కేసీఆర్ 2014లో కేవలం రూ. 74వేల కోట్లతో బడ్జెట్ పెట్టారు. దిగిపోయేనాటికి 2.94 లక్షలతో బడ్జెట్ కేటాయింపులు చేశారు. అంటే నెలకు రూ. 18, 500 కోట్ల ఆదాయం సమకూరింది. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆదాయం రూ. 30 వేల కోట్లు పడిపోయింది. కేసీఆర్ పాలనలో గ్రోత్‌రేట్‌లో అగ్రగామిగా ఉన్న రాష్ట్రం ఇప్పుడు 28 స్థానానికి పడిపోయింది. -కేటీఆర్
హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తేతెలంగాణ): ‘కాంగ్రెస్‌కు ఒక్క అవకాశమిస్తేనే కరెంట్ కోతలు తెచ్చింది. 800 మంది రైతులు, 110 మంది గురుకుల పిల్లలు, 162 మంది ఆటోడ్రైవర్ల ఊసురు తీసుకున్నది. రైతుబంధు, పింఛన్లు పెంచకుండా మోసం చేసింది. ఇప్పుడు జూబ్లీహిల్స్‌లో మళ్లీ ఓటేసి మరోసారి అవకాశమిస్తే రాష్ట్రం సర్వనాశనం కావడం ఖాయం’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నాలుగు లక్షల మంది ఇచ్చే తీర్పు కోసం నాలుగుకోట్ల మంది ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారని చెప్పారు. అలవిగాని హామీలిచ్చి దగా చేసిన కాంగ్రెస్ సర్కారుకు కర్రుకాల్చి వాతపెట్టేందుకు వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దని జూబ్లీహిల్స్ ఓటర్లకు విజ్ఞప్తిచేశారు. హస్తం పార్టీని ఓడగొడితేనే రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో రేవంత్‌రెడ్డి గల్లాపట్టి, నిలదీసి ఆరు గ్యారెంటీలను ఇప్పిస్తామని ప్రకటించారు. శనివారం ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రేవంత్ సర్కారు పాలనా వైఫల్యాలను కే టీఆర్ ఎండగట్టారు. జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ గెలు పు చారిత్రక అవసరమని నొక్కి చెప్పారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత 16 వేలకుపైగా మెజార్టీతో గెలుస్తున్నారని విశ్వాసం వ్యక్తంచేశారు.
పెట్టుబడులు, అప్పులపై సీఎం పచ్చి అబద్ధాలు
కాంగ్రెస్ హయాంలో వచ్చిన పెట్టుబడులు, కేసీఆర్ పాలనలో తెచ్చిన అప్పులపై సీఎం రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. 2014లో కాంగ్రెస్ తమకు రూ. 72 వేల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని ఇచ్చిందని గుర్తుచేశారు. కేసీఆర్ దిగిపోయేనాటికి 2023లో రూ. 3.5 లక్షల కోట్ల అప్పులతో తిరిగి కాంగ్రెస్‌కు అప్పజెప్పినట్టు తెలిపారు. ఇది నేను చెప్తున్న లెక్కలు కాదని, పార్లమెంట్లో బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానమని స్పష్టంచేశారు. పెట్టుబడుల విషయంలోనూ రేవంత్‌రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీఎస్ ఐపాస్ వెబ్సైట్ ప్రకారం 2023-24లో కేవలం రూ. 13,600 కోట్లు, 2024-25లో ఇప్పటి వరకు రూ. రూ. 6,000 కోట్లు వచ్చాయని పేర్కొన్నారు. కానీ ముఖ్యమంత్రి మాత్రం రూ. 3 లక్షల కోట్లు అని చెప్పుకోవడం విడ్డూరమని అన్నారు.
దిక్కుమాలిన పాలసీతోనే పడిపోయిన ఆదాయం
సీఎం రేవంత్‌రెడ్డి దిక్కుమాలిన విధానాలతోనే రాష్ట్ర ఆదాయం దారుణంగా పడిపోయిందని కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ 2014లో కేవలం రూ. 74వేల కోట్లతో బడ్జెట్ పెట్టారని, దిగిపోయేనాటికి 2.94 లక్షలతో బడ్జెట్ కేటాయింపులు చేశారని గుర్తుచేశారు. అంటే నెలకు రూ. 18, 500 కోట్ల ఆదాయం సమకూరిందని చెప్పారు. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆదాయం 30 వేల కోట్లు పడిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. కేసీఆర్ పాలనలో గ్రోత్‌రేట్‌లో అగ్రగామిగా ఉన్న రాష్ట్రం 28వ స్థానానికి పడిపోవడం దారుణమని తెలిపారు.
రేవంత్‌రెడ్డికి కేటీఆర్ సవాల్
పట్నం మహేందర్‌రెడ్డి, సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి, మంత్రులు వివేక్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్రమ నిర్మాణాలు చేపట్టినా హైడ్రా వారి జోలికి వెళ్లడం లేదని, పేదల ఇండ్లను మాత్రం శని, ఆదివారాల్లో కూలగొడుతున్నదని కేటీఆర్ మండిపడ్డారు. హైదరాబాద్‌లో అభివృద్ధి చేశాం కాబట్టే 2015, 2020లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో, 2018, 2023లో అన్ని స్థానాల్లో ఎమ్మెల్యేలుగా గెలిపించారని గుర్తుచేశారు. రెండేండ్లలో ఏం చేశామో చెప్పి కాంగ్రెస్ నేతలు ఓట్లు అడగాలని సవాల్ విసిరారు. రెండేండ్లలో ఒక్క ఇల్లు కట్టని రేవంత్‌రెడ్డి వేల ఇండ్లను కూలగొట్టారని కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ వచ్చాక హైదరాబాద్‌లో ఒక్క ఇల్లు కట్టినట్టు నిరూపించినా తాను రాజీనామా చేసి వెళ్లిపోతానని కేటీఆర్ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ హయాంలో పదేండ్లలో రూ.10 వేల కోట్లు ఖర్చు చేసి లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టామని, వాటి విలువ ప్రస్తుతం మార్కెట్ ధర ప్రకారం రూ.50 వేల కోట్లకు చేరిందని వివరించారు. ఒక్కో ఫ్లాట్ విలువ రూ.50 లక్షలకు చేరిందని చెప్పారు. ఈ విధంగా బీఆర్ఎస్ హయాంలో సంపద సృష్టించినట్టు వెల్లడించారు. నాడు రూ. 50 లక్షలు ఉన్న ఫ్లాట్ నేడు 50 శాతానికి పడిపోయిందంటే దానికి కాంగ్రెస్సే కారణమని ఆరోపించారు.
కాంగ్రెస్ విధానాలతో ‘రియల్’ ఢమాల్
కాంగ్రెస్ నెగటివ్ పాలసీలు, బిల్డర్లను బెదిరించి వాళ్ల తాటతీసి స్కేర్ ఫీట్‌కు రూ.150 వసూలు చేస్తే రియల్ ఎస్టేట్ మనుగడ సాగించగలదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఓ ఫైవ్ స్టార్ హోటల్లో ప్రెస్‌మీట్ పెట్టి 20-25 ప్రాజెక్టుల పేర్లు చెప్పి అవన్నీ చెరువుల్లో ఉన్నాయని చెప్పారని, మరి ఒక్కటైనా కూలిందా? అని ప్రశ్నించారు. ఏం సెటిల్మెంట్ చేసుకుని వాటిపై చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. పేదల ఇండ్లు తేరగా దొరికాయని వాళ్ల ఇండ్లపై వారంతాల్లో బుల్డోజర్లు బయలుదేరుతున్నాయని మండిపడ్డారు. తెల్లారి లేస్తే బుల్డోజర్లను తమ మీదకు పంపుతున్నందుకు బోరబండ, షేక్‌పేట్, రహమత్‌నగర్, యూసుఫ్‌గూడ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలా? అని ప్రశ్నించారు. హైడ్రా తీసుకొచ్చి రూ. 60 కోట్ల విలువైన భూములను కాపాడామని సీఎం రేవంత్‌రెడ్డి చెబుతున్నారని, మరి ఆ భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి ఆరు గ్యారంటీలు అమలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సున్నం చెరువుకు ఒక నీతి, దుర్గం చెరువుకు ఒక నీతి ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. సీఎం సోదరుడు, ఆర్మీలో పనిచేసే అధికారి కుమారుడు మధుసూదన్‌కుమార్ అనే వ్యక్తికి ఒకే రోజు కోర్టు స్టే ఆర్డర్ ఇస్తే మధుసూదన్‌కుమార్ ఇంటిని రాత్రి 9 గంటలకు వెళ్లి కూలగొట్టడం దారుణమని అన్నారు.
ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత ఏదీ?
జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ను గెలిస్తే రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతో కాంగ్రెస్ పార్టీ వెంటనే పథకాలు అమలు చేస్తుందని కేటీఆర్ చెప్పారు. నాడు కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి తెస్తేనే తెలంగాణ ఇచ్చిందని, రాజకీయ అనివార్యతలోకి నెట్టవేయబడితేనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పని చేస్తుందని తెలిపారు. ప్రజలు తమ పరిపాలన పట్ల ఆగ్రహంతో ఉన్నారని రాహుల్, ఖర్గే, సోనియాగాంధీ గ్రహించి ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని రేవంత్‌రెడ్డిని ఆదేశిస్తారని పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీలకు తొలి క్యాబినెట్ మీటింగ్‌లో చట్టబద్ధత కల్పిస్తామని నాడు రాహుల్‌గాంధీ హామీ ఇచ్చి పత్తా లేకుండా పోయారని గుర్తు చేశారు. ఒక వేళ చట్టబద్ధత కల్పిస్తే జూబ్లీహిల్స్‌లో గల్లీ పోరాటం చేసేవాళ్లం కాదని, చట్టాన్ని తీసుకెళ్లి కోరు మెట్లు ఎక్కేవాళ్లమని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత ఉన్నట్టే ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత ఉంటే కోర్టు మొట్టికాయలు వేసి మరి ఆరు గ్యారంటీలు అమలు చేయించేదని వివరించారు.
కేసీఆర్ చుట్టూ.. 25 ఏండ్లుగా రాజకీయం
2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌లో ఓటమి పాలైతే, హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 100 సీట్లు గెలిస్తే రాజీనామా చేస్తానని చెప్పి రేవంత్‌రెడ్డి పారిపోయారని కేటీఆర్ గుర్తు చేశారు. నాడు కేసీఆర్ మీద ఫాంహౌస్ సీఎం అని ఆరోపించిన రేవంత్‌రెడ్డి నేడు సెక్రటేరియెట్‌కు వెళ్లకుండా జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో ఉండి పాలన ఎలా చేస్తారని ప్రశ్నించారు. కేసీఆర్ ఎక్కడ ఉండి పాలన చేసినా రైతుబంధు, 24 గంటల కరెంట్, యూరియా, సంక్షేమ పథకాలు ఎక్కడా ఆగలేదని కేటీఆర్ గుర్తుచేశారు. 4 కోట్ల తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను మిస్ అవుతున్నారని చెప్పారు. కేసీఆర్ పేరు లేకుండా ఏనాడైనా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారా? అని ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అయినా, నేడు తెలంగాణలో అయినా గత 25 ఏండ్లుగా కేసీఆర్ చుట్టూనే రాష్ట్ర రాజకీయాలు నడుస్తున్నాయని వెల్లడించారు. కేసీఆర్ మాట్లాడినా.. మౌనంగా ఉన్నా సంచలనమే అని చెప్పారు. మాగంటి గోపీనాథ్ మరణంపై సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ లేవనెత్తిన అనుమానాలపై కేటీఆర్ స్పందించారు. మాగంటి గోపీనాథ్ చనిపోయి ఐదారు నెలల తర్వాత ఇప్పుడు ఎన్నికల ముందే ఆరోపణలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. మాగంటి తల్లి సైతం కాంగ్రెస్ వాళ్లను వెనక పెట్టుకుని మీడియాతో మా ట్లాడుతున్నారని చెప్పారు. ఇన్ని రోజులు మరణంపై ఎలాంటి అనుమానాలు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. అనుమానాలు ఉంటే విచారణ చేయాలని రేవంత్‌రెడ్డిని కేటీఆర్ డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో జాయింట్ వెంచర్ సర్కార్
