KTR | ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే బీఆర్ఎస్ భారీ విజయం సాధించడం ఖాయమని కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలో దీక్షాదివస్ సన్నాహక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రేవంత్ రెడ్డి సీఎం పదవి తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటిదేననని.. ఢిల్లీవాళ్లకు కోపం వస్తే ఆయన పదవి ఊడుతదన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని.. కానీ నాలుగేళ్లు వేచి చూడాల్సిందేనన్నారు. సిరిసిల్లలో ప్రజలు ఛీ కొట్టిన సరే అధికారులను అడ్డం పెట్టుకొని ఎగురుతున్న కాంగ్రెస్ సన్నాసులను గుర్తుపెట్టుకుంటామన్నారు. మొన్న సీఎం వేములవాడకు వచ్చాడని.. నాలుగు మంచి మాటలు చెబుతాడనుకున్నానన్నారు. బాలల దినోత్సవమైనా, రాజీవ్ సద్భావన యాత్ర అయినా, ఆయన పుట్టిన రోజు అయినా.. వేములవాడలో మీటింగ్ అయినా సరే కేసీఆర్‌ను తిట్టటమే పని అని.. దేవుళ్ల మీద ఒట్లు, హామీలకు తూట్లు, కేసీఆర్‌పై తిట్లు ఇవి తప్ప నువ్వేం పీకినవ్ అంటూ మండిపడ్డారు. ప్రజల దగ్గరకు పోతే జనాలను సీఎంను ఛీ కొట్టే పరిస్థితి ఉందన్నారు. కొడంగల్‌లో రైతులకు దగ్గరకు వెళ్లలేని పరిస్థితి రేవంత్‌ది అంటూ విమర్శించారు.
నేరెళ్లలో ఒక సంఘటన జరిగిందని.. బాధితులకు న్యాయం చేసేందుకు తాను ప్రయత్నం చేశానన్నారు. వాళ్లను కలిశానని.. వీలైనంత వరకు సాయం చేశానన్నారు. మీరు రాజకీయం చేసే ప్రయత్నం చేశారని.. నెరేళ్ల ప్రజలంతా మొన్నటి ఎన్నికల్లో మాకే అత్యధిక ఓట్లు వేశారన్నారు. ప్రజాస్వామ్యంలో పాలకులు అంటే ప్రజలతో తిట్లు తిన్నా సరే వారి మనసు గెలుచుకునే ప్రయత్నం చేయాలంటూ చురకలంటించారు. కొడంగల్‌లో రైతులు ఏం అడిగారు.. తమ భూములకు ఎక్కువ డబ్బులు ఇవ్వాలని కోరారన్నారు. తొమ్మిది నెలలుగా నిరసన చేస్తున్నారని.. ధర్నాలు చేస్తున్నారన్నారు. అయినా వాళ్లకు సీఎం సమయం ఇవ్వలేదన్నారు. సీఎం తమ్ముడు, మంత్రులు ఎవ్వరూ వాళ్లు బతిమాలినా పట్టించుకోలేదన్నారు. ఆఖరికి కలెక్టర్ ప్రజాభిప్రాయ సేకరణకు వెళితే నిరసన తెలిపారని.. అదే రేవంత్ రెడ్డి పోయి ఉంటే ఉరికించి.. ఉరికించి కొట్టేవారన్నారు. సీఎం కేవలం అదానీ, తన అన్న, అల్లుడు, బావమరిదికి అమృతం పంచేందుకు మాత్రమే పని చేస్తున్నాడని.. ప్రజల కోసం ఏమీ చేయలేదంటూ మండిపడ్డారు. 28 సార్లు ఢిల్లీకి పోయిండని.. ఫ్లైట్ ఛార్జీలు వృథా తప్ప 28 రూపాయలు కూడా తీసుకురాలేదనన్నారు. ఎనిమిది 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారని.. వారంతా 8 రూపాయల నిధులు లేదన్నారు. ప్రజలందరూ కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న పనులను గమనిస్తున్నారన్నారు.
హైదరాబాద్‌లో ఓ ఆటో డ్రైవర్‌తో మాట్లాడితే ఈ ప్రభుత్వం పోయేందుకు ఏదైనా ఉపాయం లేదా అడుగుతున్నాడన్నారు. ఒకసారి ఓటు వేస్తే ఐదేళ్లు శిక్ష పడాల్నా అంటున్నాడని.. తప్పదు మరో నాలుగేళ్లు వీళ్లు పీక్క తింటూనే ఉంటారన్నారు. ఈ ముఖ్యమంత్రికి కనీస అవగాహన, పరిజ్ఞానం కూడా లేదన్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా సిరిసిల్లలో నేతన్నలు ఉన్నారని.. మరి ఇక్కడ పెట్టాల్సిన నూలు డిపోను తీసుకొని పోయి వేములవాడలో పెట్టిండంటూ ప్రశ్నించారు. గుండుకు దెబ్బ తాకితే మోకాలి మందు పెట్టినట్లుగా ఉందన్నారు. ఇంతా తెలివైన వాళ్లు ఉండటం మన అదృష్టమన్నారు. ఏడాది పాలనలో ముఖ్యమంత్రిని ప్రజలు ఇన్ని తిట్లు తిట్టటం నేను ఎప్పుడు చూడలేదన్నారు. మీడియా, యూట్యూబ్ వాళ్లు మైక్ పెడితే చాలు ఏమాత్రం సంకోచించకుండా రేవంత్ రెడ్డిని పొట్టు పొట్టు తిడుతున్నారన్నారు. ఆ తిట్లు విన్నాక రేషం ఉన్నోడైతే బిల్డింగ్ మీది నుంచి దూకి చస్తాడన్నారు. కానీ, రేవంత్ రెడ్డి కాబట్టి నడిచిపోతోందన్నారు. ఏడాదిలోపే ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత ఊహించలేదన్నారు. మనం పిలుపునిస్తే ఈ ప్రభుత్వానికి ప్రజలే సంవత్సరీకం పెట్టే పరిస్థితి ఉందన్నారు. అమ్మ విలువ, అన్నం విలువ లేనప్పుడే మనకు తెలుస్తుందన్నారు. అదే విధంగా ఇప్పుడు గ్రామ గ్రామాన కేసీఆర్ గురించే మాట్లాడుతున్నారు. హైదరాబాద్‌లో నాచారంలోని చెప్పుల దుకాణం, హుజుర్నగర్లో నాయీ బ్రహ్మణుడి షాప్‌ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొలగిస్తుంటే వాళ్లు కేసీఆర్ ఎక్కడ ఉన్నావంటూ గుర్తు చేసుకుంటున్నారన్నారు. ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా? కాంగ్రెస్ ను ఎప్పుడు పాతర పెడదామా? అని ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు.
2001 నుంచి ఇక్కడ జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండానే ఎగిరిందని.. మళ్లీ బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు. ప్రజల్లో కేసీఆర్ పట్ల ఎనలేని వాత్సల్యం, ప్రేమ ఉందన్నారు. దాన్ని ఎలా అనుకూలంగా మలుచుకోవాలన్నదే మనం చేయాల్సిన పనన్నారు. మనుషులుగా మనం కూడా తప్పులు, పొరపాట్లు చేసి ఉండవచ్చని.. వాటి నుంచి ఏం నేర్చుకున్నామన్నదే ముఖ్యన్నారు. ఆనాడు ‘కేసీఆర్ సచ్చుడో…తెలంగాణ తెచ్చుడో’ అని కేసీఆర్ ఏ విధంగా తెలంగాణ తెచ్చారో గుర్తు చేసుకోవాలని సూచించారు. కేసీఆర్ స్ఫూర్తితో కాంగ్రెస్, బీజేపీకి వ్యతిరేకంగా మహా సంకల్ప దీక్ష చేయాల్సి ఉందన్నారు. తెలంగాణ తెచ్చిన దానికన్నా కేసీఆర్‌కు వచ్చే పెద్ద పేరు ఇంకేమీ లేదన్నారు. తెలంగాణ ఆడబిడ్డలు, తెలంగాణ రైతులు, నేతన్నలు, వృద్ధులు, తెలంగాణ ప్రజానీకానికి మేలు జరగాలంటే కేసీఆర్ కావాలన్నారు. విడిపోతే.. చెడిపోతాం అంటూ మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లో ఒక నినాదం బాగా పాపులర్ అయ్యిందని.. మనం కూడా ఎన్నికలు వస్తే విడిపోకుండా జాగ్రత్త పడాలని.. లేకపోతే అన్యాయం జరుగుతుందన్నారు.
తెలంగాణ మీద గులాబీ జెండాకు ఉన్న ప్రేమ ఢిల్లీ పార్టీలకు ఉండదని.. కేసీఆర్ మాత్రమే తెలంగాణ మట్టి మనిషి అవుతాడని.. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఢిల్లీ మనుషులేనన్నారు. మన నాయకుడి పోరాటం, తెలంగాణ విద్యార్థుల బలిదానాన్ని దీక్షా దివస్ సందర్భంగా మరోసారి గుర్తు చేసుకోవాల్సి ఉందన్నారు. ఆనాడు తెలంగాణ ఇయ్యాక తప్పని పరిస్థితిని తీసుకొచ్చింది కేసీఆర్ అని.. నవంబర్ 29, 2009 నాడు కేసీఆర్ అనే బక్క మనిషి, ఉక్కు సంకల్పంతో చేపట్టిన దీక్ష కారణంగానే తెలంగాణ సాధ్యమైందని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటైన జూన్ 2వ తేదీ ఎంత ముఖ్యమో.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కీలక మలుపు అయిన దీక్షా దివస్ నవంబర్ 29 అంతే ముఖ్యమన్నారు. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 వ తేదీ వరకు పదకొండు రోజులు జరిగిన దీక్ష కారణంగా అనివార్యంగా తెలంగాణ ఇవ్వాల్సి వచ్చిందన్నారు. ఏ రోజైతే తెలంగాణ ప్రకటన వచ్చిందో అదే డిసెంబర్ 9వ తేదీని విజయ దివస్‌గా జరుపుకుందామన్నారు.