KTR | హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సృష్టించిన కుట్రలు కొట్టుకుపోయాయని, బురద రాజకీయాలు భూస్థాపితమయ్యాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దుయ్యబట్టారు. ‘ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరిలో కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోయి.. కాళేశ్వరం ప్రాజెక్టు సగర్వంగా నిలబడింది’ అంటూ కాంగ్రెస్ కుట్రలను ఎక్స్‌వేదికగా శనివారం ఎండగట్టారు. మానవ నిర్మిత అద్భుతంగా కేసీఆర్ సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిందని, అందుకు కేసీఆర్‌కు ఆయన సెల్యూట్ చేశారు. ‘పోటెత్తిన వరదకు దుష్టశక్తుల పన్నాగాలే పటాపంచలయ్యాయి కానీ, కేసీఆర్ సమున్నత సంకల్పం జై కొడుతున్నది.. జల హారతి పడుతున్నది..
లక్షల క్యూసెకుల గంగా ప్రవాహంలో లక్షకోట్లు వృథా చేశారనే విమర్శలే గల్లంతయ్యాయి కానీ, మేడిగడ్డ బరాజ్ మాత్రం మొకవోని దీక్షతో నిలబడింది. కొండంత బలాన్ని చాటిచెబుతున్నది.. ఎవరెన్ని కుతంత్రాలు చేసినా..దశాబ్దాలుగా దగాపడ్డ ఈ తెలంగాణ నేలకు ఇప్పటికీ ఎప్పటికీ మేడిగడ్డే మన రైతుల కష్టాలు తీర్చే ‘మేటి’గడ్డ ’ అని అభివర్ణించారు. కాళేశ్వరమే కరువును పారదోలే కల్పతరువు అని, బురద రాజకీయాలను భూస్థాపితం చేసిన మానవ నిర్మిత అద్భుతానికి, కేసీఆర్‌కు తెలంగాణ సమాజం పక్షాన సెల్యూట్ అంటూ కేటీఆర్ పేర్కొన్నారు.
అనారోగ్యంతో బాధపడ్తున్న నటుడు, దర్శకుడు ఆర్ నారాయణమూర్తిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్లో పరామర్శించారు.ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు త్వరగా కోలుకోవాలని, అన్ని విధాలా అండగా ఉంటామని భరోసానిచ్చారు.