జనగామ చౌరస్తా, అక్టోబర్ 9 : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య ధీమా వ్యక్తంచేశారు. గురువారం జనగామలోని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 22 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్నదని తెలిపారు. ఇది ప్రజల్లో వస్తున్న మా ర్పును చూసి వాస్తవాలకు అనుగుణంగా చెబుతున్న మాటే కానీ రాజకీయ దురుద్దేశంతో అంటున్నది కాదని స్పష్టం చేశారు. వచ్చే ఏ ఎన్నికల్లోనైనా ప్రజలు బీఆర్ఎస్కే బ్రహ్మరథం పడతారని చెప్పా రు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, దివంగత ఎమ్మె ల్యే మాగంటి గోపినాథ్‌పై ఉన్న సానుభూతి, గత బీఆర్ఎస్ అభివృద్ధి అంశాలు కలిసి జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ను గెలిపిస్తాయని పొన్నాల పేర్కొన్నారు.
తాను పార్టీ మారుతున్నట్టు కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, అధికారం కోసం, ప్రతిష్ఠ కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. బీఆర్ఎస్లో చేరినప్పుడు తాను ఎ లాంటి షరతులు విధించలేదని చెప్పారు. పొన్నాల ఎప్పటికీ పులేనని అవసరమైనప్పుడే గర్జిస్తానని ఘాటుగా స్పందించారు.