KTR | ప్రశ్నించే విద్యార్థులపై కేసులు పెట్టే కాంగ్రెస్ పార్టీ పోలీస్ రాజకీయం చెల్లదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. విద్యారంగ సమస్యలపై ప్రశ్నిస్తే విద్యార్థి నేతలపై అక్రమ కేసులను నమోదు చేయడం దారుణమని విమర్శించారు. భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ నివాసంలో విద్యార్థి విభాగం నాయకులతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా.. రాష్ట్రంలో విద్యావ్యవస్థ సంక్షోభానికి చేరిన పరిస్థితిపై కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల కోసం పోరాటం చేస్తున్న ప్రతి ఒక్క విద్యార్థి విభాగం కార్యకర్తకు మొత్తం పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు.
“తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు అద్భుతమైన పాత్ర పోషించారు. ఇప్పుడు ప్రభుత్వం ప్రజా సమస్యలపై విద్యార్థులు పోరాటం చేస్తే, వారిపై అక్రమ కేసులు బనాయించడం దారుణం. ఇది ప్రశ్నించే గొంతుకలను అణిచివేసేందుకు కాంగ్రెస్ చేస్తున్న పోలీస్ రాజకీయం చెల్లదు” అని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరికీ వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను రాజకీయ ఆయుధంగా వాడుతున్నదని అన్నారు. “విద్యావ్యవస్థను పూర్తిగా భ్రష్టుపట్టించిన రాష్ట్ర ప్రభుత్వం, దాన్ని ప్రశ్నిస్తున్న విద్యార్థులపై అడ్డగోలుగా కేసులు నమోదు చేస్తోంది. సోషల్ మీడియాలో నల్లబ్యాడ్జీకి రీట్వీట్ చేసినా కేసు, మీడియా సంస్థల ముందు శాంతియుతంగా నిరసన తెలపడానికి వెళ్ళినా అక్రమ కేసులు. అంతేకాకుండా గెల్లు శ్రీనివాస్ గారి భార్య గెల్లు శ్వేత ఇంటిలో ఉన్నప్పటికీ కేసు పెట్టి పోలీస్ స్టేషన్‌కు పిలవడం రాష్ట్రంలో నెలకొన్న రాచరిక పరిస్థితులకు నిదర్శనం” అని విమర్శించారు. రేవంత్ రెడ్డి పాలనలో పోలీసులు బడుగు, బలహీన వర్గాలపై కేసులు మోపుతున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. రాజ్యాంగాన్ని పట్టుకుని తిరిగే రాహుల్ గాంధీ తెలంగాణలో కొనసాగుతున్న అణిచివేత పాలనపై ఎందుకు నోరు మెదపడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు.
“రాష్ట్ర ప్రభుత్వం 20 నెలల్లోనే విద్యారంగాన్ని పతన స్థితికి నెట్టింది. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతోంది. విద్యార్థుల హక్కుల కోసం పోరాడే ప్రతి BRSV కార్యకర్తకు పార్టీ అండగా నిలుస్తుంది,” అని భరోసా ఇచ్చారు. విద్యార్థి నాయకులకు ఏ కష్టం వచ్చినా బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందన్నారు. గాయపడిన విద్యార్థి నాయకుడు, మెదక్ జిల్లా కోఆర్డినేటర్ నర్సింగ్‌తో కేటీఆర్ స్వయంగా ఫోన్లో మాట్లాడారు. మెరుగైన చికిత్స అందేలా నేతలకు ఆదేశించారు. విద్యారంగ సమస్యలపై పోరాడే ప్రతి ఒక్క విద్యార్థి విభాగం కార్యకర్తకు మొత్తం పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.
ఈ సమావేశంలో వివిధ యూనివర్సిటీల నుంచి వచ్చిన విద్యార్థులతో కేటీఆర్ ముచ్చటించారు. విద్యార్థి విభాగం నేతలు మాట్లాడుతూ, “కేటీఆర్ గారు స్వయంగా వచ్చి మాతో కలిసినందుకు ధన్యవాదాలు” తెలిపారు. “ఆయన నాయకత్వంలో BRSV మరిన్ని విద్యార్థి ఉద్యమాలను, కార్యక్రమాలను చేపడుతుందని” తెలిపారు.