Minister KTR | నిజామాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘మోడీకి, ఈడీకి భయపడేది లేదు.. దొంగలు, తప్పుచేసినోళ్లే భయపడ్తరు. మేం కాదు. ప్రజల వద్దకే వెళ్తాం. ప్రజాకోర్డులో తేల్చుకుందాం. ఎవరేందో ప్రజలే తేలుస్తరు..2023లో తీర్పు చెప్తరు’ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు స్పష్టంచేశారు. బీజేపీ దేశాన్ని ఆగం చేస్తున్నదని, ఆ పార్టీ తెలంగాణకు పట్టిన దరిద్రమని మండిపడ్డారు. ప్రధాని మోదీ దేశ సంపదను దోచి దోస్తులకు పంచి పెడుతున్నాడని.. వారి దగ్గర తీసుకున్న చందా డబ్బులతో పార్టీలను చీల్చి, దేశాన్ని ఆగం చేస్తున్నాడని ధ్వజమెత్తారు.
మహానటుడు మోదీని నామినేట్ చేస్తే నటనలో ఆస్కార్ తెచ్చేవాడని విమర్శించారు. ‘మన్మోహన్సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు దిక్కుమాలిన ప్రభుత్వం వల్ల సిలిండర్ 400 రూపాయలైంది.. దద్దమ్మ ప్రధాని అని మోడీ అప్పట్లో అన్నాడు. మరీ ఇప్పుడెంతైంది 1200లకు చేరింది. రూ.400 చేసినోడు సన్నాసి అయితే, రూ.1200 చేసిన ప్రధానిని ఏమనాలి? దద్దమ్మ అనాలా.. సన్నాసి అనాలా?’ అని ప్రశ్నించారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో శాసనభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే హన్మంత్ షిండేలతో కలిసి బుధవారం పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. రూ.470 కోట్లతో నిర్మిస్తున్న నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్‌కు కేటీఆర్ శంకుస్థాపన చేసి పైలాన్‌ను ఆవిష్కరించారు. రూ.25 కోట్లతో మంజీరా నదిపై నిర్మించిన బ్రిడ్జిని ప్రారంభించారు. అనంతరం పిట్లం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహించిన సభలో ప్రసంగించిన కేటీఆర్.. కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
రాబోయే ఎన్నికల్లో బీజేపీ వాళ్ల డిపాజిట్లు గల్లంతు చేయాలని మంత్రి కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. సిలిండర్, పెట్రోల్, గ్యాస్ ధర పెరిగిందని.. పప్పు, ఉప్పు, నూనె పిరం అయినయని అన్నారు. మోదీ మాటలు చెప్పుడే తప్ప, ఒక్క పనీ చెయ్యలేదని విమర్శించారు. తెలంగాణ మీద కక్ష కట్టిన మోదీ.. రాష్ర్టానికి ఒక్క మెడికల్ కాలేజీ కానీ, నర్సింగ్ కాలేజీ కానీ ఇవ్వలేదని మండిపడ్డారు. ఢిల్లీలో ఫేకుడు ఉంటే, గల్లీలో జోకుడుగాడు తయారైండని బండి సంజయ్‌ని ఉద్దేశించి అన్నారు. ‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మోదీని దేవుడని అంటున్నడు. ఎవరు దేవుడు.. ఎవడికి దేవుడు? నీకు, నీ అదానీకి దేవుడు కావొచ్చు. పేదోళ్లకు కాదు’ అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
మహారాష్ట్ర, కర్ణాటకల్లో మన పథకాలు ఎందుకు అమలు కావడం లేదో ఆలోచించాలని మంత్రి కేటీఆర్ సరిహద్దు ప్రాంతాల ప్రజల్ని కోరారు. ‘జుక్కల్నియోకవర్గానికి రైతుబంధు పథకం కింద 86 వేల మందికి రూ.480 కోట్లు మంజూరవుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 65 లక్షల రైతు కుటుంబాలకు రూ.65 వేల కోట్ల రూపాయలు అందినయి. మీకు ఇటు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా, అటు కర్ణాటక లోని బీదర్ జిల్లా ఉన్నది. మీకు తెలిసినోళ్లు, మీ చుట్టాలు, అక్కడి మీ దోస్తులను ఒకటే అడగండి. ఈ పథకాలు వాళ్లకు అమలవుతున్నయా? కరెంట్ అక్కడ ఇట్లనే వస్తున్నదా? పేదింటి ఆడబిడ్డ పెండ్లికి ఆర్థికసాయం వస్తున్నదా? ఒక్క జుక్కల్ నియోజకవర్గం లోనే సీజన్‌కు రూ.480 కోట్ల రైతుబంధు ఇస్తున్న ప్రభుత్వం అక్కడ ఉన్నదా? పేదోళ్లను కడుపులో పెట్టుకుని చూసుకునే సంస్కారం వాళ్లకు ఉన్నదా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. అక్కడ ఒక్క పైసా రావడం లేదని సభకు హాజరైన ప్రజలు ప్రతిస్పందించారు.
కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి, మల్లన్నసాగర్ ద్వారా నిజాంసాగర్‌కు నీళ్లు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని కేటీఆర్ స్పష్టం చేశారు. ‘ఎక్కడి గోదావరి.. ఎక్కడి నిజాంసాగర్.. నదినే మళ్లించిన చరిత్ర కేసీఆర్‌ది. అంతకుముందు కరెంట్‌కు గోస పుచ్చుకుంటుండె. ఎవరైనా చనిపోతే బాయికాడ స్నానం చేసేందుకు కరెంటోళ్లను బతిమిలాడుకోవాల్సిన పరిస్థితి ఉండేది. కరెంట్, తాగునీటి, సాగునీటి సమస్యలను పరిష్కరించుకున్నం. ఇప్పుడు కరెంట్ పోతే వార్త. ఇంటింటికీ నీళ్లు ఇస్తున్నం. 3,400 గూడేలను పంచాయతీలుగా మార్చింది కేసీఆర్’ అని గుర్తుచేశారు. కేసీఆర్‌ను కాపాడుకొని మూడోసారి ముఖ్యమంత్రిని చేసుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు. పిట్లం, బిచ్కుందలను మున్సిపాలిటీలను చేద్దామని, జుక్కల్ ఎమ్మెల్యే అడిగిన పనులన్నీ పూర్తి చేస్తానని కేటీఆర్ భరోసా ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో షిండేను 72 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరారు.
రాష్ట్రం కోసం కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందో ఏకబిగిన గంట గంటన్నర సేపు చెప్పగలుగుతామని కేటీఆర్ అన్నారు. ‘పల్లె ప్రగతిలో ఊరూరా నర్సరీ కట్టినం. డంప్ యార్డులు, వైకుంఠధామం రైతువేదికలు, చెట్లు పెంచుకున్నం. గొల్ల, కుర్మ సోదరులకు రూ.12 వేల కోట్లతో గొర్రెలను ఇచ్చినం. నిజాంసాగర్ మండలంలో దళితబంధు కింద రూ.10 లక్షలచొప్పున ఇచ్చి 1,300 కుటుంబాల ఆర్థికస్థితిని సమూలంగా మార్చినం. గిరిజనులకు 6 శాతం నుంచి 10 శాతం రిజర్వేషన్ పెంపు, గౌడన్నలకు చెట్ల పన్ను రద్దు, ఎక్స్‌గ్రేషియా పెంపు, నీరా పాలసీ, గంగపుత్రులకు చేప పిల్లల పంపిణీ, పద్మశాలీలకు నేతన్న బీమా, చేనేత మిత్ర తెచ్చినం. ఇలా చెబుతూ పోతే ఏ కులమైనా మైనార్టీ, గిరిజనులైనా, బీసీలైనా అందరికీ న్యాయం చేసింది కేసీఆర్ ఒక్కరే’ అని వివరించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 1000 గురుకులాల్లో ఒక్కో విద్యార్థిపై 1.20 లక్షల ఖర్చుతో ప్రభుత్వం విద్యాబుద్ధులు నేర్పుతున్నదని కేటీఆర్ తెలిపారు. విదేశాల్లో చదువుకునేందుకు 7 వేల మందికి 20 లక్షల చొప్పున ఇచ్చి అంబేద్కర్ ఓవర్సీస్, మహాత్మాజ్యోతిబా పూలే ఓవర్సీస్ పథకాన్ని అందిస్తున్నామని చెప్పారు. ఎవరికైనా తక్కువ చేసినమా.. నష్టం చేసినమా? అని కేటీఆర్ అన్నారు. ఒక్క చాన్స్ ఇయ్యాలంటూ పీసీసీ అధ్యక్షుడు నిజామాబాద్‌లో తిరుగుతూ గొంతు చించుకుంటున్నాడని, కాంగ్రెస్ 50 ఏండ్లు అధికారంలో ఉన్నప్పుడు చేయలేనోడు.. ఇవ్వాళ వచ్చి డైలాగ్‌లు కొడితే పడిపోదామా? అని ప్రజలను ప్రశ్నించారు.
జుక్కల్ సభలో మంత్రి కేటీఆర్ ఓ పిట్టకథ చెప్పి ప్రజల్ని ఆలోచనలో పడేశారు. ‘ఓ పిలగాడికి చిన్నప్పటి నుంచి చదువు అబ్బలేదు. ఆగం సోపతి. మందు, జర్దా, గుట్కా బుక్కి పెరిగి పెద్దోడైండు. వానికి 16 ఏండ్లొచ్చినయ్. తాగుడుకు మరిగిండు. ఒకరోజు వాళ్ల నాయిన జేబులో వాడు చెయ్యి పెట్టంగ వాళ్ల అమ్మ చూసి దవడ మీదికెళ్లి ఒక్కటి కొట్టింది. తాగి ఉన్నడు. సోయిల లేడు. వెంటనే రోకలితో కొడితే వాళ్ల ఆమె సచ్చిపోయింది. తండ్రి వచ్చి ఇదేందిరా అని అడిగితే ఆయనను కూడా రోకలితోని కొట్టి సంపిండు. పోలీసులు జైలుకు పట్టుకుపోయిండ్రు. కోర్టులు వాదోపవాదాలు జరుగుతున్నయి. జడ్జి గారు మాట్లాడుతూ.. అరేయ్ నా జీవితంలో ఎంతోమంది గలీజ్ గాళ్లను, లత్కోర్గాళ్లను, ఆఖరకు రేవంత్‌రెడ్డిని కూడా చూసిన. కానీ నీయంత గలీజ్గాడిని చూడలేదురా అంటూ ఆశ్చర్యపోయిండట. ఇప్పుడు ఏం చేయమంటవ్ అని జడ్జి అడిగితే.. అప్పటిదాకా రుబాబుగా నిల్చున్న పోరడు ఒక్కసారిగా రెండు చేతులు కట్టుకున్నడట. నేను అమ్మానాన్నలేని అనాథను సార్ విడిచిపెట్టు అని దీనంగా చెప్పిండంట. కాంగ్రెసోళ్ల కథ కూడా అట్లనే ఉంది. నిన్న మొన్నటిదాకా వీళ్లే కదా అధికారంలో ఉన్నది. ఇప్పుడచ్చి అవకాశం ఇయ్యమంటున్నరు. ఒక్కచాన్స్ కాదు.. 50 ఏండ్లు పరిపాలించినప్పుడు గుడ్డి గుర్రాల పండ్లు తోమిన్రా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు.
‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చింది. అయితే, మన దేశంలో అద్భుతమైన మహా నటుడు ఒకాయన ఉన్నడు. ఆయన్ను పంపింతే ఆస్కార్ తప్పక వచ్చేది. ఆయన్ను పంపేదుండె. ఆయన ఇంకెవరో కాదు.. మన మోదీ. జనధన్ ఖాతాలు తెరిస్తే ధన్‌ధన్ 15లక్షలు వేస్తానన్నడు. ఎవరికైనా పడ్డాయా? దేశ సంపదను దోచి వాళ్ల దోస్త్ ఖాతాలో వేసి, వాడి వద్ద నుంచి చందాలు తీసుకుని ప్రతిపక్షాలను చీల్చుతున్నడు. మోదీని మహానటుడు అని ఉత్తగనే అనలేదు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్నడు. అయ్యిందా మరి? మహారాష్ట్రలో నిన్నగాక మొన్న ఓ రైతు 512 కిలోల ఉల్లిగడ్డలు అమ్ముకుంటే 2 రూపాయలు వచ్చినయ్. ఇదేనా డబుల్ ఆమ్దాన్ అంటే? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నడు. ఇచ్చిండా? అందుకే ఆయనను మహానటుడు అంటున్నం’ అని మంత్రి కేటీఆర్ విమర్శల వర్షం కురిపించారు. కేటీఆర్ ఒక్కో మాటకు సభలో చప్పట్ల మోతమోగింది.
