హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): మెట్రో రైలుకు కేటాయించిన 280 ఎకరాల భూములపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కన్నేశారని, వాటిని తన స్వప్రయోజనాలకు వాడుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆరోపించారు. ‘మెట్రోకు కేటాయించిన 280 ఎకరాల భూములపై రేవంత్‌రెడ్డి కన్నేశారు. వాటిని తన వ్యాపార ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలు, అనుయాయులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తారు. అమ్మకానికి పెడుతారు. రేవంత్ తెచ్చే ప్రతి సీమ్ వెనుక ఒక సామ్ ఉంటది’ అని నిప్పులు చెరిగారు. తెలంగాణభవన్‌లో బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడిన అనంతరం పలువురు పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ తనదైన శైలిలో సమాధాలు ఇచ్చారు.
హైదరాబాద్ మెట్రోకు సంబంధించిన వ్యవహారంలో ప్రైవేట్ సంస్థ నెత్తి మీద ఉన్న రూ.14 వేల కోట్ల అప్పును ప్రభుత్వం ఎందుకు తలకెత్తుకున్నదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మైండ్‌స్పేస్ నుంచి రాయదుర్గం వరకు 36 కిలోమీటర్ల విస్తరణకు తాము ముందుకెళ్తే నాడు కేంద్రం అడ్డు చెప్పలేదు కానీ, ఇప్పుడెందుకు చెప్తున్నదని నిలదీశారు. పాత ప్రాజెక్టును తీసుకొంటే కొత్త ప్రాజెక్టుకు అనుమతి ఇస్తామని బడే భాయ్ చెవిలో చెప్పారా? అని ప్రశ్నించారు. యూపీలో చిన్నచిన్న పట్టణాలకు మెట్రో ఇస్తున్న కేంద్రం.. నాడు లక్డీకాపూల్ నుంచి బీహెచ్ఈఎల్ వరకు తాము అడిగిన డిమాండ్‌ను తిరసరించిందని గుర్తుచేశారు. ఇంత ట్రాఫిక్ కష్టాలున్న హైదరాబాద్‌కు మెట్రో ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నది కేంద్ర ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. కేంద్రంలోని మోదీ, రా ష్ట్రంలోని రేవంత్ కలిసి మెట్రో విషయంలో డ్రామాడుతున్నారని మండిపడ్డారు.
హిట్లర్‌కు పట్టిన గతే
అహంకారంతో ఊగిపోతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి భవిష్యత్తులో బాహుబలి సినిమాలోని భల్లాళదేవుడికి, హిట్లర్‌కు పట్టిన గతే పడుతుందని కేటీఆర్ హెచ్చరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అల్లకల్లోలంగా ఉన్నా, ముఖ్యమంత్రి, మం త్రుల ఇండ్లు మాత్రం వికసిస్తున్నాయని విమర్శించారు. ‘ఉచిత విద్యుత్తు కాంగ్రెస్ పేటెంట్’ అని రేవంత్‌రెడ్డి అనడంపై కేటీఆర్ స్పందిస్తూ.. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉచిత కరెంట్ పేరిట ఉత్త కరెంటే ఇచ్చారని, 2 నుంచి 3 గంటలు మాత్రమే సరఫరా చేసేవారని గుర్తుచేశారు. దేశంలోనే వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చిన ఏకైక నాయకుడు కేసీఆర్ మాత్రమేనని స్పష్టంచేశారు. ‘తన తండ్రి చనిపోతే స్నానానికి నీళ్లు లేక, కరెంట్ రాక బోరు వేసుకొనే పరిస్థితి లేక నెత్తి మీద నీళ్లు చల్లుకున్నానని గతంలో రేవంత్‌రెడ్డే స్వయంగా చెప్పారు. కానీ, ఇప్పుడు మాట మారుస్తున్నారు. రే వంత్ ఏం మాట్లాడినా గతంలో దానికి విరుద్ధంగా మాట్లాడిన వీడియోలు దొరుకుతాయి. జులాయి సినిమాలో దొంగతనం చేస్తూ క్షణాల్లో దొరికిపోయే బ్రహ్మానందం పాత్ర లాంటిది ఆయన తీరు. ఐదు సెకన్లలో దొరికిపోవడం రేవంత్ ప్రత్యేకత’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
హైట్ గురించి మాట్లాడటం సిగ్గుచేటు
