KTR | ట్రిపుల్ఆర్ భూసేకరణలో ప్రభుత్వం అలైన్మెంట్ మార్పు వల్ల ఇబ్బందులు పడుతున్న వికారాబాద్ రైతులను ఆదుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు. RRR (రీజినల్ రింగ్ రోడ్) అలైన్మెంట్ మార్పుతో భూములు కోల్పోతున్న వికారాబాద్ జిల్లా రైతులు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు వచ్చి కేటీఆర్‌ను కలిశారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ప్రభుత్వం భూసేకరణ చేసేటప్పుడు ఎందుకు తీసుకుంటున్నారో చాలా స్పష్టంగా చెప్పాలని, ఎంత తీసుకుంటున్నారో కూడా స్పష్టంగా చర్చించి చెప్పాలని అన్నారు. చట్టప్రకారం వ్యవహరించాలని, ప్రభుత్వం ఇష్టానుసారంగా భూములు లాక్కుంటామంటే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. కాగా, కచ్చితంగా భూసేకరణ చట్టం ప్రకారం భూమి సేకరణకు సంబంధించిన లక్ష్యాలు ఉండాలని, అవసరమైతే భూములను కోల్పోతున్న ప్రతి రైతుకు పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ భూములను వదిలి తమ భూములను కాపాడుకునేందుకు, ఇతర ప్రైవేట్ వ్యక్తుల భూములను ఇబ్బంది పెట్టేలా భూసేకరణ చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
RRR (రీజినల్ రింగ్ రోడ్) అలైన్మెంట్ మార్పుతో భూములు కోల్పోతున్న వికారాబాద్ జిల్లా రైతులు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS ను కలిశారు.
బాధితుల కోసం ఎంతవరకైనా పోరాడతామని హామీ ఇచ్చారు
ఈ సందర్భంగా కేటీఆర్ గారు వికారాబాద్ జిల్లా కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి, బాధితులకు న్యాయం… pic.twitter.com/3h53E4MeOZ
— BRS Party (@BRSparty) September 17, 2025
గతంలో కూడా ఔటర్ రింగ్ రోడ్ అంశంలో ఇదే విధంగా సొంత అజెండాలతో ముందుకు వెళ్లిందని, ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ భూసేకరణలో కూడా అదేతీరుగా వ్యవహరిస్తుందని కేటీఆర్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఒరిజినల్ అలైన్మెంట్ కాకుండా సొంత డబ్బులతో కడుతున్నామని చెప్పి తమవారి భూములను కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తోందని అన్నారు. అందుకోసం వేలాదిమంది రైతుల జీవితాలను దెబ్బతీస్తోందని విమర్శించారు. వికారాబాద్‌లో అలైన్మెంట్ మార్పు వల్ల భూములు కోల్పోతున్న ప్రతి ఒక్కరికీ పార్టీ తరఫున అండగా ఉంటామని, అవసరమైతే వారి తరఫున న్యాయ పోరాటం కూడా చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.
వికారాబాద్ పరిధిలో భూములు కోల్పోతున్న ప్రజలు, గ్రామస్తులు అందరినీ కలుపుకొని ముందుకు పోతామని కేటీఆర్ తెలిపారు. రింగ్ రోడ్డును సాధ్యమైనంతవరకు ప్రభుత్వ భూముల మీదుగా తీసుకువెళ్లాలని, పేద ప్రజల భూములకు నష్టం జరగకుండా చూడాలని అన్నారు. అవసరమైతే స్థానిక శాసనసభ్యులతో కలిసి స్పీకర్ దగ్గర కూడా మాట్లాడతానని తెలిపారు. ఈ విషయంలో పార్టీ రాజకీయాలకు గానీ, పార్టీల విభేదాలకు సంబంధం లేదని, తెలంగాణ బాగుండాలి, ప్రజలు బాగుండాలనేదే తమ ఉద్దేశమని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు రీజనల్ రింగ్ రోడ్ భూసేకరణ బాధితుల అంశంలో ఏకం కావాలని, పేదలకు నష్టం జరగకుండా ముందుకు పోవాలని కోరారు.