KTR | హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి వైఫల్యాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. హైదరాబాద్లో నాలాలో కొట్టుకుపోయిన ముగ్గురి ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాకపోవడంతో.. మున్సిపల్ మంత్రిగా ఉండి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నట్టు అని కేటీఆర్ నిలదీశారు.
మీ కాంగ్రెస్ సర్కారు ఘోర తప్పిదం వల్ల ఎస్ఎల్బీసీ టన్నెల్ కుప్పకూలి మరణించిన ఆరుగురి మృతదేహాలను బయటకు తీయలేక చేతులెత్తేశావు. చివరికి హైదరాబాద్లో నాలాలో కొట్టుకుపోయిన ముగ్గురి పార్థివదేహాలను మూడురోజులైనా గుర్తించలేవా..? ఇంతకన్నా అసమర్థతత, చేతకానితనం, పరిపాలనా వైఫల్యం ఇంకోటి ఉంటదా..?? కనీసం తమ ఆప్తులను చివరి చూపు కూడా చూసుకోలేని ఆ బాధిత కుటుంబాల ఆవేదన, గుండెకోత, మానవత్వం లేని కాంగ్రెస్కు వినిపించడం లేదా ? అని కేటీఆర్ ప్రశ్నించారు.
చిన్న పాటి వర్షానికే పొంగిపొర్లుతున్న నాలాలు, చివరికి ప్రజల ప్రాణాలు హరిస్తుంటే మున్సిపల్ మంత్రిగా కూడా ఉండి ఏం చేస్తున్నట్టు ? విపత్కర పరిస్థితుల్లో ప్రజల కష్టాలు తీర్చేందుకు ఏర్పాటుచేసిన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ను కూడా నిర్వీర్యం చేయడం వల్లే ఈ దుస్థితి. ఎస్ఎల్బీసీ సొరంగంలో ఆరుగురిని సజీవ సమాధి చేసి ఇప్పటికే మహాపాపం మూటగట్టుకున్నారు.. నాలాల్లో బలిచేసిన ముగ్గురి మృతదేహాలను కూడా గుర్తించకపోతే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు అని కేటీఆర్ స్పష్టం చేశారు.