హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ) : పుష్కర తెలంగాణ.. నేడు ముష్కరుల పాలైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. దేశమంతా వదిలించుకున్న దరిద్రపు కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు, విష ప్రచారాలతో ఇక్కడ అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. 30 నెలల్లో తెలంగాణను కాంగ్రెస్ అన్ని రంగాల్లో కుప్ప కూల్చిందని, కాంగ్రెస్ పాలనలో మోసపోని వర్గం అంటూ ఏదీలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘గెలుపుతో పొంగిపోయేది లేదు.. ఓడితే కుంగిపోయేది లేదు’ అన్న కేసీఆర్ మాటలను స్ఫూర్తిగా తీసుకొని ముందుసాగుదాం’ అని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ ఏనాడైనా ఒంటరిగానే పోటీ చేసిందనీ, ఒంటరిగానే గెలిచిందనీ, 2028లోనూ విజయం సాధిస్తుందని, కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణభవన్‌లో మంగళవారం నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబురాల్లో కేటీఆర్ ముందుగా తెలంగాణతల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ‘ఎత్తుకోయే చెల్లెలా’..‘రావయ్య మా పెద్ద సారూ’ పాటలను ఆవిష్కరించారు. అనంతరం గత ప్రభుత్వంపై, కేసీఆర్‌పై కాంగ్రెస్ నేతలు చిల్లర ప్రచారాలు చేశారని, అబద్ధాలు, అభూత కల్పనలు, విషప్రచారాలతో తెలంగాణ రాజకీయాలను కలుషితం చేశారని విమర్శించారు. అవే అబద్ధాలను డిక్లరేషన్ల రూపంలో, 420 హామీల రూపంలో చెప్పి గద్దెనెక్కారని దుయ్యబట్టారు.
తెలంగాణలోని నెత్తురుపారిన నెలల్లో.. నీళ్లు పారించి బంగారు పంటలు పండించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని కేటీఆర్ కొనియాడారు. అన్నమో రామచంద్ర అన్న తెలంగాణను అన్నపూర్ణగా మార్చారని, పంజాబ్, హర్యానాను వెనక్కి నెట్టి ధాన్యం ఉత్పత్తిలో రాష్ర్టాన్ని అగ్రభాగాన నిలిపారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన నినాదమైన నీళ్లు, నిధులు, నియామకాలు లక్ష్యంగా కేసీఆర్ పాలన సాగిందని గుర్తుచేశారు. సబ్బండ వర్ణాల సంక్షేమం, అభివృద్ధి జోడెడ్లుగా పదేండ్లు పాలించారని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు తెచ్చిన మహా నాయకుడు కేసీఆర్ అని గుర్తుచేశారు. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అని ప్రాణాన్ని పణంగాపెట్టి రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్‌ను కుకమూతి పిందెలు, అర్భకులు కుర్చీలో కూర్చొని అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ విష ప్రచారాలతోనే బీఆర్ఎస్ స్వల్ప తేడాతో ఓటమి పాలైందని, ‘గెలుపుతో పొంగిపోయేది లేదు, ఓడితే కుంగిపోయేది లేదు’ అన్న కేసీఆర్ మాటలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకుసాగాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తెలంగాణను 25 ఏండ్ల్లు వెనకి నెట్టిందని, వడ్డించిన విస్తరిలాంటి రాష్ర్టాన్ని రేవంత్‌రెడ్డి కుకలు చింపిన విస్తరిలా చేస్తున్నాడని విమర్శించారు.

ఐదేండ్లలో సగం సమయం గడిచినా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని, 30 నెలల్లో తెలంగాణను అన్ని రంగాల్లో కుప్పకూల్చిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో మోసపోని వర్గమంటూ ఏదీ లేదని, సంతోషంగా సాగిన వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందని ఆందోళన వ్యక్తంచేశారు. ‘రైతుబంధు లేదు.. ఎరువుల ఇచ్చేటోళ్లు లేరు.. రెండు నెలలైనా పంటకొనే దికు లేదు. ప్రభుత్వం కాళ్లు పట్టుకున్నా కనికరించని దౌర్భాగ్యం చూస్తుంటే బాధవుతున్నది’ అని వాపోయారు. ‘నాలుగు సార్లు రైతుబంధు ఎగ్గొట్టిన నయవంచకుడు రేవంత్‌రెడ్డి.. యూరియా ఇవ్వడం చేతగాని అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. పంటలు కొనలేని సన్నాసి రేవంత్‌రెడ్డి అని 70 లక్షల మంది తెలంగాణ రైతన్నలు రేవంత్‌రెడ్డిని అడ్డగోలుగా తిడుతున్నరు’ అని తెలిపారు. కేసీఆర్‌ను బద్నాం చేయాలనే ఉద్దేశంతో సాగునీటి ప్రాజెక్టుల మీద కాంగ్రెస్ పగబట్టిందని, కృష్ణా, గోదావరి జలాలను చంద్రబాబుకు గురుదక్షిణగా ఇచ్చే కార్యక్రమాలను రేవంత్‌రెడ్డి చేస్తున్నాడని మండిపడ్డారు. పెట్టుబడిదారులకు స్వర్గధామంగా ఉన్న తెలంగాణలో ఇప్పుడు పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు పెడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు.
‘అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అశోక్‌నగర్‌లో నిరుద్యోగ విద్యార్థులు, యువకులను కూర్చోబెట్టి మోసం చేసింది రాహుల్‌గాంధీ కాదా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. ‘రెండున్నరేండ్లలో కనీసం 4,000 కొత్త ఉద్యోగాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదు. మరి రాహుల్‌గాంధీ ఏం చేస్తున్నట్టు? తెలంగాణకు రావడానికి ముఖం చెల్లడం లేదా? రాహుల్?’ అని నిలదీశారు. ‘దమ్ముంటే చికడపల్లి లైబ్రరీ, అశోక్‌నగర్ చౌరస్తాకు వస్తావా రేవంత్‌రెడ్డీ? పోలీసులు లేకుండా నిరుద్యోగ యువతను కలుస్తావా?’ అని సవాల్ విసిరారు. ఈరోజు తెలంగాణ మొత్తం ఒక ధర్నా చౌక్‌గా మారిపోయిందని, అన్ని వర్గాలు ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నాయని చెప్పారు. అన్నదాతలు, నిరుద్యోగ యువకులు, ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు అందరూ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారని, ఎకడికకడ నిరసనలు తెలుపుతున్నారని గుర్తుచేశారు.
‘కాంగ్రెస్ వచ్చాక తెలంగాణలో శాంతి లేదు, భద్రత లేదు.. పట్టపగలే హత్యలు జరుగుతున్నయ్’ అని కేటీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. ‘తుపాకులు తలకు పెట్టి కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నరు.. వ్యాపారులకు పెట్టి దోపిడీ దొంగలు చెలరేగిపోతున్నరు’ అని వాపోయారు. ‘రాష్ర్టాన్ని ఆర్థికంగా దివాలా తీయిస్తున్నరు. రేవంత్‌రెడ్డి ఎవరికీ రూపాయి కూడా ఇవ్వకుండానే నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిండు’ అని మండిపడ్డారు. ఈ రోజు తెలంగాణ ముక్తకంఠంతో ‘కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి అంటున్నది’ అని స్పష్టంచేశారు. ‘కష్టపడి సాధించిన తెలంగాణను కాపాడుకోవడం కోసమే మనం పోరాడాలి’ అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
పుష్కర తెలంగాణ ఇవ్వాళ ముషరుల పాలవుతున్నదని, తెలంగాణ తల్లి కిరీటాన్ని, తెలంగాణ తల్లి వడ్డాణాన్ని కాంగ్రెస్ దొంగతనం చేసుకొని పోతున్నదని నిప్పులు చెరిగారు. అందుకే తెలంగాణ కోసం మరో ప్రజాపోరాటానికి సిద్ధం కావాలని పార్టీ శ్రేణులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు మహమూద్ అలీ, దేశపతి శ్రీనివాస్, దాసోజు శ్రవణ్, మహమూద్ అలీ, నవీన్‌కుమార్‌రెడ్డి, వాణీదేవి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, చల్లా ధర్మారెడ్డి, పట్నం నరేంద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, రాష్ట్ర కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, దేవీప్రసాద్, వెంకటేశ్వర్‌రెడ్డి, అయాచితం శ్రీధర్, బాలరాజుయాదవ్, రాకేశ్, కిషన్‌రావు, నేతలు తుల ఉమ, కార్తీక్‌రెడ్డి, కిశోర్‌గౌడ్, సుమిత్రాఆనంద్, గెల్లు శ్రీనివాస్, తుంగ బాలు, కడారి స్వామియాదవ్ పాల్గొన్నారు.
