KTR | హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మిక పక్షపాతి అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో కార్మికులకు అండగా నిలిచినట్టే.. భవిష్యత్‌లోనూ వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మే డే వేడుకల్లో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చిరుద్యోగులను కేసీఆర్ మంచిగా చూసుకున్నాడు. 20,455 వీఆర్ఏలను క్రమబద్దీకరించాం. 25 వేల ఔటో సోర్సింగ్ విద్యుత్ ఉద్యోగులను క్రమబద్దీకరించాం. 5 వేల మంది పీఏసీఎస్ ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీని అమలు చేసింది కేసీఆర్. 3,974 మంది సెర్ప్ ఉద్యోగులకు పే స్కేల్ అమలు చేశారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసింది కేసీఆర్ ప్రభుత్వం. మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా నియమించారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పీఆర్సీ వర్తింపజేశారు. సింగరేణి లాభాల్లో 20 శాతం వాటా కార్మికులకు ఉండేది. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత లాభాల్లో 32 శాతం వాటా ఇచ్చారు. అంతేకాకుండా అంగన్వాడీ టీచర్లకు, ఆశా వర్కర్లకు, సెర్ప్ ఉద్యోగులకు, జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికులకు కేసీఆర్ జీతాలు పెంచారని కేటీఆర్ గుర్తు చేశారు.
ఇదే మోదీ రైతుల ఆదాయం డబుల్ చేస్తాన్నాడు. కానీ చేయలేదు. ప్రపంచ కుబేరుల జాబితాలో 2014లో 609వ స్థానంలో ఉన్న అదానీ ఇప్పుడు 2వ స్థానానికి ఎగబాకిండు. ఆయన సంపద లక్షల రెట్లు పెరిగింది. దీనికి కారణం మోదీనే. కార్పొరేట్లను పట్టించుకున్నడు కానీ కార్మికులకు మోదీ, ఆయన ప్రభుత్వం చేసిందేమీ లేదు. ఏం చేశారో చెప్పే దమ్ము కూడా ఆ నేతలకు లేదు. గట్టిగా మాట్లాడితే జై శ్రీరాం అంటరు. దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం తగదు. శ్రీరాముడు అందరివాడు. లంగలకు, దొంగలకుఓట్లు వేయమని శ్రీరాముడు చెప్పలేదు. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రజల తరపున పోరాటం చేస్తాం. ఎంపీ ఎన్నికల్లో సామాజిక న్యాయం పాటించాం. ఈ ఎన్నికల్లో 12 సీట్లు గెలిపిస్తే రాబోయే సంవత్సర కాలంలో తెలంగాణ రాజకీయాలను కేసీఆర్ శాసిస్తారని, మళ్లీ తెలంగాణలో గులాబీ జెండా ఎగరబోతదని కేటీఆర్ అన్నారు.