దుబ్బాక, అక్టోబర్ 7: కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాలతో భారత్ కష్టాల్లోకి వెళ్లిందని, ప్రజల సంక్షేమం, శ్రేయస్సు కోరి దేశ పౌరుడిగా తనవంతు బాధ్యతను నిర్వర్తించాలని సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ను (బీఆర్ఎస్) జాతీయ పార్టీగా మార్చారని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు. 15 రోజుల్లో ఎన్నికల కమిషన్ ఆమోదముద్ర వేయగానే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారనున్నదని తెలిపారు.
శుక్రవారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మున్సిపల్ షాపింగ్ కాంప్ల్లెక్స్ భవనాలు, మిరుదొడ్డి, చేగుంట మండలాల్లో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో పాల్గొన్నారు. అనంతరం దుబ్బాక పట్టణంలో దుబ్బాక ఆత్మ కమిటీ, తొగుట, దౌల్తాబాద్ మండలాల వ్యవసాయ మార్కెట్ కమిటీల నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలనే కేంద్రంలోని బీజేపీ సర్కారు కాపీ కొట్టి, పేరు మార్చుకొన్నదని తెలిపారు. రైతుబంధును కిసాన్ సమ్మాన్గా, మిషన్ కాకతీయను అమృత్ సరోవర్‌గా, మిషన్ భగీరథను హర్ ఘర్ జల్, మూగజీవాలకు వైద్యం అందించే 1962 పథకాన్ని పేరు మార్చుకొని అమలుచేయడం విడ్డూరంగా ఉన్నదన్నారు. తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలను మెచ్చి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇస్తూ, మరోపక్క గల్లీలో విమర్శించడం బీజేపీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. వ్యవసాయ బోరుబావులకు కరెంట్ మీటర్లు పెట్టనందుకు తెలంగాణకు ఏటా రూ.6 వేల కోట్ల చొప్పున రెండేండ్లలో రావాల్సిన రూ.12 వేల కోట్లను కేంద్రం నిలిపివేసిందని చెప్పారు. బీజేపీ పాలనలో జై జవాన్-జై కిసాన్ నినాదానికి విలువ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తంచేశారు.
కాలంతో పనిలేదు..
ఒకప్పుడు తెలంగాణలో మొగులుకు మొఖం పెట్టి చూసేవారమని, కాలం ఎట్లుంటదోనని పంచాంగ శ్రవణం వినేవారమని మంత్రి హరీశ్‌రావు గుర్తుచేశారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ దయతో కాలం అయినా, కాకున్నా రైతులు ఏటా రెండు పంటలు సంతోషంగా పడించుకొంటున్నారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తాగు, సాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమైందని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై గ్రామాల్లో నిరంతరం చర్చ జరపాలని, ప్రజలకు మరింతగా అవగాహన కల్పించాలని ప్రజాప్రతినిధులకు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ వనితాభూంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దేశానికే తెలంగాణ స్ఫూర్తిగా నిలిచిందని హరీశ్‌రావు తెలిపారు. దేశంలో తెలంగాణలో మినహా ఏ రాష్ట్రంలో కూడా రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వడం లేదన్నారు. రైతుబంధు కింద ఇప్పటివరకు రాష్ట్రంలో 65 లక్షల మందికి రూ.57,880 కోట్లు అందజేసినట్టు వివరించారు. రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రైతుబీమా పథకం ద్వారా రూ.5 లక్షల సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ది అని, ఇప్పటివరకు రాష్ట్రంలో 87 వేల మంది రైతు కుటుంబాలకు రూ.4,333 కోట్లు రైతుబీమా కింద అందజేసినట్టు వెల్లడించారు. బీడీ కార్మికులకు తెలంగాణలో మాత్రమే రూ.2 వేల పింఛన్ అందిస్తున్నామన్నారు. రాష్ర్టాలకు వాటా ప్రకారం రావాల్సిన నిధుల్లో కేంద్రం కోతలు పెడుతున్నదని, అయినా సీఎం కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని కొనియాడారు.