రాష్ట్రంలో కాంగ్రెస్-బీజేపీ జాయింట్ వెంచర్ సర్కారు నడుస్తున్నదని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇంటిపై ఈడీ దాడులు చేసి ఏడాది గడుస్తున్నా, ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని బీజేపీ పాస్ చేస్తే 28 రాష్ర్టాల్లో మొదట తెలంగాణలోనే జీవో తీసుకొచ్చారని వివరించారు. సీబీఐని రాహుల్‌గాంధీ బండ బూతులు తిడితే ఆ సంస్థకే రేవంత్‌రెడ్డి కేసు అప్పగించారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్‌లో రేవంత్‌రెడ్డి బావమరిదికి రూ.1,150 వేల కోట్ల వర్క్ బీజేపీ ఇచ్చిందని ఆరోపించారు. బీజేపీ ఎంపీకి రేవంత్‌రెడ్డి రూ.1,350 కోట్ల వర్క్ ఇచ్చారని తెలిపారు. సిటీ బస్సు చార్జీలు పెంచినా, హైడ్రా అరాచకాలు చేసినా బీజేపీ నోరు మెదపడం లేదని విమర్శించారు. రేవంత్‌రెడ్డి అవినీతి చేస్తున్నారని కిషన్‌రెడ్డి ఆరోపిస్తారు కానీ విచారణకు ఆదేశించరని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తుందని మోదీ, కాం గ్రెస్‌కు తెలంగాణ ఏటీఎంలా మారిందని అమిత్ షా అంటారు కానీ ఎలాంటి ఎంక్వైరీ చేపట్టరని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డికి బండి సంజయ్ సహాయ మం త్రిగా మారిపోయారని ఆరోపించారు. బండి సంజ య్ కేంద్ర మంత్రి అని, ఇంకా ఎన్ని రోజులు కార్పొరేటర్లా మాట్లాడుతారని చురకలు అంటించారు. మాగంటి సునీత కన్నీళ్లను అవమానించేలా ఇద్దరు మంత్రులు మాట్లాడారని, ఆమె పిల్లలపై కేసులు పెడుతున్నారని ఆ గ్రహం వ్యక్తంచేశారు. ఒక్క ఎలక్షన్‌ను గెలవడానికి ఇంత చిల్లర రాజకీయాలు చేయడం అవసరమా? అని ప్రశ్నించారు. కేసీఆర్ కాళ్ల మీద పడితే ఏకగ్రీవం చేస్తారని ఇప్పటికైనా వెళ్లి ఆ పని చేయాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు. బండి సంజయ్, రేవంత్ మధ్య డబ్బుల ఈక్వేషన్ ఉందని కేటీఆర్ ఆరోపించారు. వీరిద్దరిది ఆర్ఎస్ బ్రదర్స్ బంధం అని అన్నారు. ఇద్దరూ కలిసి ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తున్నారని తమ ప్రభుత్వం వచ్చాక వాళ్ల మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు.
రేవంత్ రెడ్డి ‘బ్యాగ్ బ్రదర్’
రాష్ట్రంలో బ్యాడ్ బ్రదర్స్ ఎవరో బిల్డర్స్, లగచర్ల గిరిజనులు, కొండారెడ్డి పల్లిలో చనిపోయిన మాజీ సర్పంచ్ సాయిరెడ్డి కుటుంబ సభ్యులు చెప్తారని కేటీఆర్ పేర్కొన్నారు. మేడ్చల్-రంగారెడ్డి జిల్లాలో భూమాఫియా చేస్తున్న అనకొండలు, అనుముల బ్రదర్స్ ఎవరో ప్రజలే చెప్తారని తెలిపారు. రేవంత్‌రెడ్డికి ఢిల్లీలో బ్యాగ్ బ్రదర్ అని పేరు ఉందని, సీటు కాపాడుకునేందుకు బ్యాగ్‌లు మోస్తారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, ఇమ్రాన్ ప్రతాప్ గఢీ బీజేపీ బీటీం అని ఎంఐఎంని అవమానిస్తుంటే అసదుద్దీన్ ఎందుకు వాళ్లతో కలిసి పని చేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్-ఎంఐఎం-బీజేపీగా పోటీ ఉందన్నారు. ఎన్టీఆర్, పీజేఆర్లపై రేవంత్‌రెడ్డికి సడెన్‌గా ప్రేమ పొంగుకొచ్చిందని తెలిపారు. మాగంటి గోపీనాథ్‌కు ఎన్టీఆర్‌తో మంచి అనుబంధం ఉండేదని గుర్తుచేశారు. టీడీపీ, ఎన్టీఆర్ అభిమానులు ఖచ్చితంగా మాగంటి గోపీనాథ్ వైపు ఉంటారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ గెలిస్తే ‘మార్పు’
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలిస్తే కచ్చితంగా రాష్ట్రంలో అనేక మార్పులు ఉంటాయని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ మాత్రమే ప్రత్యామ్నాయం అనే విషయం స్పష్టమతుందని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీకి డిపాజిట్ గల్లంతైతే ఆ పార్టీకి ఇక్కడ స్థానం లేదని తేటతెల్లం అవుతుందని పేర్కొన్నారు. పెయిడ్ సర్వేలని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందిస్తూ ఈనెల 14న ఫలితాలతో సర్వేలు పెయిడా? కాదా? తెలుస్తుందని అన్నారు. ఓటమి భయంతోనే ముస్లిం ఓట్ల కోసం అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చారని చెప్పారు.
