హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : పదేండ్ల కేసీఆర్ పాలనలో అద్భుతంగా పురోగమించిన తెలంగాణ, అవినీతి, అసమర్థత, అనుభవరాహిత్యం కలగలిసిన రేవంత్‌రెడ్డి పాలనలో అన్ని రంగాల్లో తిరోగమిస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం ఎక్స్ వేదికగా విమర్శించారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి రవాణా శాఖ ఆదాయం ఒక ముఖ్యమైన సూచీ అని, ప్రజల ఆర్థిక పరిస్థితులు బాగుంటే బైకులు, కార్లే కాకుండా ఇతర భారీ వాహనాల అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు వృద్ధి సాధిస్తాయని వెల్లడించారు. కానీ తెలంగాణలో మాత్రం రిజిస్ట్రేషన్లు తగ్గి, ఆదాయం తిరోగమనంలో ఉన్నదని, పొరుగున ఉన్న ఐదు రాష్ర్టాలు ఈ ఏడాది రవాణా శాఖ ఆదాయంలో 8 శాతం నుంచి 32 శాతం వృద్ధిని నమోదు చేశాయని తెలిపారు. తెలంగాణ ఒక్కటే నిరుడు కంటే తక్కువ వృద్ధిని నమోదు చేయడం రాష్ట్రంలో విఫల ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతున్నదని విమర్శించారు. పాలనను గాలికొదిలేసి కక్ష సాధింపుకే సమయం కేటాయిస్తే ఫలితాలు ఇలా గాక మరెలా ఉంటాయని సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు.
డబ్బు సంచులతో రెడ్ హ్యాండెడ్‌గా దొరికి జైలుకెళ్లొచ్చిన రేవంత్‌రెడ్డి, తనలానే అందరూ జైలు జీవితాన్ని అనుభవించాలని కోరుకుంటున్నారని కేటీఆర్ ఎద్దేవాచేశారు. ఈ మేరకు ఓ నేషనల్ మీడియాకు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో రేవం త్ వీడియోను ఎక్స్‌లో షేర్ చేశారు. ఓ ప్రభుత్వ పథకంతో తమ సంస్థపై ప్రభావం పడే అవకాశం ఉన్నదని అభిప్రాయపడ్డందుకు ఎల్అండ్టీ సంస్థకు చెందిన సీఎఫ్‌వోను జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ప్రతిష్ఠాత్మకమైన పారిశ్రామిక సంస్థను బెదిరించడం మూర్ఖత్వమని, ఇలాంటి పనికిమాలిన ప్రకటనలతో పారిశ్రామిక వర్గాలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించా రు. పెట్టుబడులను ఆకర్షించడానికి మీరు అనుసరిస్తున్న వ్యూ హం ఇదేనా? అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని నిలదీశారు.
హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): వరంగల్, నల్లగొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిని కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ టీచర్స్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (సీపీఎస్ టీఈఏ) ప్రకటించింది. తమ అభ్యర్థిగా పంతులు మధుబాబును బరిలో దించనున్నట్టు సీపీఎస్ టీఈఏ రాష్ట్ర అధ్యక్షుడు దాముక కమలాకర్ ఆదివారం ప్రకటించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మధుబాబు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు.