KTR | వికారాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): రాముడిని మొక్కుదాం.. బీజేపీని తొక్కుదాం అని ప్రజలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం వికారాబాద్‌లోని గౌలీకార్ ఫంక్షన్ హాల్లో జరిగిన వికారాబాద్ నియోజకవర్గ సన్నాహాక సమావేశంలో పాల్గొన్న ఆయన.. ‘రాముడికి దండం పెడదాం.. బీజేపీకి ఓటేయండి అని బీజేపోళ్లు అంటున్నారు. రాముడికి దండం పెడదాం కానీ ఓటేందుకు బీజేపీకి వేయాలో ఆలోచిద్దాం. ఆ పార్టీ దేశానికి, దేశ ప్రజలకు చేసిందేమీ లేదు.
దేవుడిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నది. రూ.60 ఉన్న డీజిల్‌ను రూ.100 చేసినందుకు బీజేపీకి ఓటేయాలా? రూ.70 ఉన్న పెట్రోల్‌ను రూ.110 చేసినందుకా? రూ.400 ఉన్న సిలిండర్ రూ.1200కు చేసినందుకా? పప్పు, ఉప్పు, నూనె, చింతపండు పిరం చేసినందుకా? నరేంద్ర మోదీ ప్రియమైన ప్రధానమంత్రి కాదు. పిరమైన ప్రధానమంత్రి. మోదీ అందరి ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని జన్‌ధన్ ఖాతాలు తెరిపించారు. మరి రూ.15 లక్షలు వేశారా? రాష్ర్టానికి కొత్త రైలు ఇచ్చిండా? కొత్త ఫ్యాక్టరీ పెట్టిండ్రా? పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిండ్రా? ఐటీఐఆర్‌ను రద్దు చేసి మన యువకుల నోట్లో మట్టి కొట్టినందుకా?’ అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి గుంపు మేస్త్రీ, ప్రధానమంత్రి తాపీమేస్త్రీ.. వీరిద్దరు కలిసి తెలంగాణకు సమాధి కట్టే ఆలోచనతో ఉన్నారని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటై పనిచేస్తున్నాయని విమర్శించారు.
‘ఎన్నికల్లో పోటీ పదేండ్ల నిజానికి, వంద రోజుల అబద్ధానికే. కాంగ్రెసోళ్లు ఎన్ని కథలు చెప్పిండ్రు. రుణమాఫీకి డిసెంబర్ 9న సంతకం పెడతానని రేవంత్‌రెడ్డి అన్నడు. ఇప్పుడు మీడియా అడిగితే అది పెద్ద సీరియస్ విషయం కాదని అంటున్నడు. రూ.2 లక్షణ రుణమాఫీ, మహిళలకు రూ.2,500, 24 గంటల కరెంట్ ఇవ్వాలి. నాలుగు నెలలైనా కేసీఆర్‌ను తిట్టుడు తప్ప చేసిందేమీ లేదు. ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టే మాట్లాడుతున్నడు’ అని కేటీఆర్ విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలోకి జంప్ అయ్యే మొట్టమొదటి వ్యక్తి రేవంత్‌రెడ్డేనని స్పష్టం చేశారు. ‘ఎవరు ప్రభుత్వాన్ని కూలగొడ్తారో చూస్తా అని రేవంత్‌రెడ్డి అంటున్నారు.
మేమేం కూలగొట్టం. ఆ ఖర్మ మాకు పట్టలేదు. నువ్వు ఐదేండ్లు ఉండాలి. 420 హామీలు అమలుచేయాలి. చేయకపోతే మాత్రం వెంటాడుతాం, వేటాడుతాం. నీ పక్కనే నల్లగొండ బాంబు, ఖమ్మం బాంబులున్నాయి. వారి నుంచే ప్రమాదం ఉన్నది’ అని సీఎంను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సమావేశంలో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ వాణీదేవి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, మహేశ్‌రెడ్డి, బీఆర్ఎస్ నేతలు పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి, నాగేందర్‌గౌడ్, శ్రీశైల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.