హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటనతో కాంగ్రెస్-బీజేపీ చీకటి ఒప్పందం బహిర్గతమైందని, బడేభాయ్-చోటాభాయ్ రహస్య బంధం బయటపడిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. ప్రధాని ఆదిలాబాద్ పర్యటన బీజేపీ-కాంగ్రెస్ అలయ్-బలయ్లా సాగిందని విమర్శించారు. ఎంపీ పసునూరి దయాకర్‌తో కలిసి సోమవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీని రేవంత్‌రెడ్డి పెద్దన్నగా సంబోధించడం ద్వారా ఇన్నాళ్ల కాంగ్రెస్-బీజేపీ బంధం బయటపడిందని పేర్కొన్నారు. గతంలో బీఆర్ఎస్ పంపిన ఎమ్మెల్సీ పేర్లను తిరస్కరించిన గవర్నర్.. కాంగ్రెస్ పంపగానే ఆమోదించారని, ఎఫ్ఆర్ఎంబీ రుణం విషయంలో ప్రధాని మోదీ కూడా ఇలాగే వ్యవహరించారని దుయ్యబట్టారు. రెండు పార్టీల మధ్య ఉన్న చీకటి ఒప్పందానికి ఇంతకుమించిన ఉదాహరణ ఇంకేం కావాలని ప్రశ్నించారు. తెలంగాణకు మోదీ ఒక్క పైసా ఇవ్వకున్నా రేవంత్ ఏమీ అనరని, కానీ కేసీఆర్‌పై మాత్రం ఒంటికాలితో లేస్తున్నారని మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలో బీజేపీకి, దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్‌కు సహకరించాలన్న పరస్పర ఒప్పందం ఇరుపార్టీల మధ్య జరిగిందని ఆరోపించారు. గత ఎన్నికల్లో నిజామాబాద్, కరీంనగర్.. హుజూరాబాద్, మునుగోడులోనూ ఇదే జరిగిందని పేర్కొన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక స్థానాలను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
ప్రధాని మోదీ, అదానీ, బీజేపీపై రాహుల్ ఆరోపణలు చేస్తుంటారని, రేవంత్‌రెడ్డి మాత్రం వారితో దోస్తానా చేస్తారని పల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్‌ను రాహుల్ విఫల మోడల్‌గా పేర్కొంటే రాహుల్ మాత్రం దానినే తెలంగాణ అమలు చేస్తామని అంటున్నారని ఎద్దేవా చేశారు. రాహుల్ నో అంటే రేవంత్ ఎస్ అంటున్నారని విమర్శించారు. కాళేశ్వరంలో అవినీతి జరగలేదని పార్లమెంటులోనే చెప్పిన కేంద్రం ఇప్పుడు మాత్రం అవినీతి జరిగిందని అంటున్నదని ఆగ్ర హం వ్యక్తం చేశారు. పార్లమెంటు ఎన్నికల బరిలో నిలిపేందుకు కాంగ్రెస్, బీజేపీకి అభ్యర్థులు లేకపోవడంతో తమ ఎంపీలు, నాయకులను బతిమలాడి, ప్రలోభపెట్టి వారి పార్టీలోకి తీసుకుంటున్నారని పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు.