KTR | హైదరాబాద్ : రాబోయే ఎన్నికల్లో మనం గెలవడం మన కోసం కాదు.. తెలంగాణ సమాజానికి మళ్లీ తిరిగి కేసీఆర్‌ను సీఎం చేసుకోవడం చారిత్రక అవసరం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాల్సిన బాధ్యత తెలంగాణ సమాజంపై ఉంది. కచ్చితంగా ఏప్రిల్ 27వ తేదీ నాడు.. వరంగల్‌కు తరలిరావాలి అని కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో రాజేంద్ర నగర్ ఇంచార్జ్ పటోళ్ల కార్తీక్ రెడ్డి అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీలో అత్తాపూర్ డివిజన్ నుండి శ్రీరామ్ రెడ్డి, పలు పార్టీల నేతలు చేరారు. వారందరికి కేటీఆర్ గులాబీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
పదేండ్ల పాటు సంక్షేమాన్ని, అభివృద్ధిని జోడెద్దుల్లాగా కేసీఆర్ పరుగులు పెట్టించారు. మొన్నటి ఎన్నికల్లో మనం ఓడిపోవడంతో మనకు జరిగిన నష్టం తక్కువ.. కానీ మన ఓటమితో తెలంగాణ సమాజానికి ఎక్కువ నష్టం జరిగింది. ఇది అక్షర సత్యం, వాస్తవం అని కేటీఆర్ స్పష్టం చేశారు.
తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆకాశ స్థాయికి తీసుకుపోయి స్వరాష్ట్రాన్ని సాధించిన గులాబీ జెండా.. మన నాయకుడు కేసీఆర్. ఈ రికార్డును ఎవరూ చెరపలేరు. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తామని ఎవరన్న అనుకుంటే అది వారి అజ్ఞానం. రేవంత్ రెడ్డి మీద నోరుపారేసుకుని మన నోరును కరాబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికి తెలంగాణ మీద ప్రేమ ఉంటది.. రైతులకు, పేదలకు, విద్యార్థులకు, మహిళలకు లాభమైతది అని చర్చ పెట్టాలి అని కేటీఆర్ సూచించారు.
బీజేపీ దేశంలో మతం పిచ్చి లేపడం తప్ప చేసిందేమీ లేదు. ప్రపంచ ర్యాంకుల్లో వివిధ రంగాల్లో వెనక్కి పోతున్నాం. రేవంత్ నాయకత్వంలో తెలంగాణ వెనక్కి పోయినట్టే.. మోదీ నాయకత్వంలో దేశం వెనక్కి పోతుంది. నెగిటివ్ పాలిటిక్స్ తప్ప బీజేపీ చేసిందేమీ లేదు. మనం కేంద్రానికి ఇచ్చేది రూపాయి అయితే వాపస్ 45 పైసలు వస్తుంది. ఈ దేశానికి సాదుతున్న రాష్ట్రాల్లో మన తెలంగాణ కూడా ఒకటి. మత పిచ్చి అనేది మంచిది కాదు. సమాజాన్ని విచ్ఛిన్నం చేయకూడదు. హిందువులు ప్రమాదంలో ఉన్నారట. 2014 వరకు మంచిగా ఉన్న హిందువులు ఇప్పుడు ప్రమాదంలో ఉన్నరాట. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లేని పంచాయితీ ఇప్పుడు ఎందుకు కొత్తగా పెడుతున్నారు. రాజకీయం కోసం దేశాన్ని విడగొడుతున్నారు. మంచి పనులు చేసి ఓట్లు అడగాలి. హిందు, ముస్లిం, పాకిస్తాన్, జై శ్రీరాం, మోదీ.. ఈ ఐదు పదాలు చెప్పకుండా ఓట్లు అడిగేటోళ్లు ఎవరైనా ఉన్నారా..? అని కేటీఆర్ నిలదీశారు. తెలంగాణకు సంబంధించినంత వరకు అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ రెండు శత్రువులే అని కేటీఆర్ పేర్కొన్నారు.