జగదీశ్‌రెడ్డి హైట్ గురించి రేవంత్‌రెడ్డి మాట్లాడటంపై కేటీఆర్ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ‘అసెంబ్లీలో, క్యాబినెట్ మీటింగ్‌ల్లో డబుల్ కుర్చీ వేసుకుని కూర్చునే సీఎం కూడా హైట్ గురించి మాట్లాడుతున్నారు. మనుషుల ఎత్తు అనేది వారు చేసే మంచి పనులను బట్టి ఉంటుంది. మంచి పనులు చేస్తే మేరుపర్వతంలా కనిపిస్తారు. ఫాల్తు పనులు చేస్తే గింతే కనిపిస్తారు’ అని మం డిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ వికసిస్తున్నదని రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్నా, సీఎం, మంత్రుల ఇండ్లు మాత్రం కళకళలాడుతున్నాయని ఆరోపించారు. గతం లో రూ.30 లక్షలకు ఎకరం ఉన్న పొలం నేడు రూ.20 లక్షలకు కూడా ఎవరూ కొ నడం లేదని, భూముల విలువ పెరిగిం దా? తగ్గిందా? అని ప్రశ్నించారు. ‘వ్యవసాయం సంక్షోభం లో ఉంటే వ్యవసాయ మంత్రి మాత్రం జోరుగా ఉన్నారు. ఆర్థిక పరిస్థితి దిగజారితే ఆర్థిక మంత్రి ఖమ్మం, మధిర, హైదరాబాద్‌లో మూడో ఇల్లు కట్టుకొంటున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రెండో ఇల్లు కట్టుకొని, ఫుట్‌బాల్ స్టేడియాలు నిర్మించుకున్నారు. ప్రజల కష్టాల కంటే వీళ్ల వ్యక్తిగత వికాసానికే ప్రాధాన్యం ఇస్తున్నారు’ అని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
రైతులను గాలికి వదిలేశారు
రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం వల్ల వ్యవసాయ రంగం ఇబ్బందుల్లో పడుతుంటే సీఎం రైతులకు ఎలాంటి సూచనలు చేయకుండా గాలికి వదిలేశారని కేటీఆర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రియల్ఎస్టేట్ మాత్రమే మొ దటి ప్రాధాన్యమని, అందుకే రైతు డిక్లరేషన్‌లో బడే భాయ్, చోటే భాయ్ కథ లు చెప్పారు తప్ప రైతులకు ఇచ్చింది ఏమీ లేదని దుయ్యబట్టారు. తాము ఏ నాడూ కక్షపూరిత రాజకీయాలు చేయలేదని, కానీ వచ్చే తమ ప్రభుత్వంలో తప్పు చేసిన వారిపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశా రు. కర్ణాటకలో ముగ్గురు ముఖ్యమంత్రుల సీక్రెట్ మీటింగ్ జరిగిందని, చంద్రబాబుకు గురుదక్షిణగా కృష్ణా, గోదావరి జలాలను రేవంత్‌రెడ్డి బడే భాయ్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్‌కు తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు.
దమ్ముంటే రామకృష్ణారావుపై చర్య తీసుకోండి
బీఆర్ఎస్ పాలనలో 11% వార్షిక వడ్డీకి అప్పులు తెస్తే, నేడు కాంగ్రెస్ సర్కార్ 7% వడ్డీకే అప్పులు తీసుకొస్తున్నదా? అని అడిగిన ప్రశ్నకు కేటీఆర్ వివరంగా సమాధానమిచ్చారు. తమ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో ఎనిమిదేండ్లపాటు రామకృష్ణారావే ఆర్థికశాఖ కార్యదర్శిగా పనిచేశారని గుర్తుచేశారు. ‘ఆయన అద్భుతంగా పనిచేస్తున్నారనే మీరు చీఫ్ సెక్రటరీగా పెట్టుకున్నారు. అప్పులు ఎవరు తెస్తరు? కేసీఆర్ వెళ్లి ఇంత వడ్డీ ఇస్తమని బేరమాడుతరా? అధికారులు వెళ్తరు. అప్పు తీసుకొస్తరు. ఇది మంచి ప్రతిపాదన అని క్యాబినెట్ ఎదుట పెడుతరు. మరింత మంచి ప్రతిపాదన తీసుకొనిరావాలని అధికారులకు సూచిస్తం. నిజంగా రామకృష్ణారావు తీసుకొన్న చర్య తప్పయితే నిన్నటివరకు చీఫ్ సెక్రటరీగా ఉన్న ఆయనపై చర్య తీసుకోండి… మరెక్కడో కొత్త లోన్ తెచ్చారు. పాత దానికి కట్టేయమంటే కట్టేశారు. దానివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రూ.174 కోట్లు నష్టం వాటిల్లింది. మాజీ సీఎస్ రామకృష్ణారావు నిర్ణయాన్ని తప్పుపడుతవ్, మళ్లీ ఆయననే సలహాదారుగా తీసుకుంటావ్. అర్థంపర్థం లేకుండా ఎలా మాట్లాడుతారు రేవంత్‌రెడ్డీ? అని కేటీఆర్ ప్రశ్నించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్నా, సీఎం, మంత్రుల ఇండ్లు మాత్రం కళకళలాడుతున్నాయి. కేవలం అనుముల బ్రదర్స్ వికాసం.. పొంగులూటి వికాసం.. మంత్రివర్గ సహచరుల వికాసం.. తప్ప రాష్ట్రం వికసించడం లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారితే ఆర్థిక మంత్రి ఖమ్మం, మధిర, హైదరాబాద్‌లో మూడో ఇల్లు కట్టుకొంటున్నరు. సీఎం రెండో ఇల్లు కట్టుకొని, ఫుట్‌బాల్ స్టేడియాలు నిర్మించుకున్నరు.
– కేటీఆర్