హైదరాబాద్: కాంగ్రెస్ అంటేనే మోసం, దగా, నయవంచన అని ఫార్మా సిటీ భూముల వ్యవహారంలో మరోసారి తేలిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. రేవంత్ పాపాల పుట్ట రోజురోజుకూ పెరిగిపోతూనే ఉందని చెప్పారు. అధికారంలోకి వస్తే ఫార్మా సిటీని రద్దుచేసి, భూములను తిరిగి ఇప్పిస్తామని హామీఇచ్చి, వాటిని ఇతర అవసరాలకు రేవంత్ మళ్లించడం అత్యంత నీచమైన చర్య అని విమర్శించారు. దోస్తులకు దోచిపెట్టేందుకు చీకటి ఒప్పందాలతో తెరపైకి తెచ్చిన ఫ్యూచర్ సిటీకి అక్రమంగా భూములు కేటాయిస్తే స్థానిక రైతులే కాదు.. బీఆర్ఎస్ కూడా చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదన్నారు.
‘అల్లుడి ఫార్మా కంపెనీ కోసం కొడంగల్ లో దళిత, గిరిజనుల భూములను కొల్లగొట్టే కుట్రలను మొదలుకుని, అనుముల బ్రదర్స్ కోసం ఫ్యూచర్ సిటీ పేరిట అన్నదాతల భూములను చెరబట్టే పన్నాగాల దాకా.. రేవంత్ పాపాల పుట్ట రోజురోజుకూ పెరిగిపోతూనే ఉంది. కాంగ్రెస్ అంటేనే మోసం, దగా, నయవంచన అని ఫార్మా సిటీ భూముల వ్యవహారంలో మరోసారి తేలిపోయింది. అధికారంలోకి వస్తే ఫార్మా సిటీని రద్దుచేసి, భూములను తిరిగి ఇప్పిస్తామని హామీఇచ్చి, వాటిని ఇతర అవసరాలకు రేవంత్ మళ్లించడం అత్యంత నీచమైన చర్య.
అడుగడుగునా అన్నదాతలు మర్లవడుతున్నా, ఏకంగా ఎమ్మెల్యేల ఇళ్లు ముట్టడిస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ కు మాత్రం బుద్దిరావడం లేదు. ఫార్మా సిటీ రద్దైతే తమ భూములు తిరిగి వస్తాయని ఆశపడ్డ రైతుల నోట్లో మట్టికొడుతున్న రేవంత్ రెడ్డికి కర్రుగాల్చి వాతపెట్టేందుకు అన్నదాతలు సిద్ధంగా ఉన్నారు. ఓవైపు ఫార్మా సిటీ రద్దుచేస్తున్నట్టు ప్రకటించి, మరోవైపు కొనసాగిస్తామని హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం అటు ప్రజలనే కాదు, ఇటు న్యాయస్థానాలను కూడా మోసం చేయడమే. ఫార్మా సిటీ భూములను ఇతర అవసరాలకు మళ్లిస్తే, రైతులు తిరిగి భూములు పొందే హక్కును కూడా కాంగ్రెస్ కాలరాయడం క్షమించరాని నేరం. దోస్తులకు దోచిపెట్టేందుకు చీకటి ఒప్పందాలతో తెరపైకి తెచ్చిన ఫ్యూచర్ సిటీకి అక్రమంగా భూములు కేటాయిస్తే స్థానిక రైతులే కాదు.. బీఆర్ఎస్ కూడా చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.