KTR | రాజన్న సిరిసిల్ల : కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఢిల్లీలో కుస్తీ.. గల్లీలో దోస్తీ అన్నట్టు ఈ రెండు పార్టీల వైఖరి ఉందని కేటీఆర్ మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.
రాష్ట్రంలో మా ప్రభుత్వం చేసిన మంచి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేస్తోంది. కొత్త జిల్లాలను రద్దు చేయాలని, కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని చిల్లర ప్రయత్నం చేస్తున్నారు. ఆరు గ్యారెంటీలను తుంగలో తొక్కారు. రైతుభరోసా అని చెప్పి మోసం చేశారు. రుణమాఫీ విషయంలో తేదీలు మార్చుతూ సీఎం ఒట్లకు పరిమితమయ్యారు. రైతాంగమంతా ఒకటే అనుకుంటున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడే వ్యవసాయం బాగుండే అంటున్నారు. రైతులు భగ్గున మండుతున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రైతులు కర్రుకాల్చి వాత పెట్టినట్టు అర్థమైంది. ఆ వ్యతిరేకత ఓట్ల రూపంలో కనబడుతుంది. ఆడబిడ్డల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్రమైన వ్యతిరేకత కనబడింది. కోటి 67 లక్షల మంది ఆడబిడ్డలకు 100 రోజుల్లో 2500 ఇస్తామన్నారు. తులం బంగారం, స్కూటీ అన్నారు.. ఈ హామీలు నెరవేరలేదు. మంచినీళ్ల కోసం బిందెలు పట్టుకుని రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో మహిళలు ఈ ప్రభుత్వాన్ని క్షమించే పరిస్థితి లేదు. 4 వేల పెన్షన్ ఇవ్వలేదు. ఈ ఐదు నెలల కాలంలో కాంగ్రెస్కు తోడైంది ఏం లేదు అని కేటీఆర్ స్పష్టం చేశారు.
బీజేపీ పట్ల కూడా తెలంగాణ ప్రజలకు సానుకూలత లేదు. తెలంగాణ నుంచి నలుగురు ఎంపీలను గెలిపించినా ఏం అభివృద్ధి జరగలేదు. పెట్రోల్, డిజీల్, నిత్యావసర వస్తువుల ధరలు పిరం అయిన తర్వాత మోదీ మీద వ్యతిరేకత కనబడుతుంది. కాంగ్రెస్, బీజేపీ వైఫల్యాలను అర్థం చేసుకుని 17 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను నిలబెట్టాం. 50 శాతం సీట్లను బీసీలకు కేటాయించి సామాజిక సమతూకాన్ని పాటించి, బలహీన వర్గాలకు బీఆర్ఎస్ పార్టీ న్యాయం చేసిందని కేటీఆర్ తెలిపారు.
బలమైన సీనియర్ నాయకులను పోటీలో పెట్టాం. కాంగ్రెస్ పార్టీ మాత్రం చివరి నిమిషంలో వచ్చిన పారాచూట్ లీడర్లకు సీట్లు కేటాయించింది. బీజేపీ అభ్యర్థులు ఆరేడుగురు, కాంగ్రెస్లో నలుగురు అభ్యర్థులు మా పార్టీ నుంచి పోయిన వారే ఉన్నారు. దీంతో ఆ పార్టీ అభ్యర్థుల పట్ల విముఖత కనబడింది. మా అభ్యర్థుల పట్ల ప్రజల్లో సానుకూలత కనబడింది. ఇవాళ రెండు జాతీయ పార్టీలకు ముచ్చెటలు పట్టించే పరిస్థితి గులాబీ దండు తీసుకొచ్చింది. ఢిల్లీలో కుస్తీ.. గల్లీలో దోస్తీ అన్నట్టు వ్యవహారం నడుస్తోంది. ఆరేడు సీట్లలో కాంగ్రెస్ పార్టీ బలహీనమైన నాయకులను పెట్టింది. కరీంనగర్, నిజామాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి ఇలా ఆరేడు సీట్లలో డమ్మీ అభ్యర్థులను పెట్టి బీజేపీని గెలిపించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నించాడు. కిషన్ రెడ్డి కంటే ఎక్కువ రేవంత్ రెడ్డి కష్టపడ్డాడు అని కేటీఆర్ పేర్కొన్నారు.