భారత రాష్ట్ర సమితిగా టీఆర్ఎస్ ఏర్పడిన తర్వాత మహారాష్ట్రలో జరిగిన మీటింగ్‌తో బీజేపీ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని, అది త్వరలోనే తప్పక నెరవేరుతుందని చెప్పారు. ‘మనం ఒకనాడు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు చూశాం. ఆయన రూ.2లకే కిలో బియ్యం, జనతా వస్ర్తాలు, పక్కా ఇండ్లు వంటి మూడే పథకాలతో జనాల్లోకి వచ్చాడు. అలాంటి 36 పథకాలతో సీఎం కేసీఆర్ ప్రజల్లో నిలిచారు. మూడు పథకాలకే ప్రభంజనం సృష్టిస్తే, 36 పథకాలున్న కేసీఆర్‌కు తిరుగేలేదు’ అని సభాపతి పేర్కొన్నారు. కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతున్నదని, తండ్రీకొడుకులు రాష్ర్టాభివృద్ధికి పోటీ పడి పనిచేస్తున్నారని ప్రశంసించారు. కేసీఆర్ చొరవతోనే నిజాంసాగర్ ప్రాజెక్టు, దాని దిగువ నిర్మిస్తోన్న నాగమడుగు ఎత్తిపోతల పథకాలతో భవిష్యత్తులో మంజీరా నిండుకుండలా మారుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాలను తరలించేందుకు కేసీఆర్ రూ.1500 కోట్లతో కాలువలను తవ్వించారని పోచారం చెప్పారు.
అవినీతిని, నియంతృత్వ పోకడలను ప్రశ్నిస్తున్నందునే ఎమ్మెల్సీ కవితను మోదీ ప్రభుత్వం వేధిస్తున్నదని రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. మోదీ పాలన అంతుచూసే దాకా విశ్రమించబోమని తేల్చిచెప్పారు. 2014లో రాష్ట్రంలో ఐటీ ఎగుమతుల విలువ రూ.57 వేల కోట్లు ఉంటే.. ఇప్పుడు రూ.1.83 లక్షల కోట్లకు పెరిగిందని, 3 లక్షల ఉద్యోగాల నుంచి 8.5లక్షల ఐటీ సెక్టార్లో ఉద్యోగాలు వచ్చాయని వివరించారు. కేటీఆర్ వల్లే తెలంగాణకు వచ్చానంటూ ఫాక్స్‌కాన్ చైర్మన్ ప్రకటించడం గొప్ప విషయమన్నారు. రాష్ర్టానికి వస్తున్న పెట్టుబడులపై ఏపీ ఉన్నతాధికారులే ఆశ్చర్యపోతున్నారని చెప్పారు. కేటీఆర్ లాంటి మంత్రి ఉండటం వల్ల పెట్టుబడులు వస్తున్నాయని, ఉద్యోగాలు దొరుకుతున్నాయని ఏపీ ఉన్నతాధికారి ఒకరు తనతో చెప్పిన విషయాన్ని ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎంపీ బీబీపాటిల్, కామారెడ్డి జడ్పీ చైర్మన్ దఫేదార్ శోభ, ఎమ్మెల్యేలు జాజాల సురేందర్, బిగాల గణేశ్ గుప్తా, ఎమ్మెల్సీ డీ రాజేశ్వర్, ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దీన్, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, కలెక్టర్ జితేశ్ వి పాటిల్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దఫేదార్ రాజు తదితరులు పాల్గొన్నారు.