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు జానపద కళాకారులను కేటీఆర్ ఘనంగా సన్మానించారు. పాటలు కైగట్టి పాడే ఐదుగురు కళాకారులను సన్మానించారు. ‘నర్సపెల్లే’ గాయకురాలు గొట్టె కనకవ్వ, ‘బాయిలోనే బల్లిపలికే’ గాయని గంగవ్వ, ‘కెమెరా పట్టిన్నడే ఉశక్క, రావుతల్లి’ గాయని భిక్షమమ్మ, గాయని లక్ష్మమ్మలను శాలువాలు కప్పి, నగదు పురస్కారాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు కైగట్టి పాడిన పాటలను వారితోనే పాడించగా నాయకులు గొంతు కలిపారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో కేసీఆర్ ఫీనిక్స్ పక్షిలా ఎగిసిపడ్డారని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ చెప్పారు. కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండి ఉద్యమాన్ని అణచివేసిందని, ఉద్యమం అంతా అయిపోయిందనుకున్న ప్రతిసారీ కేసీఆర్ ఉవ్వెత్తున ఎగిసి పడేలా చేశారని గుర్తుచేశారు. నాడు కేసీఆర్ ఒక్క పిలుపునిస్తే రోడ్లు జనసముద్రాలయ్యాయని, యూనివర్సిటీలు యుద్ధమైదానాలుగా మారాయని గుర్తుచేశారు. ఇనుప కంచెల మీద పడితే వెయ్యి కుట్లుపడినా జై తెలంగాణ నినాదంతో యువత, నిరుద్యోగులు, సబ్బండవర్ణాలు ప్రత్యేక రాష్ట్ర సాధనలో పాలుపంచుకున్నాయని తెలిపారు. ఉద్యమ ఉద్విగ్న సమయంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరినీ స్మరించుకొనే రోజు ఈ రోజని చెప్పారు. కేసీఆర్ వచ్చే వరకు తెలంగాణ నేలల్లో రక్తమే పారిందని, కేసీఆర్ వచ్చిన తర్వాతే నీళ్లు పారాయని తెలిపారు. ఆ నాడు తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన వాళ్లు నేడు తెలంగాణ అంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. విగ్రహాల మాటున మళ్లీ గురువు తెలంగాణలో అడుగుపెట్టేందుకు ఎర్రతివాచీ పరుస్తున్నారని విమర్శించారు. తెలంగాణపై వాలేందుకు ఉమ్మడి గద్దలు ఎగురుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు.
అడ్డదారిలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణను 25 ఏండ్ల్లు వెనకి నెట్టింది. వడ్డించిన విస్తరి లాంటి రాష్ర్టాన్ని రేవంత్‌రెడ్డి కుకలు చింపిన విస్తరిలా చేస్తున్నడు. ఐదేండ్లలో సగం సమయం గడిచినా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదు. 30 నెలల్లో తెలంగాణను అన్ని రంగాల్లో కుప్పకూల్చింది. కాంగ్రెస్ పాలనలో మోసపోని వర్గమంటూ ఏదీ లేదు. సంతోషంగా సాగిన వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయింది.
-కేటీఆర్
అహింసా మార్గంలో 14 ఏండ్లపాటు పోరాడి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని ఎమ్మెల్సీ మహమూద్ అలీ చెప్పారు. తెలంగాణ తొలిదశ ఉద్యమం (1969)లో 400 మందికిపై కాంగ్రెస్ సర్కార్ పొట్టనబెట్టుకున్నదని మండిపడ్డారు. ప్రాణాలు పణంగా పెట్టి కేసీఆర్ తెలంగాణను సాధించారని, పదవులను గడ్డిపోచలా భావించారని గుర్తుచేశారు. చావునోట్లో తలపెట్టి 11 రోజులు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా దీక్ష సాగించి ఢిల్లీ మెడలు వంచారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలనలో ఆగమవుతున్న తెలంగాణను మళ్లీ బాగుచేసుకొనేందుకు కేసీఆర్ రావాలని యావత్ తెలంగాణ ప్రజానీకం కోరుకుంటున్నదని చెప్పారు.
దశాబ్దాల తెలంగాణ రాష్ట్ర సాధన కలను నిజం చేసుకున్న రోజు ఇదని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ చెప్పారు. తెలంగాణ పేరు ఉచ్ఛరించడానికి కూడా భయపడిన రోజులు ఆనాడు ఉండేవని, తెలంగాణ సాధన అంశాన్ని కేసీఆర్ తలకెత్తుకొని విజయం సాధించారని గుర్తుచేశారు. ఆనాడు వార్డు మెంబర్ పదవికి కూడా రాజీనామా చేయడానికి భయపడిన రోజుల్లోనే కేంద్ర మంత్రి పదవిని తెలంగాణ సాధన కోసం గడ్డిపోచలా వదులుకున్న వ్యక్తి కేసీఆర్ అని తెలిపారు. పదవులు ఐదేండ్లకోసారి వస్తాయి, పోతాయి కానీ, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారు తెలంగాణ జెండా కప్పితే చాలని, తెలంగాణ రాష్ట్ర సాధనే శ్వాసగా ఉద్యమించారని గుర్తుచేశారు.
