హైదరాబాద్ సిటీబ్యూరో, మే 17(నమస్తే తెలంగాణ) : ఎంత బిల్డప్ ఇచ్చినా.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫ్యూచర్‌లేని నాయకుడే అని, ఫ్యూచర్‌సిటీ పేరుతో ఏదో చేయాలనుకుంటున్నాడు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఆయన్ను పక్కన పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అన్ని రంగాల్లో అంతర్జాతీయ పెట్టుబడి కేంద్రంగా ఎదిగిన రాష్ట్రం రెండున్నరేండ్లలోనే అధోగతి పాలైందని ఆందోళన వ్యక్తంచేశారు. శాంతిభద్రతలు కరువై మహిళలకు రక్షణ లేకుండా పోయే ఘటనలు పునరావృతమవు తున్నాయని, అందుకు ఇటీవలి బండి సంజయ్ కుమారుడు ఓ ఆడబిడ్డపై చేసిన అఘాయిత్యమే నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఆ బాధిత బాలిక విషయంలో అన్యాయం జరిగినా రాష్ట్ర సర్కార్ దున్నపోతు మీద వర్షం పడినట్టు వ్యవహరించిందని కానీ బీఆర్ఎస్ పార్టీ బాలిక కుటుంబానికి అండగా నిలబడి, భరోసానిచ్చిందని చెప్పారు. ఆదివారం ఎల్బీనగర్ నియోజకవర్గంలోని హస్తినాపురంలో జరిగిన బూత్ లెవల్ ఏజెంట్ సన్నాహక, శిక్షణ సమావేశానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై పార్టీ లక్ష్యాలను వివరించి వారికి దిశానిర్దేశం చేశారు.
కారుచీకట్లో చిరుదీపం కేసీఆర్
తుఫాన్లో చిరుదీపం వెలిగించిన నాయకుడు కేసీఆర్ అని కేటీఆర్ పేర్కొన్నారు. మే 17కు ఒక ప్రత్యేకత ఉన్నదని 25 ఏండ్ల క్రితం ఇదే రోజున కేసీఆర్ ఆధ్వర్యంలో సింహగర్జన పేరిట తొలి బహిరంగసభ తలపెట్టారని, ఇ ప్పుడు అదే రోజున ఎల్బీ నగర్లో శిక్షణ కార్య క్రమం నిర్వహించుకోవడం గర్వం ఉన్నదని చెప్పారు. 26వ వసంతంలోకి అడుగు పెట్టి, లక్షలాది కార్యకర్తలు, వేలాది నాయకులుగా ఎదిగారంటే ఆయనకున్న సమర్థవంతమైన నాయకత్వం వల్లే సాధ్యమైందని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో బూత్ లెవల్ నాయకత్వం, పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఇంటింటికీ సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత ఆయన సొంతమని పేర్కొన్నారు. రానున్న ఎన్నికలకు ఇప్పటినుంచే కార్యకర్తలు సన్నద్ధం కావాలని, ఉద్యమనేత కేసీఆర్ స్ఫూర్తితో పార్టీని బలోపేతం చేసి, మళ్లీ బీఆర్ఎస్ పాలనను తెచ్చుకుందామని కేటీఆర్ పిలుపునిచ్చారు.
అధికార పార్టీ నేతలతో లేనిపోని వివాదాలకు దిగకుండా, సోషల్ మీడియాలో ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ వారియర్స్ అత్యంత శక్తివంతంగా ఉన్నదని కొనియాడారు. రాబోయే ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని, డివిజన్లవారీగా సోషల్ మీడియా కమిటీలు వేయాలని ఆదేశించారు. బీఆర్ఎస్ వారియర్స్ పోరాటం వల్లే కలుగులో దాక్కున్న నిందితుడు లొంగిపోయాడని తెలిపారు. ఈ విషయంలో ధైర్యంగా నిలబడిన బీఆర్ఎస్ మహిళా నాయకత్వం, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ చూపిన చొరవ, సోషల్ మీడియా వారియర్స్.. ఇలా అందరి పోరాటం వల్లే ఇవాళ బాలికకు న్యాయం జరిగే పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. సంఘటితంగా శక్తివంతమైన కార్యకర్తలు, ప్రజాశక్తితో ఆడబిడ్డకు న్యాయం జరిగేలా చేయడంలో బీఆర్ఎస్ శ్రేణుల కృషి అభినందనీయమని, అదే కార్యకర్తలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కమిటీలన్నీ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. గడపగడపకు తిరుగుతూ సభ్యత్వ నమోదు ప్రక్రియను చేపట్టాలని కోరారు. ప్రతి ఒక్కరికీ మెంబర్షిప్ కార్డులను చేరవేయాలని, ఈ కార్డుతో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే సంక్షేమ పథకాలను చెరవేసేలా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఆగస్టు నాటికి నియోజకవర్గంలో అన్ని కమిటీలను నియమించుకోవాలని సూచించారు.
ఎస్ఐఆర్తో అప్రమత్తంగా ఉండాలి
ఎస్ఐఆర్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ చెప్పారు. బీజేపీకి అనుకూలంగా లేనిచోట ఓట్లు తొలగించే ప్రమాదం ఉన్నదని, ఇప్పటివరకు ఎస్ఐఆర్ జరిగిన రాష్ర్టాల్లో లక్షలాది ఓట్లు గల్లంతైన విషయాన్ని ప్రస్తావించారు. వచ్చే నెలలో ప్రారంభమయ్యే ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రతి బూత్‌లెవల్ కార్యకర్త బూత్ లెవల్ ఏజెంట్‌గా ప్రతి బూత్ పరిధిలో ఓటర్లను కాపాడుకోవాలని కోరారు. కాంగ్రెస్ సర్కార్ దొంగ ఓట్లను వేయించే పరిస్థితి ఉన్నదని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డబుల్ ఓట్లను ఏరివేయడంతో పాటు ఏదో ఒక చోట ఓటు హక్కు ఉండేలా చూడాలని తెలిపారు.
పనిచేసిన వారికే కార్పొరేషన్ టికెట్లు
పార్టీ కోసం పనిచేసిన వారికి, సభ్యత్వ నమోదు చేసిన నాయకులకే వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని కేటీఆర్ స్పష్టంచేశారు. ‘నా పోలింగ్ బూత్… నా బాధ్యత’ అని వినూత్న రీతిలో సుధీర్‌రెడ్డి పనిచేస్తున్నారని ప్రశంసించారు. ఇంటింటా గులాబీ జెండా ఎగరాలని, జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్ గెలిస్తే… అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినట్టేనని చెప్పారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికీ వివరించాలని కోరారు. జీవో నెం.58, 59 కింద ఇచ్చిన పట్టాలు, కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, పెన్షన్లు, చేసిన పని మాత్రమే మనల్ని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తాయని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉంటే ఎయిర్‌పోర్టు మెట్రో కూడా పూర్తయ్యేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేండ్లలో చేసిదేమీ లేదని ధ్వజమెత్తారు. 2028లో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేని ధీమా వ్యక్తంచేశారు.

హైదరాబాద్ ఎల్పీ నగర్ నియోజకవర్గంలో ఆదివారం ఏర్పాటుచేసిన ‘నా బూత్- నా భవిష్యత్తు’ కార్యక్రమంలో బీఆర్ఎస్ బీఎల్ఏలనుద్దేశించి ప్రసంగిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో హాజరైన ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు