బీఆర్ఎస్ 25 ఏండ్ల ప్రయాణంలో 14 ఏండ్లు ఉద్యమపార్టీగా, 10 ఏండ్లు పాలకపార్టీగా, రెండున్నరేండ్లు ప్రతిపక్ష పార్టీగా మూడు పాత్రలు సమర్థంగా పోషించి దిగ్విజయంగా ముందుకు సాగుతున్నది. ఇంతటి గొప్ప పార్టీకి నేతృత్వం వహిస్తున్న కేసీఆర్‌పై మూడు ఫీట్లు ఉన్నోళ్లు కూడా అడ్డంపొడుగు మాట్లాడుతున్నరు. -కేటీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తేతెలంగాణ): వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ఆషామాషీవి కాదని.. కేసీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిగా తెచ్చే ఎన్నికలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఐడెంటిటీ క్రైసిస్‌తో బాధపడుతున్నారని, అందుకే కేసీఆర్‌పై నోటికొచ్చినట్టు వాగుతున్నారని ఎద్దేవా చేశారు. 2023 సాధారణ ఎన్నికలతో పోల్చితే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలం పెరిగిందని చెప్పారు. హుజూర్‌నగర్‌లో పోటీ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి వెళ్లిపోయినా ఏకంగా 14 వేల ఓట్లు అదనంగా వచ్చాయని తెలిపారు. పార్టీ నుంచి వెళ్లిపోయిన నాయకుడు కనీసం ఆయన సొంతూరులో సర్పంచ్‌ను కూడా గెలిపించుకోలేదని ఎద్దేవా చేశారు. పార్టీ నుంచి వెళ్లిపోయినవారు అనామకులుగా మిగిలి పోతారని, హూజూర్‌నగర్ మాజీ ఎమ్మెల్యే ఉదంతమే ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు.
ఏదేమైనా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పోవడం..బీఆర్ఎస్ రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. కొండాలక్ష్మణ్ బాపూజీ ఇంట్లో కేసీఆర్ నాయకత్వంలో 2001లో పురుడుపోసుకున్న గులాబీ పార్టీకి దేశంలోనే ఎంతో విశిష్టత ఉన్నదని చెప్పారు. ఆదివారం తెలంగాణ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో హుజూర్‌నగర్‌కు చెందిన ఫార్వర్డ్ బ్లాక్ నేత పిల్లుట్ల రఘు పెద్ద సంఖ్యలో తన అనుచరులతో కలిసి మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలు, 420 హామీలు, 13 డిక్లరేషన్ల పేరిట ఆశలు కల్పించి ఓట్లేయించుకున్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిండా ముంచిందని మండిపడ్డారు. 100 రోజుల్లో అమలుచేస్తామని చెప్పి వెయ్యి రోజులైనా గ్యారెంటీలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.
యాక్టర్లు, యాంకర్లు సీఎం పేరు మర్చిపోతున్నరు
బీఆర్ఎస్ పాలనలో టీహబ్‌లో రూపుదిద్దుకున్న కంపెనీ ైస్కెరూట్కు రిబ్బన్ కటింగ్ చేసి రేవంత్‌రెడ్డి గొప్పలు చెప్పుకొన్నారని కేటీఆర్ విమర్శించారు. ఆయనను అక్కడ ఎవరూ పట్టించుకోలేదని, చివరికి యాంకర్ కూడా ముఖ్యమంత్రి శ్రీధర్‌బాబు అని సంబోధించిందని గుర్తుచేశారు. ‘సీఎం రేవంత్ పేరును యాంకర్లు, సినిమా యాక్టర్లు కూడా గుర్తుపెట్టుకోవడంలేదు.. ప్రజలైతే రేవంత్‌రెడ్డి పేరు తీస్తేనే బూతుల వర్షం కురిపిస్తున్నరు.. ముఖ్యమంత్రి పేరెత్తితే ముఖం తిప్పుకొంటున్నరు’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రెండున్నరేండ్ల పాలనలో కేసీఆర్ చేసిన పనులకు రేవంత్‌రెడ్డి రిబ్బన్ కట్ చేయడం తప్ప చేసిందేమీలేదని దెప్పిపొడిచారు.
కమల్‌హాసన్‌ను మించిన నటులు కాంగ్రెస్సోళ్లు
చిన్న చిన్న తప్పిదాలు, నేతల వ్యవహారశైలితో నల్లగొండ జిల్లాలో 11 సీట్లు కోల్పోయామని కేటీఆర్ చెప్పారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ గెలిచి ఏం ఉద్ధరించిందని ప్రశ్నించారు. ‘ఎన్నికల ముందు అప్పటి పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క గ్యారెంటీ కార్డులు ఇచ్చి 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి భద్రంగా దాచిపెట్టుకొమ్మన్నరు.. కానీ వెయ్యి రోజులు దాటినా అమలు మాత్రం మరచిపోయారు.. కాంగ్రెస్ నేతలు నటనలో కమల్‌హాసన్‌ను మించిపోయిండ్రు’అని ఎద్దేవాచేశారు. ‘హామీలు ఏమైనయ్ అని అడిగితే ఎంత కండలు తిరిగిన మొనగాడైనా 3 నెలల్లో పిల్లలు పుటిస్తడా? అని రేవంత్‌రెడ్డి ఎకసెక్కాలాడుతున్నడు. మరి 30 నెలలైనా పిల్లలు పుట్టకుంటే ఏం అనాలో చెప్పాలి?’ అని దెప్పిపొడిచారు.