తెలంగాణ భావజాలాన్ని కించపర్చాలనే కుట్రలు మళ్లీ మొదలవుతున్నాయని జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ ఆందోళన వ్యక్తంచేశారు. రాబోయే రోజుల్లో మళ్లీ తెలంగాణ అస్తిత్వం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ను అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేయాలని కోరారు. కొట్లాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని, జైళ్లు, నిర్బంధాలు ఎదుర్కొన్నామని గుర్తుచేశారు. యువత, విద్యార్థులు రక్తాలు చిందించిన ఉద్యమ జ్ఞాపకాలను తుడిచి వేయాలని కొందరు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఈ రోజు తెలంగాణ ముక్తకంఠంతో ‘కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ రావాలి’ అంటున్నది. కష్టపడి సాధించిన తెలంగాణను కాపాడుకోవడం కోసమే మనం పోరాడాలి. తెలంగాణ తల్లి కిరీటాన్ని, తెలంగాణ తల్లి వడ్డాణాన్ని కాంగ్రెస్ దొంగతనం చేసుకొని పోతున్నది. అందుకే ఈరోజు మరో ప్రజా పోరాటానికి సిద్ధం కావాలి.

రాజన్న సిరిసిల్ల, జూన్ 2 (నమస్తే తెలంగాణ) : ‘రెండేండ్లుగా కేసీఆర్, కేటీఆర్‌ను తిట్టుడే నువ్వు పనిగా పెట్టుకున్నవ్.. ముఖ్యమంత్రి కేసీఆరా? నువ్వా’ అని రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ ప్రశ్నించారు. ‘రెండున్నరేండ్లుగా రైతు భరోసా లేదు.. రైతుబీమా లేదు.. సీఎం రేవంత్‌రెడ్డి రైతు డిస్కమ్ పేరిట కొత్త దుకాణం పెట్టిండు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎలాంటి డిస్కమ్‌లు, డిస్కోలు లేకుండానే 24 గంటల ఉచిత కరెంట్ అందించారని గుర్తుచేశారు. రైతు డిస్కమ్ ఎవరికోసం పెట్టావని రేవంత్‌ను ప్రశ్నించారు. ట్రాన్స్ఫార్మర్లు, మోటర్లకు మీటర్లు పెట్టే డిస్కమ్‌లు తెస్తున్నాడని, దేశంలో ఎక్కడా లేని రైతు డిస్కమ్‌ను తెలంగాణలో ఎందుకు పెడుతున్నారని నిలదీశారు. ‘ఏ రైతు అడిగిండని, ఎవరు అడిగిండని డిస్కమ్ పెడుతున్నవ్?’ అని ప్రశ్నించారు. ‘రేవంత్‌రెడ్డి మనసుల ఏమున్నదో ఆయన ముఖ్యమంత్రి కాకముందు అమెరికా మీటింగ్‌లోనే చెప్పిండు.
‘రైతులకు 24 గంటల కరెంట్ దండుగ.. 3 గంటలు సరిపోతదన్నడు. ఆయన పీసీసీ హోదాలోనే రైతులకు 3 గంటలు సరిపోతదని చెప్పిండు. నిన్నగాక మొన్న రైతు డిస్కమ్‌పై ప్రజాభిప్రాయ సేకరణ పెడితే రేవంత్‌రెడ్డి మనసులోని మాటను వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి బయటపెట్టిండు. రైతులను ముంచేందుకే మోటర్లకు మీటర్లు, ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు పెడుతున్నరు. అల్టిమేట్‌గా కరెంట్‌ను ప్రైవేట్ రంగానికి అప్పగించే కుట్రలు చేస్తున్నరు’ అని నిప్పులు చెరిగారు. మంగళవారం సిరిసిల్లలో పర్యటించిన కేటీఆర్ మొదట గీతానగర్ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన 30 మంది విద్యార్థులకు ‘గిప్ట్ ఏ స్మైల్’ కింద ట్యాబ్‌లు అందజేశారు. శాలువాలతో సత్కరించి అభినందించారు. తర్వాత సిరిసిల్ల తెలంగాణ భవన్లో వీర్నపల్లి, గంభీరావుపేట మండలాల నుంచి సుమారు 500 మందికిపైగా బీఆర్ఎస్లో చేరగా వారికి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
పోలీస్ కస్టడీలో మరణించిన కర్ల రాజేశ్ కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదుకున్నారు. రాజేశ్ మరణించిన సమయంలో బాధిత కుటుబాన్ని ఓదార్చిన సమయంలో ఆర్థిక సాయాన్ని అందిస్తానని మాటిచ్చారు.

ఆ మేరకు కేటీఆర్ బాధిత కుటుంబానికి రూ.5లక్షల చెక్కును పంపించినట్టు కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ తెలిపారు. మంగళవారం కోదాడలో రాజేశ్ తల్లి లలితమ్మకు కేటీఆర్ పంపిన చెక్కును బొల్లం అందజేశారు.
– కోదాడ