సిద్దిపేట: సిద్దిపేట (Siddipet) ఎమ్మెల్యే హరీశ్‌రావు క్యాంప్ ఆఫీస్‌పై కాంగ్రెస్ గూండాల దాడికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. సిద్దిపేట పట్టణంలో నల్ల కండువాలు కప్పుకుని నల్ల జెండాలతో ర్యాలీ నిర్వహించారు. భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీగా క్యాంప్ ఆఫీస్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో హరీశ్‌రావు రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను చించివేశారు.
ఈ నేపథ్యంలో సిద్దిపేట పట్టణంలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. మరోవైపు హరీశ్ రావుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు క్యాంప్ ఆఫీస్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. కాగా, ఇరుపక్షాల పోటాపోటీ ప్రదర్శణలతో సిద్దిపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.