KTR | సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్రెండేండ్లుగా వ్యవస్థలను వాడుకుంటూ బీఆర్ఎస్ నేతలపై రేవంత్ సర్కార్ కక్షసాధింపులకు పాల్పడుతున్నది. ఆ పరంపరలో భాగంగానే మాజీ మంత్రి హరీశ్‌రావుకు ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీస్ ఇచ్చింది. రాత్రి 11 గంటలకు నోటీసిచ్చి, ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని ఆదేశించింది. సిద్దిపేటలో ఉన్న కార్యక్రమాలన్నీ క్యాన్సిల్ చేసుకొని బాధ్యత, నిబద్ధత కలిగిన నాయకుడిగా హరీశ్ విచారణకు హాజరైండ్రు. -కేటీఆర్
హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ) : రేవంత్‌రెడ్డి బావమరిది సృజన్‌రెడ్డికి బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణాన్ని మాజీ మంత్రి హరీశ్‌రావు బయటపెట్టినందుకే సర్కార్ సిట్ పేరుతో నోటీస్లిచ్చి వేధింపులకు పాల్పడుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. బొగ్గు కుంభకోణం గురించిన బయటపెట్టిన సమాచారం తప్పు అయితే సంబంధిత మంత్రి, సింగరేణి అధికారులు ఇప్పటిదాకా ఒకరు కూడా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. హరీశ్‌ను చూసి రేవంత్ సరార్కు వణుకు పుడుతున్నదని, ఆయనను రాజకీయంగా ఎదుర్కోలేకనే తప్పుడు కేసులు పెడుతూ కక్షసాధింపు చర్యలకు దిగుతున్నదని ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నేతలతో కలిసి కేటీఆర్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. రాజకీయ వేధింపులే కాంగ్రెస్ పార్టీకి ఏకైక ఎజెండాగా మారాయని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి పస లేదని సుప్రీంకోర్టే చెప్పిందని తెలిపారు. సుప్రీంకోర్టు చెప్పడమే కాకుండా కేసును కొట్టేసిందని గుర్తుచేశారు. సుప్రీంకోర్టు చెప్పినా రేవంత్ సరార్ నోటీసులివ్వమేంటని మండిపడ్డారు.
రాత్రి నోటీసులిచ్చి పొద్దుగాల రమ్మంటరా?
విచారణ, కమిషన్ల పేరుతో బీఆర్ఎస్ నేతలను రేవంత్ సర్కార్ వేధింపులకు గురిచేస్తున్నదని కేటీఆర్ విమర్శించారు. రెండేండ్లుగా వ్యవస్థలను వాడుకుంటూ తమ నేతలపై కక్షసాధింపులకు పాల్పడుతున్నదని మండిపడ్డారు. ఆ పరంపరలో భాగంగానే హరీశ్‌కు ఫోన్‌ట్యాపింగ్ కేసులో నోటీసులిచ్చారని తెలిపారు. రాత్రి 11 గంటలకు నోటీసులిచ్చి, ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని ఆదేశించారని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన నోటీసులకు బాధ్యతాయుతమైన నాయకుడిగా, నిబద్ధత కలిగిన నాయకుడిగా సిద్దిపేటలో ఉన్న కార్యక్రమాలను అన్నింటినీ క్యాన్సిల్ చేసుకొని హరీశ్‌రావు విచారణకు హాజరయ్యారని చెప్పారు.
రేవంత్ బుద్ధి బురదలోనే
రేవంత్‌రెడ్డిని అదృష్టం అందలం ఎక్కించినా ఆయన బుద్ధి మాత్రం బురదలోనే ఉన్నదని కేటీఆర్ ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ పార్టీ, రేవంత్‌రెడ్డి తీరు ‘తా చెడ్డ కోతి వనమెల్ల చెరిచె’ అన్నట్టుగా ఉన్నదని విమర్శించారు. డబ్బుల కట్టలతో దొరికిన నేర చరిత్ర రేవంత్‌రెడ్డికి ఉన్నదని, అందరికీ దాన్ని పూయాలని చూస్తున్నాడని మండిపడ్డారు. రేవంత్ ఓటుకు నోటు దొంగ కాబట్టి.. అందరికీ అవే బుద్ధులు, బురద అంటించాలని చూస్తున్నాడని ఆక్షేపించారు. సిట్ విచారణ పేరుతో చిట్టి నాయుడు ఎన్ని విచారణలు చేపట్టినా బోగస్ కథనాలకు బెదిరే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. అడ్డగోలు సిట్ విచారణల పేరుతో ఎన్ని రకాల తమాషాలు చేసినా కాంగ్రెస్ పార్టీ హామీల వైఫల్యం, పరిపాలనా వైఫల్యంపై ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టంచేశారు.
