KTR | హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : ‘రేవంత్‌రెడ్డీ.. తెలంగాణ నీ జాగీరా?.. కొడంగల్ నీ జాగీరా.. భూమి ఇయ్యనంటే జైల్లో పెట్టేందుకు నువ్వెవరు? నియంతవా? చక్రవర్తివా?’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో అత్యున్నత వేదిక శాసనసభ అని, ఆ శాసనసభలో రైతుల గురించి చర్చపెట్టుమంటే దమ్ములేక పారిపోయిన దద్దమ్మ రేవంత్‌రెడ్డి అని దుయ్యబట్టా రు. తెలంగాణలో లాఠీరాజ్యం.. లూటీ రా జ్యం నడుస్తున్నదని విరుచుకుపడ్డారు. అరాచక, దుర్మార్గ, నికృష్టమైన ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. సోమవా రం అసెంబ్లీ ముగిసిన తర్వాత బీఆర్ఎస్ ఎ మ్మెల్యేలతో కలిసి ఆయన మీడియా పాయింట్లో మాట్లాడారు. చెయ్యని తప్పునకు, కేవ లం తమ భూమి తమకే ఉండాలని కోరుకున్నందుకు, తమ భూమిని ప్రభుత్వం గుంజుకుంటుంటే ప్రతిఘటించిన పాపానికి కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల గిరిజన, దళిత, బలహీన వర్గాల రైతులను జైల్లో పెట్టిన నికృష్టపు ప్రభుత్వం రేవంత్‌రెడ్డిదని దుయ్యబట్టారు. తమ భూములు ఇవ్వబోమంటే వారి పై అప్రజాస్వామికంగా కేసులు పెట్టి, వారిని థర్డ్ డిగ్రీ టార్చర్‌కు గురిచేశారని ఆవేదన వ్యక్తంచేశారు. కస్టడీలో ఉన్నవారిని కొడుతూ, కరెంటుషాకులిస్తూ తిరుపతిరెడ్డికి, ఎస్పీకి వీడి యో కాల్ చేసి పోలీసులు పైశాచిక ఆనందం పొందారని మండిపడ్డారు. ‘లగచర్ల రైతుల అరెస్టులపై సోషల్ మీడియాలో ఎవరైనా పో స్టు పెడితే అరెస్టులు.. మీ ఫ్రీ బస్ వల్ల.. మా రైడర్షిప్లు తగ్గాయి’ అని మెట్రో అధికారులంటే వారిని కూడా అరెస్టు చేసే పద్ధతి రాష్ట్రం లో ఉన్నది’ అని నిప్పులు చెరిగారు.
చర్చపెట్టే దమ్ములేక పారిపోయినవ్
‘ప్రజాస్వామ్యంలో అత్యున్నత వేదిక శాసనసభ. ఆ శాసన సభలో రైతుల గురించి చర్చపెట్టుమంటే దమ్ములేక పారిపోయిన దద్దమ్మ రేవంత్‌రెడ్డి’ అని కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సంగారెడ్డి జైల్లో ఉన్న కొడంగల్ గిరిజన రైతులు, చర్లపల్లి జైల్లో ఉన్న పట్నం నరేంద్‌రెడ్డి విడుదలవుతారని, న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం ఉన్నదని చెప్పారు. రేవంత్‌రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా, కుయుక్తులు పన్నినా ఆ రైతుల తరఫున కొట్లాడుతూనే ఉం టామని, రోజుకో కొత్తరూపంతో వస్తామని, అసెంబ్లీలో ఎండగడతామని హెచ్చరించారు. ‘అదానితో నీ దోస్తీని ఎండగట్టేందుకు మేం వస్తే.. శాసనసభలో అడుగుపెట్టనివ్వలేదు. ఇవాళ లగచర్లలో జరిగిన దానిపై చర్చకుపట్టుబడితే రాలేదు. ఎందు కు ఆ గిరిజన ఆడబిడ్డలపై అర్ధరాత్రి అరాచకాలు? వారిపట్ల ఎందు కు దౌర్జన్యం చేస్తున్నవ్? వాళ్లను ఎందుకు భయపెడుతున్నవ్.. మగవాళ్లను జైళ్లలో పెట్టినవ్. ఇంటింటికి పోయి ఆడబిడ్డలను ఎందుకు బెదిరిస్తున్నవ్? అని అడిగితే సమాధానం చెప్పలేని సన్నాసి ప్రభుత్వమిద’ని ధ్వజమెత్తారు.
మీ తరఫున కేసీఆర్ ఉన్నరు.. భయం వద్దు
‘రాష్ట్ర ప్రజానీకానికి, కొడంగల్ ప్రజలకు మేమిచ్చే భరోసా ఒక్కటే.. మీ తరఫున మేమున్నం. కేసీఆర్ ఉన్నరు. ఎన్ని రకాలుగా క్షోభపెట్టే ప్రయత్నం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేసినా తప్పకుండా మీకు అండగా నిలబడుతం’ అని కేటీఆర్ హామీ ఇచ్చారు. లగచర్లలో ఫార్మా విలేజ్ అనే ప్రతిపాదనను వెనక్కి తీసుకొని మరోవైపు పారిశ్రామిక కారిడార్ పేరిట భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారని ఎండగట్టారు. ‘ఈ రాష్ట్రంలో ఉన్నది ప్రజాస్వామ్య ప్రభుత్వామా? నియంత ప్రభుత్వామా? అనేది ప్రజలు గ్రహించాలి’ అని కేటీఆర్ సూచించారు. ‘కొడంగల్ ఒక్కటే కా దు.. జహీరాబాద్లోనూ రైతులు భూము లు ఇవ్వబోమని అంటున్నరు. అక్కడ కూడా బలవంతంగా గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారనే విషయం మా ఎమ్మెల్యే మాణిక్యం చెప్పిండు. 14 వేల ఎకరాలు గత ప్రభుత్వం సేకరించి పెడితే.. దాన్ని రద్దు చేసి రైతులకు ఇస్తామని చెప్పింది మీరు. ఫార్మాసిటీని వద్దని చెప్పింది మీరు. ఫార్మాసిటీ రద్దు చేస్తున్నామని, రైతులకు భూములిస్తామని, కందుకూరు, యాచారంలో తిరిగి తిరిగి చెప్పింది మీరు. ఇవాళ హైకోర్టును, అటు రైతులను మోసం చేస్తున్న రు’ అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
అర్ధరాత్రి తిరుపతిరెడ్డి అరాచకమేంది?
‘లగచర్లలో అర్ధరాత్రి అరాచకం ఎందుకు జరిగింది? సీఎం రేవంత్‌రెడ్డి అన్న ఎనుముల తిరుపతిరెడ్డి కనుసన్నల్లో అక్కడ పోలీసులు, అధికారులు ఎందుకు నడుస్తున్నరు? ఒక రా జ్యాంగేతర శక్తిగా తిరుపతిరెడ్డి ఎందుకు ఊరేగుతున్నడు? 200 మంది పోలీసులు ఎం దుకు వత్తాసు పలుకుతున్నరు’ అని కేటీఆర్ నిలదీశారు. ఈ అంశాలపై అసెంబ్లీలో నిలదీస్తామన్నారు. గుండెనొప్పి వచ్చిందని చెప్పిన రైతుకు బేడీలు వేసి వైద్యం చేసే దిక్కుమాలిన, నికృష్టపు ప్రభుత్వాన్ని శాసనసభలోనే నిలదీస్తామని హెచ్చరించారు. ‘రైతులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే దాకా, పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించుకునేదాకా, రైతులకు బేషరుతుగా క్షమాపణలు చెప్పేదాకా, వారిని జైలు నుంచి విడిపించే దాకా, వారి తరఫున మా పోరాటం కొనసాగుతది.. శాసనసభ జరిగినంత కాలం.. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, సమాధానం రాబడతాం. ఇవాళ మీరు పారిపోవచ్చు.. రేపటి నుంచి ఎక్కడికిపోతరో చ్తూం’ అని కేటీఆర్ హెచ్చరించారు.
