హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ దేశంలో ప్రబల శక్తిగా బీఆర్ఎస్ అవతరిస్తున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ వెల్లడించారు. 2024 ఎన్నికల తరువాత బీఆర్ఎస్ దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చబోతున్నదని తెలిపారు. ఏ కూటమిలో చేరాల్సిన అవసరం తమకు లేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీది ప్రజల కూటమి అని స్పష్టంచేశారు. ఏ కూటమిలో లేనప్పుడే తాము తెలంగాణ రాష్ర్టాన్ని కొట్లాడి సాధించుకొన్నామని గుర్తుచేశారు. రాష్ట్రంలో తమకు ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీయేనని, బీజేపీ ఎంతమాత్రం కాదని వినోద్‌కుమార్ తేల్చి చెప్పారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఇటీవల జరిగిన ఎన్డీఏ, ఇండియా (యూపీఏ) భాగస్వామ్య పక్షాల సమావేశాల పరంపర, వాటి భవిష్యత్తు చిత్రణపై ఆయన ‘నమస్తే తెలంగాణ’తో ముచ్చటించారు. రాజ్యాంగ మౌలిక ఆదర్శాలను సాధిస్తూ దేశానికే ఆదర్శవంతమైన పాలన అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. వినోద్‌కుమార్ అభిప్రాయాలు ఆయన మాటల్లోనే..
కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ (ఇప్పుడు ఇండియా), బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమకులకు బీఆర్ఎస్ సమానదూరంలో ఉంటుంది. 75 ఏండ్ల స్వతంత్రభారతంలో ప్రజల అభీష్టం నెరవేరలేదన్నది నిజం. అధికారం కోసం కూటములు కట్టడం కాదు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలి అన్నది బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ లక్ష్యం. ఆ రెండు కూటములు ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా పనిచేశాయి. అందుకే ఈ కూటముల సమావేశాలకు బీఆర్ఎస్ దూరంగా ఉన్నది. అధికారమే పరమావధిగా కూటములు కట్టడం అనే లక్ష్యానికి బీఆర్ఎస్ దూరం.
తెలంగాణ రాష్ట్రం ఇస్తామని స్పష్టమైన వాగ్దానం చేసిన తరువాతే 2004లో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకున్నాం. యూపీఏ కనీస ఉమ్మడి ప్రణాళికలో, రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ అంశాన్ని చేర్చగలిగాం. ఆ తర్వాత కాంగ్రెస్ మాట తప్పటంతో 2006లో యూపీఏ నుంచి బయటకు వచ్చాం. అప్పటి బీఆర్ఎస్ ఏ కూటమితో భాగస్వామి కాదు. 2014లో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కానీ, 2018 ఎన్నికల్లో కానీ బీఆర్ఎస్ ఒంటరిగా పోటీచేసింది. తొమ్మిదేండ్లు ప్రజారంజక పాలనను అందించిన పార్టీగా బీఆర్ఎస్ రేపు వచ్చే ఎన్నికల్లో 2014, 20 18 ఎన్నికల సందర్భంగా అనుసరించిన వ్యూహాన్నే అనుసరిస్తుంది. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్సే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి తీరుతుంది.
కాంగ్రెస్ పార్టీయే మా ప్రత్యర్థి అని సీఎం కేసీఆర్ ