KTR | హైదరాబాద్ : ఫార్ములా ఈ రేస్ నిర్వాహకులకు రూ. 55 కోట్లు చెల్లించింది వాస్తవం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. లైసెన్స్ ఫీజు రూ. 74 లక్షలు వాపస్ పంపుతూ ఎఫ్ఎంఎస్ఏ వాళ్లు లేఖ రాశారు అని కేటీఆర్ తెలిపారు. ఇందులో అవినీతి జరిగిందెక్కడో వివరణ ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఫార్ములా ఈ రేస్ కేసు వ్యవహారంపై కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు తన హయాంలో జీనోమ్ వ్యాలీ స్థాపించారు. ఇవాళ వ్యాక్సిన్ల ఉత్పత్తికి హైదరాబాద్ హబ్‌గా మారింది. ఇలా ముందుచూపుతో ప్రభుత్వాలు పనులు చేస్తాయి. మేం కూడా కేసీఆర్ నాయకత్వంలో ఆటో మొబైల్, రెన్యువల్ బుల్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు తెలంగాణలోని హైదరాబాద్ కేంద్రంగా దేశానికి ఉండాలనుకున్నాం. ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన ఈకో సిస్టం డెవలప్ చేయాలని, హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో పెట్టడానికి ఫార్ములా ఈ రేస్ వాళ్లను అప్రోచ్ అయ్యామని కేటీఆర్ తెలిపారు.
25 అక్టోబర్ 2022న నాలుగు సీజన్ల కోసం సంతకాలు చేశాం. రేస్ చుట్టూ ఒక తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ఏర్పాటు చేయాలి. ఇన్నోవేషన్, రీసెర్చ్, మ్యానుఫ్యాక్చరింగ్‌కు హబ్ కావాలని ఇదంతా చేశాం. ఫార్ములా ఈ వాళ్లను సంప్రదిస్తే.. ఇండియాలో వీలుకాదని చెప్పారు. కానీ తంటాలు పడి ఒప్పించాం. ఇది హైదరాబాద్ ఈవెంట్ కాదు.. ఇది ఇండియా ఈవెంట్. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఫార్ములా ఈ వాళ్లతో పాటు గ్రీన్ కో అనే ప్రమోటర్ కంపెనీతో కలిపి భాగస్వాములను చేశాం. అలా గ్రీన్ కో కంపెనీతో అగ్రిమెంట్ చేసుకున్నాం. ఫిబ్రవరి 10, 2023లో రేసింగ్ కండక్ట్ చేశాం. ఆ వారం రోజుల పాటు మొబిలిటీ వీక్ అమలు చేశాం. హ్యుందాయ్, అమర్ రాజా కంపెనీ వంటి ఎలక్ట్రిక్ కంపెనీలు పెట్టుబడులతో వచ్చాయి. ఆనంద్ మహీంద్రా గర్వంగా ట్వీట్ చేశారు రేస్ అద్భుతమని. అనురాగ్ ఠాకూర్, కిషన్ రెడ్డి కూడా వచ్చి తిలకించారు. సచిన్ టెండూల్కర్ తో పాటు ఇతర ప్రాంతాల నుంచి ప్రముఖులు వచ్చారు. ప్రపంచంలోని పాపులర్ డ్రైవర్స్ ఇక్కడికి వచ్చారు. రాజకీయ దిగ్గజాలు కూడా ఫార్ములా ఈ రేసింగ్‌కు అటెండ్ అయ్యారు. రేస్‌ను ప్రమోట్ చేసేందుకు గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద కార్యక్రమం నిర్వహించాం. బాంబేలో పెట్టాలని మహారాష్ట్ర సీఎం కూడా వాదించారు. దాని తర్వాత ఢిల్లీలో క్రికెటర్లు, ఎంపీలతో కలిసి ఈవెంట్ ప్రమోషన్ నిర్వహించాం అని కేటీఆర్ తెలిపారు.
ఈ రేస్ వల్ల హైదరాబాద్‌కు బెనిఫిట్ ఏంటంటే.. హైదరాబాద్‌లో జరిగే ఈవెంట్‌కు హెచ్ఎండీఏ 35 కోట్లు ఖర్చు పెట్టాం. ఆ ప్రమోటర్ గ్రీన్ కో కంపెనీ 110 కోట్లు ఖర్చు పెట్టారు. ఇక రేస్ తర్వాత నెల్సన్ అనే సంస్థ అధ్యయనం చేసి రిపోర్టు ఇచ్చారు. హైదరాబాద్‌కు ఈ రేస్ వల్ల 82 మిలియన్ డాలర్ల ఎకనామిక్ బెనిఫిట్ వచ్చిందని చెప్పారు. ఖర్చు 150 కోట్లు మాత్రమే.. 550 కోట్ల అదనంగా ఎకానమిక్ బెనిఫిట్ జరిగింది. ప్రమోటర్‌గా వ్యవహరించిన గ్రీన్ కో కంపెనీ వాళ్లు నాకు పైసలు రాలేదని.. కాబట్టి నేను వెనక్కి వెళ్తున్నా.. వచ్చే ఏడాది చేయలేను అని చెప్పారు. 2023లో ఎన్నికలు, ఇతరత్రా ఉన్న క్రమంలో జూన్ నాటికి సెక్రటరి అరవింద్ కుమార్ వచ్చి.. నాలుగు ఏండ్ల అగ్రిమెంట్ ఉందని అడిగారు. ఈవీలకు తెలంగాణ హబ్ కావాలంటే.. ఎలన్ మస్క్ లాంటి వ్యక్తిని పట్టుకొచ్చి ప్రపంచ దృష్టిని ఆకర్షించాలనేది మా ప్రయత్నం. 3 ఆగస్టు 2023న ఫార్ములా ఈ నుంచి ఈమెయిల్ వచ్చింది. హెచ్ఎండీఏ నుంచి 55 కోట్లు కడుదామని చెప్పాను. రేస్ పోనివొద్దని.. ప్రమోటర్‌ను వెతుకుదామని చెప్పాను. అరవింద్ కుమార్ రెండు దఫాలుగా డబ్బులు పంపించారు. ఒకటేమో 5 అక్టోబర్, 11 అక్టోబర్ 2023న డబ్బులు పంపించారు. అక్టోబర్ 19న హైదరాబాద్‌ను కాలేండర్లో చేర్చుతూ ఫార్ములా ఈ రేస్ వారు నిర్ధారించారు. ఆ డబ్బులు కట్టడం వల్ల రేస్ మిగిలింది.. డబ్బులు కట్టకపోతే రేస్ పోయేది అభాసు పాలయ్యే వాళ్లం. ఇలాంటివి జరుగుతుంటాయి.. ప్రపంచంలో ఇది మొదటిసారి కాదు.. ఇదే చివరిసారి కాదు అని కేటీఆర్ తెలిపారు.