ప్రజాస్వామ్యంలో పదవులిచ్చే శక్తి ప్రజలకే ఉన్నది. ఐదేండ్ల తలరాతను మార్చే శక్తి మీకే ఉన్నది. మిమ్మల్ని కోరేది ఒక్కటే. కాంగ్రెస్ మ్యానిఫెస్టోనే ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పాలనను బేరీజు వేసుకొని ఆలోచన చెయ్యాలె. ఎన్ని మోసాలు? ఎన్ని మాటలు? ప్రజాస్వామ్యంలో ఏ పోలీసోడైనా, బలుపు సీఎంకైనా సరే..బుద్ధి చెప్పే శక్తి మీ చేతుల్లోనే ఉన్నది. రేపు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలె. -కేటీఆర్
నిజామాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :దళిత వ్యతిరేక రేవంత్ ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా పోరాడుతామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్‌ను గౌరవించింది కేవలం కేసీఆర్ ఒక్కరేనని గుర్తుచేశారు. దళిత డిక్లరేషన్‌లో ప్రకటించిన ఏ ఒక్క హామీని కూడా రేవంత్‌రెడ్డి అమలు చేయలేదని మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో శుక్రవారం నిర్వహించిన ‘ఆత్మగౌరవ గర్జన’లో మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు జాజాల సురేందర్, గంప గోవర్ధన్, బాజిరెడ్డి గోవర్ధన్, హన్మంత్ షిండే, జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజుతో కలిసి కేటీఆర్ పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఏప్రిల్ 14న లింగంపేటలో పోలీసులు అమానుషంగా ప్రవర్తించి బట్టలూడదీసి లాక్కెళ్లిన మాజీ ఎంపీపీ ముదాం సాయిలును కేటీఆర్ అదే చౌరస్తాలో ఘనంగా సన్మానించారు. అనంతరం భారీ వర్షం కురుస్తున్నా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. మీటింగ్ తర్వాత సాయిలు నివాసానికి వెళ్లి కేటీఆర్ భోజనం చేశారు. వర్షంలోనే కేటీఆర్ స్పీచ్‌ను ప్రజలు, కార్కకర్తలు ఆసక్తిగా విన్నారు. కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా భవాని అనే యువతి చదువు కోసం ఎన్ఆర్ఐ కిషోర్ పంపిన రూ.70 వేల ఆర్థిక సాయాన్ని కేటీఆర్ అందజేశారు.
ఇది దళితులందరికీ జరిగిన అవమానం
సాయిలుకు జరిగిన అవమానం తెలంగాణలోని దళితులందరికీ జరిగిన అవమానమని కేటీఆర్ పేర్కొన్నారు. ఇందుకు తప్పకుండా బదులు తీర్చుకుంటామని స్పష్టంచేశారు. ‘అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఆధారంగా ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ర్టాన్ని తెచ్చుకున్నం. లేకుంటే రాష్ట్రం వచ్చేదే కాదు. బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని తీసుకున్న నాయకుడు కేసీఆర్. లక్షల మందిని సమీకరిస్తూ, తెలంగాణ కోసం బోధిస్తూ, పోరాటం చేస్తూ ఒంట పట్టించుకొని ఆనాడు 14 ఏండ్ల పాటు కేసీఆర్ ఎత్తిన జెండా దించకుండా కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించుకున్నం. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చినం. తెలంగాణ సెక్రటేరియట్‌కు అంబేద్కర్ పేరు పెట్టింది కేసీఆర్ ప్రభుత్వమే. దళిత జీవితాల్లో అద్భుతమైన మార్పు కోసం కొద్ది మందికైనా సరే దఫదఫాలుగా న్యాయం చేస్తూ వంతుల వారీగా 18 శాతం జనాభాలోని పేదలకు న్యాయం చేయాలని నిర్ణయించినం.
కేసీఆర్ రూ.10 లక్షలు ఇస్తుండు మేము రూ.12 లక్షలు ఇస్తమని చేవెళ్లలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరిట రేవంత్‌రెడ్డి మాయమాటలు చెప్పిండు. ఎస్సీ, ఎస్టీ ఓట్లు కొల్లగొట్టిండు. ప్రభుత్వ పనుల్లో ఎస్సీ, ఎస్టీలకు వాటా ఇస్తామన్నాడు. లెక్కలేని మాటలు చెప్పి ఇప్పుడు మోసం చేస్తున్నాడు. రైతులకు కేసీఆర్ పది వేలు ఇస్తే రూ.15 వేలు ఇస్తానన్నడు. కేసీఆర్ 2 వేల పింఛన్ ఇస్తామంటే మేము 4వేలు ఇస్తామని చెప్పి మొండిచెయ్యి చూపిండు. ఇంట్లో ఇద్దరికి పింఛన్, కోడలుకు 2500, అత్తకు 4 వేలు అని హామీ ఇచ్చి ఇప్పుడు చేతులెత్తేసిండు. దళితులు ఇల్లు కట్టుకున్నా, గిరిజనులు ఇల్లు కట్టుకున్నా 6 లక్షలు ఇస్తానన్నడు. 6 పైసలు కూడా ఇయ్యలేదు. ఇంత సిగ్గు లేని ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలే. రైతులకు కేసీఆర్ ఇచ్చిన దాని కంటే ఎక్కువ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ సర్కారు రెండు సార్లు రైతుబంధు ఎగ్గొట్టింది. ఎలక్షన్స్ వచ్చినయి కాబట్టి మొన్న అరకొరగా రైతుబంధు వేసి సంబురాలు చేసుకోమన్నరు’ అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు.
ఢిల్లీకి మూటలు
రైతులకు ఇవ్వాల్సిన డబ్బును రేవంత్‌రెడ్డి ఢిల్లీకి పంపుతున్నాడని కేటీఆర్ విమర్శించారు. ‘తులం బంగారం ఇస్తామన్నరు.. వచ్చిందా? 500 బోనస్ వచ్చిందా? అన్ని పంటలకు బోనస్ అన్నడు. ఎలక్షన్ ముందు దొడ్డు వడ్లకు బోనస్ అన్నడు. ఆ తర్వాత బోగస్ అయ్యింది. రేవంత్‌రెడ్డిలో అపరిచితుడున్నడు. ఒకడు రాము.. మరొకడు రెమో.. రాము ఏమో ఈస్ట్ ఇండియా కాంట్రాక్టర్లకు కాంట్రాక్టులు ఇవ్వమంటాడు. రెమోనేమో చంద్రబాబు తొత్తులకు కాంట్రాక్టులు కట్టబెడుతడు. 2 లక్షల ఉద్యోగాలన్నడు. వచ్చినయా? సంవత్సరానికి 60 వేల కొలువులు ఇచ్చిండంట. మందికి పుట్టిన పిల్లలు మా పిల్లలని చెప్పుకుంటారా? కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు కాగితాలిచ్చి నేనే ఇచ్చిన అని చెప్పుకుంటాండు. కేసీఆర్ అప్పులు చేసిండంటున్నడు. ముఖంపాడైన వాడు అద్దంపై నిందలు వేసినట్టున్నది వీళ్ల తీరు’ అంటూ నిప్పులు చెరిగారు. కరోనా వచ్చినప్పుడు ప్రపంచం అంతా ఆగమైనా రైతుబంధు, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్లు, పింఛన్లు, గురుకులాల్లో సన్నబియ్యం ఆగినయా?’ అని ప్రశ్నించారు.
దమ్మున్నోడితోనే ఆదాయం
కరోనా కష్టకాలంలోనూ ప్రభుత్వాన్ని, పాలనను చక్కగా నడిపామని కేటీఆర్ గుర్తుచేశారు. ‘ఆనాడు సర్కారును కేసీఆర్ నడపలేదా? ప్రభుత్వాన్ని నడిపేటోడు మొగోడైతే.. దమ్ముంటే ఆదాయం పుడుతది. పేదలకు న్యాయం జరుగుతది. కౌలు రైతులకు ఉత్తరాలు రాసిండు. 22 లక్షల మందికి 15 వేల చొప్పున ఇస్తానన్నడు. పైసా అయినా ఇచ్చిండా? పాలిచ్చిన బర్రెను వదిలి దున్నపోతును తెచ్చుకున్నమని మొన్న సిరిసిల్లకు పోయినప్పుడు ఓ తాత చెప్పిండు’ అని ఎద్దేవాచేశారు. ‘ఎన్నికల్లో ఓడినా.. గెలిచినా మేం ప్రజల వెంటే ఉంటాం.. మీరు యాడ కూర్చోమంటే ఆడనే కూర్చుంటాం.ప్రజాస్వామ్యంలో పదవులిచ్చే శక్తి ప్రజలకే ఉన్నది. ఐదేండ్ల తలరాతను మార్చే శక్తి మీకే ఉన్నది. మిమ్మల్ని కోరేది ఒక్కటే. కాంగ్రెస్ మ్యానిఫెస్టో ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం.
ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పాలనను బేరీజు వేసుకొని ఆలోచన చేయాలె’ అని సూచించారు. ‘రైతులకు రేవంత్‌రెడ్డి ఎన్ని మాటలు చెప్పిండు? 2 లక్షల రుణాలు తెచ్చుకోండ్రి అన్నడు. 50 వేల కోట్లు రుణమాఫీ చేయాల్సి ఉంటదని 2023 డిసెంబర్లో మీటింగ్ పెట్టి గుడ్లు తేలేసిండు. ఇరుక్కపోయినా అని చెప్పి.. మరునాడే కడుపు కట్టుకుంటే ఒక సంవత్సరంలో ఎడమ చేతితో 40 వేల కోట్ల రైతు రుణమాఫీ ఇవ్వొచ్చన్నడు. ఒక్క రోజులో 10 వేల కోట్లు మింగిండు. తెల్లారి క్యాబినెట్ మీటింగ్‌లో 30 వేల కోట్లే అన్నడు. అసెంబ్లీ బడ్జెట్లో 26 వేలు కోట్లు అన్నడు. మొత్తానికి రుణమాఫీ పేరిట రూ.12 వేల కోట్లే ఏసిండు. కథ మొదలైంది 50 వేలు కోట్లతోని! కథ ముగిసింది 12 వేల కోట్లతోని’ అని దెప్పిపొడిచారు.
గురుకులాల్లో పిల్లలకు విషం
‘రేవంత్‌రెడ్డి గురుకులాల్లో పిల్లలకు విషం పెడుతున్నడు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో వంద మందిని బలి తీసుకున్నడు. వేములవాడకు సీఎం పోతే ప్లేటుకు లక్ష ఖర్చు పెట్టిండు. అందగత్తెల పోటీల్లో ప్లేటుకు లక్ష. కానీ గురుకులాల్లో పిల్లలకు వంద రూపాయలకు భోజనం పెట్టవా?’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ మంచి కోసం కేసీఆర్‌ను తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రజలే తేల్చుకోవాలె : ఆర్ఎస్పీ
‘కమిట్మెంట్, క్రియేటివిటీ, క్యాలిబర్, కరిష్మా కలిగిన కేటీఆర్ కావాల్నా? కరప్షన్ రేవంత్‌రెడ్డి కావాల్నా? ప్రజలే తేల్చుకోవాలి’ అని బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సూచించారు. కష్టాలు, కన్నీళ్లను పునాదిగా మార్చుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండాను రెపరెపలాడించాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ జయంతి రోజున దళిత నాయకుడు సాయిలును బట్టలూడదీసి అవమానపర్చడం ఘోరమైన చర్య అని, చుండూర్లో దళితులపై జరిగిన అమానుషమే కాంగ్రెస్ పాలకు నిదర్శనమని, వంద మంది పేద ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన వారంతా కాంగ్రెస్ పాలనలో అవస్థలు పడుతున్నారని చెప్పారు. గురుకులాల్లో వంద మంది బిడ్డలు చనిపోవడం బాధాకరమని, కేసీఆర్ పెట్టిన గురుకులాలను కాంగ్రెస్ పాలకులు నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.
లెక్క అప్పచెప్పాల్సిందే : వేముల
లింగంపేటలో అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ముదాం సాయిలుకు జరిగిన అవమానికి లెక్క అప్పజెప్పాల్సిందేనని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ను మట్టి కరిపించి ఆ పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ సామాన్య కార్యకర్తలపై పోలీసులను అడ్డు పెట్టుకుని ప్రభుత్వం చేస్తోన్న విధ్వంసాన్ని ఖండించేందుకు, సామాన్య కార్యకర్తకు అండగా నిలిచేందుకు కేటీఆర్ రావడం గొప్ప విషయమన్నారు.
అంబేద్కర్ సాక్షిగా అవమానం : జాజాల
లింగంపేట మండల కేంద్రంలోని దళిత నాయకుడిని ఘోరమైన రీతిలో అవమానించారని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆవేదన వ్యక్తంచేశారు. పోలీసుల చేతిలో అవమానానికి గురైన దళిత నాయకుడికి అండగా నిలిచేందుకు కేటీఆర్ ఇక్కడికి వచ్చారని చెప్పారు.
దద్దరిల్లిన ఆత్మగౌరవ గర్జన
లింగంపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన ఆత్మగౌరవ గర్జన కార్యక్రమం విజయవంతమైంది. కేటీఆర్ కోసం జిల్లా నలుమూలల నుంచీ బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తరలివచ్చారు. భారీ వర్షంలోనూ కేటీఆర్ ప్రసంగాన్ని ఆద్యంతం ఆసక్తిగా విన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించినా, స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే కుట్రలకు పాల్పడినా ఆత్మగౌరవ గర్జన విజయవంతమైంది. అంబేద్కర్ చౌరస్తా వద్ద నలుదిక్కులా బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలకు అడ్డు తగిలేలా కాంగ్రెస్ నేతలు పోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్, జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజు, ఎమ్మెల్సీ జనార్దన్‌గౌడ్ పాల్గొన్నారు.
అంబేద్కర్ జయంతి రోజున ఎక్కడైతే ముదాం సాయిలుకు అవమానం జరిగిందో.. అక్కడే ఈ రోజు ఆయనకు సన్మానం చేసినం. సాయిలుకు జరిగిన అవమానం తెలంగాణలోని దళితులందరికీ జరిగిన అవమానం! సాయిలుకు జరిగిన అవమానంపై తప్పకుండా బదల్నా తీసుకుంటం.దళిత వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దింపుతం. -కేటీఆర్
ఈ ఆత్మగౌరవ పోరాటం నిజానికి, అబద్ధానికి మధ్య జరుగుతున్నది. ప్రజలంతా ఆలోచన చేయాలి. మనం ఎవరి వైపు ఉండాలి? నిజం వైపా? అబద్ధం వైపా?.. అభివృద్ధి వైపా? దోపిడీ వైపా? అన్నది ఆలోచించాలె. కష్టాలు, కన్నీళ్లను పునాదిగా మార్చుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండాను రెపరెపలాడించాలె.
-ఆర్ఎస్పీ