నల్లగొండకు ఏం ఉద్ధరించిండ్రు?
2014కు ముందు యాభై, అరవై ఏండ్లు పాలించిన కాంగ్రెస్ నల్లగొండ జిల్లాకు ఏం చేసిందని కేటీఆర్ ప్రశ్నించారు. ఫ్లోరైడ్ మహమ్మారిని ఎందుకు తరిమికొట్టలేదని నిలదీశారు. జిల్లాను మూసీ దుర్గంధంతో నింపి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిందని మండిపడ్డారు. ఫ్లోరోసిస్‌తో నల్లగొండ వెన్నుపూస విరిగిపోయిందని వాపోయారు. కృష్ణానీళ్లు తాగి ఆరడుగులు పెరిగిన ఉత్తమ్‌కుమార్‌తో ఏమాత్రం ఉపయోగం లేదని ఎద్దేవాచేశారు. కేసీఆర్‌ను గద్దెదించేందుకు గడ్డం పెంచిండు తప్ప ప్రజలకు ఒరగబెట్టిందేమీలేదని దుయ్యబట్టారు.

ఢిల్లీకి మూటలు మోసుడు తప్ప చేసిందేంది?
రేవంత్‌రెడ్డి గద్దెనెక్కిన తర్వాత పదే పదే ఫ్లైట్ ఎక్కుడు, ఢిల్లీకి పోవుడు, మూటలు మోసుడు తప్ప రాష్ట్ర ప్రజలకు చేసిందేమీలేదని కేటీఆర్ విమర్శించారు. ఎన్నికల ముందు దానవీర శూరకర్ణ సినిమాలో హీరో మాదిరి డైలాగులు కొట్టిన రేవంత్‌రెడ్డి రెండున్నరేండ్లుగా కుంభకర్ణుడిలా నిద్రపోతున్నారని విరుచుకుపడ్డారు. కేసీఆర్ ఎనిమిది లక్షల కోట్లు అప్పుచేశారని తప్పుడు ప్రచారం చేస్తూ ఇచ్చిన హామీల నుంచి తప్పించుకొంటున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ చేసింది కేవలం రూ. 2.82 లక్షల కోట్ల అప్పేనని, ఇది పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ఆర్థిక మంత్రే వెల్లడించారని, రిజర్వ్ బ్యాంక్ లెక్కలు సైతం తేటతెల్లం చేశాయని గుర్తుచేశారు. ‘కేసీఆర్ అప్పులు చేసి రూ.94 వేలకోట్లతో కాళేశ్వరం నిర్మించారు. కోదాడ, సూర్యాపేట రైతాంగానికి నీరందించారు..70 లక్షల మంది రైతుల కోసం 73 వేల కోట్లు ఖర్చుచేశారు.
నల్లగొండ జిల్లాలో రూ.1,800 కోట్లతో యాదాద్రి ఆలయం నిర్మించారు. 32 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు కట్టారు. రూ.35 వేల కోట్లతో నల్లగొండ జిల్లా దామెరచర్లలో అల్ట్రా మెగా పవర్‌ప్లాంట్ నిర్మించారు’అని గుర్తుచేశారు. కానీ రెండున్నరేండ్లలోనే రూ.3.60 లక్షల కోట్ల అప్పులు తెచ్చిన రేవంత్‌రెడ్డి ఏం చేశారని నిలదీశారు. ‘పెండ్లి చేసుకున్న ఆడబిడ్డలకు తులం బంగారం.. యువతులకు స్కూటీలు, రైతులకు బోనస్, రైతుభరోసా ఇచ్చారా? కనీసం వృద్ధుల పింఛన్లయినా పెంచారా?’ అని ప్రశ్నించారు. కార్యక్రమం లో మాజీ ఎంపీలు బడుగుల లింగయ్య యాదవ్, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, పార్టీ సీనియర్ నేత నర్సింహారెడ్డి, రాకేశ్‌రెడ్డి, రవికుమార్, మల్లికార్జున్‌రెడ్డి, పల్లె రవికుమార్‌గౌడ్, వెంకటేశ్వర్‌రెడ్డి, గెల్లు శ్రీనివాస్‌యాదవ్, జితేందర్‌రెడ్డి, సర్దార్ రవీందర్‌సింగ్, శ్రీనివాస్‌గౌడ్, భారతి తదితరులు పాల్గొన్నారు.