ఫోన్ ట్యాపింగ్‌పై ప్రెస్‌మీట్ ఎందుకు లేదు
రెండేండ్లుగా సిట్ పేరుతో విచారణను సాగదీస్తున్నారని, ఫోన్ ట్యాపింగ్ మీద అధికారికంగా ఒక్క ప్రెస్‌మీట్ కూడా ఎందుకు పెట్టలేదని కేటీఆర్ ప్రశ్నించారు. ‘ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఒక అధికారి కూడా ఇప్పటిదాకా ఎందుకు బయటకు మాట్లాడలేదు? కేవలం లీకులు ఇచ్చి ఎన్ని రోజులు ఇలా బతుకుతావు? ఎలాంటి ఆధారాలు లేకుండా, అధికారిక సమాచారం లేకుండా ఎన్ని రోజులు ఈ తమాషాలు నడిపిస్తావు రేవంత్‌రెడ్డీ?’ అని నిలదీశారు. అసలు ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఒక అధికారిక ప్రకటన కూడా రాలేదని గుర్తుచేశారు. గతంలో హరీశ్‌పై నమోదైన అక్రమ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని హైకోర్టు కొట్టివేసిందని తెలిపారు. కేవలం హరీశ్‌పై కుట్రతో జైలుకు పంపాలన్న దురుద్దేశంతోనే సుప్రీంకోర్టులో ప్రజల డబ్బులు పెట్టి మరీ గంటకు రూ.కోటి తీసుకొనే లాయర్‌ను పెట్టి వాదించారని, అయినా, సుప్రీంకోర్టు కేసు కొట్టివేసిందని గుర్తుచేశారు. విచారణకు సరైన ఆధారాల్లేనందుకు రెండు న్యాయస్థానాలు కేసులను కొట్టివేశాయని, కానీ, రేవంత్‌రెడ్డి మాత్రం హరీశ్‌ను జైలుకు పంపాలనే దురుద్దేశంతోనే వేధింపులకు గురిచేస్తున్నదని విమర్శించారు.
బావమరిది కుంభకోణాన్ని బయపెట్టినందుకే
సీఎం రేవంత్‌రెడ్డి బావమరిది సృజన్‌రెడ్డి బొగ్గు కుంభకోణాన్ని హరీశ్ నిన్న బయట పెట్టినందునే అదేరోజు రాత్రి నోటీసులిచ్చారని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ కుంభకోణాలను బయటపెట్టిన ప్రతిసారీ రేవంత్ సర్కార్ అటెన్షన్ డైవర్షన్ పనులు చేస్తున్నదని మండిపడ్డారు. సృజన్‌రెడ్డి కేంద్రంగా సింగరేణి టెండర్లను రిగ్గింగ్ చేశారని, ఇప్పటిదాకా తొమ్మిది సింగరేణి టెండర్లను ముఖ్యమంత్రి కుటుంబం నియంత్రించిందని చెప్పారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా మైనస్ టెండర్లు పడే చోట అంచనా విలువకన్నా అధికంగా టెండర్లు వేయడమే ఇందుకు నిదర్శనమని మండిపడ్డారు. పదేండ్ల తమ పాలనలో ఏనాడూ సింగరేణిలో ఇలాంటి పరిస్థితి తలెత్తలేదని చెప్పారు. దేశంలో అతిపెద్ద కోల్ బ్లాక్ అయిన సింగరేణిని బంగారు బాతుగా భావించి, దాని నుంచి నిధులు, డబ్బులు కొల్లగొట్టేందుకు సరికొత్త నిబంధన తెచ్చారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కాంట్రాక్టు సంస్థలకు సృజన్‌రెడ్డి బెదింపులు
టెండర్లు వేసిన కంపెనీ కచ్చితంగా సైట్ విజిట్ చేయాలనే సరికొత్త నిబంధన పెట్టారని, ఇందుకోసం సింగరేణి అధికారుల నుంచి సైట్ విజిట్ సర్టిఫికెట్ తీసుకోవాలని కేటీఆర్ తెలిపారు. సైట్ విజిట్‌కు వచ్చిన ప్రతి ఒకరి దగ్గర నుంచి కంపెనీ సమాచారం, ఆ కంపెనీ డైరెక్టర్ల సమాచారం తీసుకొని స్వయంగా ముఖ్యమంత్రి బావమరిది సృజన్‌రెడ్డి ఫోన్లు చేసి అందరినీ బెదిరిస్తున్నారని విమర్శించారు. బెదిరింపులకు లొంగకుండా ఉంటే, సైట్ విజిట్ సర్టిఫికెట్‌ను అర్హత ఉన్న కంపెనీలకు ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార రద్దు చేశామని చెప్తున్న నైనీ కోల్ బ్లాక్ వెనుక కూడా ఇదే అక్రమ దందా నడుస్తున్నదని విమర్శించారు. ఇతర కంపెనీలను బెదిరించి ఎకువ అంచనా విలువకు టెండర్లు వేసినట్టు వివరించారు. అందుకే సృజన్‌రెడ్డి కంపెనీ కూడా అధిక విలువకు టెండర్లు దకించుకున్నదని ఆరోపించారు. ఈ మొత్తం సింగరేణి అంశంలో ప్రధాన ముద్దాయి సృజన్‌రెడ్డి అని తేల్చిచెప్పారు.
వాటాలు లేకుంటే బీజేపీ స్పందించాలి
బొగ్గు కుంభకోణం వ్యవహారంలో బీజేపీకి వాటాలు లేకుంటే ఎందుకు స్పందించడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి స్వయంగా బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఉన్న సింగరేణికి తీవ్రమైన ఆర్థిక నష్టం జరుగుతున్నప్పుడు కిషన్‌రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. స్పందించకుంటే కిషన్‌రెడ్డికి కూడా ఇందులో వాటాలు ఉన్నాయని భావించాల్సి ఉంటుందని చెప్పారు. వెంటనే ఈ అంశంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో సీజేఐకి కిషన్‌రెడ్డి లేఖ రాయాలని, సింగరేణిలో కొంతమంది దోపిడీ చేస్తున్నారనే అంశం, సైట్ విజిట్ సర్టిఫికెట్ వంటి అడ్డగోలు నిబంధన అంశంలోనూ విచారణ జరుపాలని డిమాండ్ చేశారు. నైనీ గనులతోపాటు మిగిలిన కాంట్రాక్టులను రద్దు చేస్తారా? లేదా? అని నిలదీశారు. ఈ కుంభకోణం నుంచి అటెన్షన్ డైవర్షన్ కోసమే హరీశ్‌రావుకు నోటీసులిచ్చినట్టు తెలిపారు. గతంలో కూడా ఇదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అమృత్ టెండర్ల సామ్, రేషన్ బియ్యం సామ్, లగచర్ల, మూసీ అంశాలను తెరపైకి తెచ్చినప్పుడు, సాక్ష్యాధారాలు చూపించినప్పుడు ఇదే అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేశారని మండిపడ్డారు.
సిట్ విచారణ జరగాల్సింది వీరిమీద కదా!
నిజంగానే సిట్ వేయాల్సి వస్తే మంత్రుల అరాచకాలు, అవినీతి, అక్రమాలపైనేని కేటీఆర్ స్పష్టంచేశారు. ‘మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కొడుకు వందల మందితో వెళ్లి భూకబ్జాకు పాల్పడితే దానిపై సిట్ ఎందుకు వేయలేదు? ముఖ్యమంత్రి అనుచరుడు రోహిన్‌రెడ్డి తుపాకీ ఎకుపెట్టి కాంట్రాక్టర్‌ను బెదిరించిన కేసులో ఎందుకు వేయలేదు? ఏఐసీసీ కార్యదర్శి సంపత్ ఎనిమిది కోట్ల రూపాయలు డిమాండ్ చేసినప్పుడు సిట్ ఎందుకు వేయలేదు? అమృత్ టెండర్ల సామ్‌పై సృజన్‌రెడ్డి అంశంలో సిట్ ఎందుకు వేయలేదు? ఒక మీడియా కథనంపై సిట్ వేసి ముగ్గురు జర్నలిస్టులను అరెస్ట్ చేసినప్పుడు, మరో మీడియా అంతకంటే దారుణంగా కథనాలు ప్రచురించింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సామ్ చేశారంటే ఎందుకు సిట్ వేయడం లేదు? కేవలం తెలంగాణ జర్నలిస్టులను వేధించి అరెస్టులు చేస్తున్న రేవంత్‌రెడ్డికి మీడియా సంస్థల యాజమాన్యాలపై చర్యలు తీసుకునే ధైర్యం ఉన్నదా?’ అని కడిగిపారేశారు.
రెండేండ్లలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే
ప్రతిరోజూ ఒకేలా ఉండదనే విషయాన్ని రేవంత్‌రెడ్డి గుర్తుంచుకోవాలని కేటీఆర్ హితవుపలికారు. మరో రెండేండ్ల తర్వాత వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తంచేశారు. తమ పదేండ్ల పాలనలో ఎప్పుడూ అధికార దుర్వినియోగం చేయలేదని, పోలీస్ వ్యవస్థను అరాచకాలు, అక్రమాలకు వాడుకోలేదని స్పష్టంచేశారు. రేవంత్‌రెడ్డి రాజకీయ క్రీడలో పోలీస్ అధికారులు కచ్చితంగా భవిష్యత్తులో బలి అవుతారని హెచ్చరించారు. రిటైర్ అయినా ఇప్పుడు రెచ్చిపోయే పోలీస్ అధికారులను వదిలిపెట్టేది లేదని, అక్రమం అని తెలిసి కూడా కేసులు పెడుతున్న వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ‘రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి మా పార్టీ కార్యకర్తలే భయపడ్తలేరు. ఇక మేమెందుకు భయపడుతం?’ అని ప్రశ్నించారు. ‘ఎమర్జెన్సీ ఉంటే మీరంతా బయట ఉండేవాళ్లా? అని పోలీస్ అధికారులు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది’ అని హితవుపలికారు. రేవంత్‌రెడ్డి ఆడించినట్టు ఆడే అధికారులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు.
ఇంగ్లిష్ మాట్లాడే వాళ్లను తిడుతారేమో
‘రేవంత్‌రెడ్డి హార్వర్డ్ వెళ్లి ఏం చేస్తాడో అర్థమవుతలేదు. ఇంగ్లిష్ మాట్లాడే వాళ్లను తిడతాడేమో అకడ. ఇంగ్లిష్‌లో చదువు చెప్పేవాళ్లను కూడా బాత్రూంలో కడుకునే వాళ్లని తిడతాడేమో’ అని కేటీఆర్ ఎద్దేవాచేశారు. రేవంత్‌రెడ్డి హార్వర్డ్ చదువుపై పాత్రికేయులు ప్రస్తావించగా.. కేటీఆర్ స్పందించారు. ‘హార్వర్డ్‌లో చదువుకున్న తర్వాత కొంత మంచిగా వస్తారని అనుకుంటున్నా. లాగులో తొండలు ఇడుస్త. పేగులు మెడలో వేసుకుంటా వంటి మాటలు బంద్ చేస్తాడేమో చూడాలి. లేకుంటే అకడ కూడా ఇంగ్లిష్‌లో మాట్లాడే ప్రొఫెసర్లు, విద్యార్థులను ఇకడ దూషించినట్టే దూషిస్తడేమో అనిపిస్తున్నది. ఆయనకు ఇంగ్లిష్ రాదు. రావలసిన అవసరం లేదని పదేపదే చెప్తడు కదా? మరి ఆయన అకడ ఇంగ్లిష్‌లో నేర్చుకునేదేందో? సబ్మిట్ చేసేదేమిటో? ఆయనకు సర్టిఫికెట్ ఎట్లా వస్తుందో కూడా తెలియదు’ అని ఎద్దేవాచేశారు. ‘కేవలం సొంత ఐడెంటిటీ లేకనే రేవంత్‌రెడ్డి పిచ్చిగా మాట్లాడుతున్నడు. తనను ఎవరూ సీఎంగా గుర్తించడం లేదని వాగుతున్నడు’ అని ఎద్దేశా చేశారు. ‘దమ్ముంటే మా పార్టీ జెండా గద్దెలను ముట్టుకోండి.. మీ గద్దెలు లేకుండా పోతయ్.. మా పార్టీ కార్యకర్తలు ఊరుకోబోరు’ అని హెచ్చరించారు. పదేండ్లపాలనలో తాము ప్రతిపక్షాలపై కాంగ్రెస్ మాదిరి మాట్లాడి దాడులు చేసి ఉంటే ఇప్పటివరకు ఒకరు కూడా మిగులకుండా పోయేవారని పేర్కొన్నారు. సమావేశంలో ఎంపీ రవిచంద్ర, ఎమ్మెల్సీలు వాణీదేవి, యాదవరెడ్డి, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, పద్మారావుగౌడ్, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, విప్ వివేకానందగౌడ్, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, డాక్టర్ సంజయ్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు విద్యాసాగర్‌రావు, సుంకె రవిశంకర్, చిరుమర్తి లింగయ్య, మాజీ ఎంపీలు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, బడుగుల లింగయ్యయాదవ్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, రాష్ట్ర కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు రాకేశ్‌రెడ్డి, వాసుదేవారెడ్డి, పల్లె రవికుమార్, దేవీప్రసాద్, నేతలు తుల ఉమ, విష్ణువర్ధన్‌రెడ్డి, రాకేశ్‌రెడ్డి, కడారి స్వామి, తుంగ బాలు పాల్గొన్నారు.
