుణ్యాలను పరీక్షిస్తారు. ఈ నియామకాలు దేశంతో పాటు ప్రపంచ వ్యాప్త టెక్నాలజీ అవసరాలకు అనుగుణంగా అవసరమవుతాయని, తమ సంస్థలు బలోపేతం అయ్యేందుకు సహకరిస్తాయని ఈ సంస్థ భావిస్తుంది.
టెక్నాలజీకి కేంద్రం
జేపీ మోర్గాన్ భారత్లో ప్రస్తుతం ఐదు నగరాల్లో తన కార్యకలాపాలు నిర్వహిస్తుంది. దీని ప్రధాన కార్యాలయాలు బెంగళూరు, హైదరాబాద్, ముంబైల్లో ఉన్నాయి. దాని GCCల ద్వారా దేశంలో సుమారు 55,000 మందికి ఉపాధి లభిస్తుంది. జేపీ మోర్గాన్ 2029 నాటికి ముంబైలో ఆసియాలోనే అతిపెద్ద (సుమారు 20 లక్షల చదరపు అడుగుల) GCCని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇది తన కార్యకలాపాలను విస్తృతంగా విస్తరించేందుకు తోడ్పడుతుంది. దీనిలో సుమారు 30,000 మంది టెక్నాలజీ, ఆపరేషన్స్ నిపుణులకు ఉపాధి లభించనుంది.