హైదరాబాద్, మే 15 (నమస్తేతెలంగాణ): ‘బండి భగీరథ్‌ను అరెస్ట్ చేయాలి.. బాధితురాలికి న్యాయం చేయాలి’ అన్న నినాదాలు నింగినంటాయి. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా మహిళాలోకం కదంతొక్కింది. పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్‌ను పోలీసులు అరెస్టు చేయకపోవడంపై కన్నెర్ర జేసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన మహిళలు బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల భారీ అం బేద్కర్ విగ్రహం వద్ద ఆందోళనకు దిగింది. మండుటెండను సైతం లెక్కచేయకుండా బాధితురాలి పక్షాన అక్కడే బైఠాయించింది. పేట్ బషీరాబాద్ ఠాణాలో నమోదైన పోక్సో కేసుపై రేవంత్ ప్రభుత్వం, పోలీసుల నిర్లక్ష్య వైఖరిని ముక్తకంఠంతో ఖండించింది. నల్లటి దుస్తులు ధరించి, ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున మహిళలు ఈ నిరసనలో పాల్గొన్నారు. ‘రేవంత్‌రెడ్డి డౌన్ డౌన్, ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం, సామాన్యుడికి ఒక చట్టం.. పలుకుబడి కలిగివారికి మరో చట్టమా? అంటూ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. బాధితురాలికి న్యాయం జరిగేదాకా ఉద్యమాన్ని ఆపేదిలేదంటూ మహిళలు ప్రతినబూనారు. అవసరమైతే ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రుల ఇండ్లను ముట్టడించేందుకు సైతం వెనుకాడబోమని హెచ్చరించారు.
పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని, బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని బీఆర్ఎస్ మహిళా నేతలు డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్ భారీ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన సందర్భంగా గొంగిడి సునీత, తుల ఉమ, రజినీ సాయిచంద్, సుమిత్రా ఆనంద్, ఆయేషా షకీల్, చారులత మీడియాతో మాట్లాడారు. నిందితుడి దుర్మార్గానికి ఓ బాలిక జీవితం బలైపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. బాధితురాలిని రక్షించి నిందితుడిని శిక్షించాల్సిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేదాకా బీఆర్ఎస్ పోరాటం ఆపబోదని, అవసరమైతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
భారీ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనకు దిగిన మహిళలపై పోలీసులు జులుం ప్రదర్శించారు. తరలివస్తున్న ఆందోళనకారులను ఎక్కడికక్కడే నిర్బంధించారు. విగ్రహ ప్రాంగణానికి చేరుకోకుండా గేటుకు తాళం వేసి అడ్డుకున్నారు. ఇదేనా ప్రజాపాలనా? అని ప్రశ్నించిన వారిపై బెదిరింపులకు దిగారు. బైఠాయించిన వారిని ఈడ్చిపడేశారు. బలవంతంగా పోలీస్ వాహనాల్లో ఎక్కించి నాంపల్లి, సైఫాబాద్, అఫ్జల్‌గంజ్ పోలీస్స్టేషన్లకు తరలించారు. మాజీ విప్ గొంగిడి సునీత, బీఆర్ఎస్ మహిళా మాజీ అధ్యక్షురాలు తుల ఉమ, కార్పొరేషన్ మాజీ చైర్మన్ రజినీసాయిచంద్, టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రా ఆనంద్, అధికార భాషా సంఘం మాజీ చైర్పర్సన్ మంత్రి శ్రీదేవి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో తాజా మాజీ కార్పొరేటర్లు దేదీప్యారెడ్డి, హేమ, రాసూరి సునీత, మమత, రేణుక మహిళా నేతలు చారులత, ఆయేషా షకీల్, రజితారెడ్డి, విజితారెడ్డి, గంటల రేణుక, అద్వైత ప్రకాశ్, ఉమ, నాగమణి, ప్రమీల, మంజుల, కవిత, శాంతినాయక్, అరుణ తదితరులు పాల్గొన్నారు.