హైదరాబాద్ జూలై 14 (నమస్తే తెలంగాణ) : ‘ఇందిరమ్మ రాజ్యమంటే ఏమో అనుకున్నం.. కానీ బిందె సేద్యం కూడా వస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఇందిరమ్మ పాలన ముసుగులో ఆడబిడ్డలకు ఎంతటి దుస్థితి తెచ్చినవ్ రేవంత్?’ అంటూ ముఖ్యమంత్రిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు. ‘కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం దేవుడెరుగు.. తాగునీటితో పాటు సాగునీటికి కూడా బిందెలు మోస్తున్న ఆడబిడ్డల బాధలు తీర్చే సోయి ఈ సర్కారుకు ఎప్పుడొస్తుందో’ అని సోమవారం ఎక్స్ వేదికగా ఎద్దేవా చేశారు.
రంగధామునిపల్లిలో కనీసం ట్రాన్స్ఫార్మర్ను కూడా రిపేర్ చేయించడం చేతగాదా?’ అని ప్రశ్నించారు. ‘సాగునీటి వసతి కల్పించకుండా ఇప్పటికే చేతులెత్తేసిన నువ్వు..కనీసం కరెంట్ మోటర్లతో పంటను కాపాడుకుందామంటే ఇన్ని ఇక్కట్లా? నారు మడి ఎండిపోతుంటే బిందెలతో నీళ్లు తెచ్చి పోస్తూ మహిళలు పడుతున్న కష్టం మీకు కనిపించడంలేదా?.. ఆడబిడ్డలు ఇప్పటికే తాగునీటి కోసం తండ్లాడుతుంటే ఈ కొత్త కష్టాలేంటి?’ అంటూ నిలదీశారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన చర్యలతో పెరిగిన భూగర్భ జలాలను వాడుకొనే అవకాశం కూడా లేకుండా చేయడం దుర్మార్గం కాకుంటే మరేమిటని మండిపడ్డారు.
‘రాష్ట్రంలో రైతులను కాటేస్తున్నది కరువు, కాలం కాదు.. ముమ్మాటికీ కాంగ్రెస్సే’ అని కేటీఆర్ ధ్వజమెత్తారు. మేడిగడ్డపై కక్షగట్టి కాళేశ్వరం నీళ్లను ఎత్తిపోయడంలో నిర్లక్ష్యం మూ లంగా కాలువల్లో నీళ్లకు బదులు రైతుల కన్నీళ్లు పారుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. అద్దాల మేడలో ఊరేగుతూ అబద్ధాల కాంగ్రెస్ పాలన మూలంగా రైతాంగం అంధకారంలో మునిగి ఆందోళనకు గురవుతున్నదని వాపోయారు. ఆరు దశాబ్దాల సమైక్య పాలనలో దండుగైన వ్యవసాయాన్ని పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో పండుగ చేశామని గుర్తుచేశారు. కానీ అబద్ధాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ఏడాదిన్నరలోనే వ్యవసాయాన్ని తిరిగి దండుగ చేసిందని ధ్వజమెత్తారు. కేసీఆర్ హయాంలో వచ్చిన కాళేశ్వర ధార కాంగ్రెస్ పాలనలో ఎందుకు రావడం లేదని రైతులు ప్రశ్నిస్తుంటే కాంగ్రెస్ నేతలు నీళ్లు నములుతున్నారని విమర్శించారు.
నాడు సుమారు 600 మీటర్ల ఎత్తుకు ఎగిసి, 450 కిలోమీటర్లు ప్రయాణించి సూర్యాపేట జిల్లాలోని పెన్‌పహాడ్ మండలం రావి చెరువును చేరి రైతుల పొలాలను తడిపిన జలాలు ఇప్పుడేందుకు రావడంలేదని రైతులు అడుగుతున్నారని దుయ్యబట్టారు. మరోవైపు ఎస్సారెస్పీ ఆయకట్టు కింద 2001లో పూర్తయిన కాకతీయ వరద కాలువ కాళేశ్వరం ఎత్తిపోతల మూలంగా 22 ఏండ్ల తర్వాత 153 కిలోమీటర్ల మేర ప్రయాణించి చివరి ఆయకట్టును కూడా తడిపిందని గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డకు మరమ్మతులు చేయకుండా కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీళ్లు ఎత్తిపోయకుండా ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తూ మోటర్ల వైపు కన్నెత్తి చూడటం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. వ్యవసాయంపై కక్షగట్టి రైతులకు రేవంత్ సర్కారు శిక్షిస్తున్నదని మండిపడ్డారు. ఏదేమైనా కాంగ్రెస్ కుట్రలను ఛేదించి నిరంతరం పోరాటాలతో అన్నదాతలను కాపాడుకుంటామని తేల్చిచెప్పారు.
రేవంత్‌రెడ్డీ..ఆడబిడ్డలకు బిందెలతో నీళ్లు తెచ్చుకొని వరి నారును కాపాడుకొనే పరిస్థితి కల్పిస్తవా? మేడిగడ్డ రెండు పిల్లర్లనే కాదు జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రంగధామునిపల్లిలో 15 రోజుల క్రితం చెడిపోయిన ట్రాన్స్ఫార్మర్ను కూడా రిపేర్ చేయించడం చేతగాదా? కండ్లముందే పచ్చని వరి నారు ఎండిపోతుంటే తట్టుకోలేక బిందెలతో నీళ్లు తెచ్చి పోస్తూ ఆడబిడ్డలు పడుతున్న అగచాట్లు మీకు కనిపించడంలేదా?
-కేటీఆర్
కాంగ్రెస్ సర్కారు వైఫల్యంతోనే గురుకుల విద్యార్థుల బలవన్మరణాలు కొనసాగుతున్నాయని కేటీఆర్ విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తుప్రాన్‌పేట జ్యోతిబాఫూలే హాస్టల్లో ఐదో తరగతి విద్యార్థి ఆత్మహత్యకు కాంగ్రెస్ సర్కారే కారణమని మండిపడ్డారు. పురుగుల అన్నం తినలేక, కనీస వసతులు లేని హాస్టళ్లలో ఉండలేక విద్యార్థులు ప్రాణాలు తీసుకోవడం పాలనా దుస్థితికి అద్దంపడుతున్నదని నిప్పులు చెరిగారు. ఇప్పటికే 90 మంది పిల్లలు మరణించినా ముఖ్యమంత్రికి సోయి రాకపోవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికైనా రేవంత్‌రెడ్డి గురుకుల పిల్లల మరణాలను ఆపేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే వారి తల్లిదండ్రుల శాపనార్థాలు తగిలి ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమని హెచ్చరించారు.