చంద్రబాబు అరెస్ట్ సందర్భంగా ట్వీట్‌పై కేటీఆర్ క్లారిటీ
బీఆర్ఎస్ హయాంలో ప్రతి ఏడాది తన శాఖలకు సంబంధించి ప్రొగ్రెస్ రిపోర్టు ఇచ్చేవాడినని, కాంగ్రెస్ సర్కారు కూడా రెండేండ్ల పాలనపై ప్రొగ్రెస్ రిపోర్టు విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. చంద్రబాబు ట్విట్టర్లో అంబాసిడర్ కారును ట్వీట్ చేయడంపై కేటీఆర్ స్పందించారు. నాడు సీబీఎన్ అరెస్ట్ అయిన సందర్భంలో తాను ఓ స్టాండప్ కామెడీ ప్రొగ్రామ్‌కు వెళ్లినట్టు చెప్పారు. చంద్రబాబు అరెస్ట్ అయిన విషయం తనకు తెలియకుండానే తాను నవ్వుతున్న ఫొటోను ట్విట్టర్లో షేర్ చేసినట్టు తెలిపారు. ఆ ఫొటోను తీసుకెళ్లి చంద్రబాబు అరెస్ట్ అయినందకు తాను నవ్వుతున్నట్టు లింక్ చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు సైతం యాదృచ్ఛికంగానే అంబాసిడర్ కారుతో ఉన్న ఫొటోను ట్వీట్ చేసి ఉంటారని భావిస్తున్నట్టు చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా బీఆర్ఎస్ నేతల ఇండ్లపైనే పోలీసులు దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ ఇటీవల తనను తిట్టిన తర్వాత కేసీఆర్ ఫోన్ చేశారని, ఎదుగుతున్న నాయకుడికి సంయమనం అవసరమని తనకు చెప్పినట్టు కేటీఆర్ వెల్లడించారు.
హైదరాబాద్‌లో అభివృద్ధి చేశాం కాబట్టే 2015, 2020లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో, 2018, 2023లో అన్ని స్థానాల్లో ఎమ్మెల్యేలుగా గెలిపించారు. రెండేండ్లలో ఏం చేశామో చెప్పి కాంగ్రెస్ నేతలు ఓట్లు అడగాలి. రెండేండ్లలో ఒక్క ఇల్లు కట్టని రేవంత్‌రెడ్డి వేల ఇండ్లను మాత్రం కూలగొట్టారు. -కేటీఆర్
కాంగ్రెస్ నెగటివ్ పాలసీలు, బిల్డర్లను బెదిరించి వాళ్ల తాటతీసి స్కేర్ ఫీట్‌కు రూ.150 వసూలు చేస్తే రియల్ ఎస్టేట్ మనుగడ సాగించగలదా? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఓ ఫైవ్ స్టార్ హోటల్లో ప్రెస్‌మీట్ పెట్టి 20-25 ప్రాజెక్టుల పేర్లు చెప్పి అవన్నీ
చెరువుల్లో ఉన్నాయని చెప్పారు. మరి ఒక్కటైనా కూలిందా? -కేటీఆర్
నాడు కేసీఆర్‌ను ఫాంహౌస్ సీఎం అని ఆరోపించిన రేవంత్ రెడ్డి నేడు సెక్రటేరియెట్‌కు వెళ్లకుండా జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో ఉండి పాలన ఎలా చేస్తారు. కేసీఆర్ ఎక్కడ ఉండి పాలన చేసినా రైతుబంధు, 24 గంటల కరెంట్, యూరియా, సంక్షేమ పథకా లు ఎక్కడా ఆగలేదు. కేసీఆర్ పేరు లేకుండా ఏనాడైనా రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారా? -కేటీఆర్