కాంగ్రెస్ నేతలు పెయింటర్లే: కేటీఆర్
కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేయడం రేవంత్‌రెడ్డి తరం కాదని కేటీఆర్ ఫైర్ అయ్యా రు. భద్రాచలంలో కేసీఆర్ హయాంలోనే పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్లకు రేవంత్ సర్కార్ మూడు రంగులు వేయడంపై సోమవారం ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ నిర్మించిన ఇండ్లకు సున్నాలు వేసి.. అవే ఇందిరమ్మ ఇండ్లు అని ప్రజల కండ్లకు గంతలు కట్టలేవంటూ ధ్వజమెత్తారు. ప్రజల సొంతింటి కల నెరవేర్చేందుకు కేసీఆర్ పడ్డ తపన.. గోసపడ్డ ప్రతి గుండెకూ తెలుసని, ప్రతి పేదవాడికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలనేది కేసీఆర్ కల అని స్పష్టం చేశారు. ఎన్నాళ్లున్నా కాంగ్రెస్ నేతలు పెయింటర్లు మాత్రమేనని.. ఎప్పటికీ మీరంతా సున్నాలేసే బ్యాచ్ మాత్రమేనని సెటైర్లు వేశారు.
నేడు అంబేద్కర్ విగ్రహాలకు వినతి
లగచర్ల రైతులపై అక్రమ కేసులు పెట్టి, వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైళ్లలో నిర్బంధించినందుకు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమాలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. రైతన్నల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ, అణచివేత వైఖరిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేసి వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 11 గంటలకు అన్ని నియోజకవర్గాల్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేదర్ విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పించి నిరసన తెలుపాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు హరీశ్‌రావు, పద్మారావుగౌడ్, జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, ప్రశాంత్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ముఠాగోపాల్, మాణిక్‌రావు, చింతా ప్రభాకర్, మాగంటి గోపీనాథ్, కోవా లక్ష్మి, డాక్టర్ సంజయ్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, విజయుడు, అనిల్ జాదవ్ పాల్గొన్నారు.
30 రోజులకుపైగా రైతులు జైల్లో ఉన్నరు.. ముగ్గురు అనారోగ్యం
పాలైండ్రు. రైతు హీర్యా నాయక్‌కు గుండెపోటు వస్తే అత్యంత క్రూరంగా, అమానవీయంగా సంకెళ్లతో దవాఖానకు తీసుకెళ్లి వైద్యం చేయించిండ్రు. ఇంతకంటే అరాచకం, దుర్మార్గం, చిల్లర ప్రభుతాన్ని ఈ దేశంలో ఎన్నడన్న చూసినమా? రాష్ట్ర ప్రజలే మీ భరతం పడుతరు..
ముఖ్యంగా రైతులే పడతరు.
-కేటీఆర్
నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండే రకాల పర్యాటకం కొనసాగుతున్నది. ఒకటేమో ఢిల్లీ పర్యాటకం. ఇందులో ఎక్కే విమానం.. దిగే విమానం తప్ప రూపాయి వచ్చింది లేదు. ఏడాది కాలంగా ముఖ్యమంత్రి 30 సార్లు ఢిల్లీ పోయిండు.. మంత్రులు 70 సార్లు పోయిండ్రు. వీరంతా వందసార్లు పోయినా వంద పైసలు కూడా తేలేదు. ఇక రెండోది జైళ్ల పర్యాటకం. ఎవరు ఈయన మీద మాట్లాడినా వారిని జైల్లో పెట్టాలనేది వారి టార్గెట్. -కేటీఆర్
సీఎం సొంత నియోజకవర్గానికి చెందిన అమాయక గిరిజన రైతులు 35 రోజులుగా జైల్లో ఉంటే అది సబ్జెక్ట్ కాదట! అది చర్చనీయాంశం కాదట! అది వదిలేసి పర్యాటక రంగానికి సంబంధించి చర్చపెడతానంటున్న రేవంత్‌రెడ్డీ.. నీకు మనసుందా? హృదయం ఉన్నదా? నీకు ఓటు వేసి
గెలిపించి ముఖ్యమంత్రిని చేసిన సొంత ప్రజలు జైల్లో ఉంటే పర్యాటక శాఖపై చర్చకు రావడానికి సిగ్గులేదా?
-కేటీఆర్