ఎనిమిది మంత్రులనే ఎదుర్కొన్న హరీశ్‌కు ఇదో లెక్కా?అసెంబ్లీలోనే ఎనిమిది మంది మంత్రులను ఎదురొన్న హరీశ్‌రావును నలుగురు పోలీస్ అధికారుల ముందు కూర్చోబెడితే ఏమవుతుంది? అని కేటీఆర్ ప్రశ్నించారు. హైకోర్టు, సుప్రీంకోర్టు ఈ కేసులో ఏమీ లేదని తేల్చినా ఇంకా ఈ వేధింపులేందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజ్యాంగం, సుప్రీంకోర్టు అంటే గౌరవం లేదని మండిపడ్డారు.
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరుగలేదని సుప్రీంకోర్టు స్వయంగా చెప్పినా ఇదే అంశంలో నోటీసులివ్వమేందని నిలదీశారు. ఇలాంటి నోటీసులు 1000 ఇచ్చినా, మరో 100 సిట్లు వేసినా ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని హెచ్చరించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ చిహ్నం, తెలంగాణ బలం, తెలంగాణ గుండెచప్పుడు, తెలంగాణ గళం బీఆర్ఎస్ పార్టీ అని పునరుద్ఘాటించారు. ‘ఈ లొట్టపీసు కేసులో మా పార్టీ అధినేత కేసీఆర్‌కు కూడా నోటీసులిస్తారట! ఇచ్చినా భయపడేది లేదు. ఎన్ని లీకులిచ్చి వార్తలు రాయించుకున్నా కాంగ్రెస్ తాటాకు చప్పుళ్లకు బెదరబోం’ అని స్పష్టంచేశారు.
కాంగ్రెస్ కుంభకోణాలను బయటపెట్టిన ప్రతిసారీ ప్రజల దృష్టి మళ్లించేందుకు సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నది. చట్టం, న్యాయస్థానాలపై మాకు పూర్తి గౌరవం ఉన్నది. ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నం. బెదిరింపులకు బీఆర్ఎస్ నేతలు భయపడబోరు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతూనే ఉంటం.
రేవంత్‌రెడ్డిని అదృష్టం అందలం ఎక్కించినా బుద్ధి మాత్రం బురదలోనే ఉన్నది. ఆయన తీరు ‘తా చెడ్డ కోతి వనమెల్ల చెరిచె’ అన్నట్టు ఉన్నది. డబ్బుల కట్టలతో దొరికిన నేర చరిత్ర కలిగిన రేవంత్‌రెడ్డి.. అందరికీ దాన్ని పూయాలని చూస్తున్నడు. రేవంత్ ఓటుకు నోటు దొంగ కాబట్టి.. అందరికీ అవే బుద్ధులు, బురద అంటించాలని చూస్తున్నడు.- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సింగరేణి బొగ్గు కుంభకోణం వ్యవహారంలో బీజేపీకి వాటాలు లేకుంటే ఎందుకు స్పందించడం లేదు? కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి స్వయంగా బాధ్యత తీసుకోవాలి. కేంద్రం-రాష్ట్రం భాగస్వాములుగా ఉన్న సింగరేణికి తీవ్ర ఆర్థిక నష్టం జరుగుతున్నప్పుడు కిషన్‌రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నరు? ఆయన స్పందించకుంటే ఇందులో వాటాలున్నయని భావించాల్సి ఉంటది. -కేటీఆర్
అసెంబ్లీలోనే ఎనిమిది మంది మంత్రులను ఎదురొన్న హరీశ్‌ను నలుగురు పోలీస్ అధికారుల ముందు కూర్చోబెడితే ఏమవుతది? ఈ కేసులో ఏమీ లేదని హైకోర్టు, సుప్రీంకోర్టు తేల్చినా ఇంకా ఈ వేధింపులేంది? కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజ్యాంగం, సుప్రీంకోర్టు అంటే ఏమాత్రం గౌరవం లేదు. ఇలాంటి నోటీస్‌లు 1000 ఇచ్చినా, మరో 100 సిట్లు వేసినా ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటం. -కేటీఆర్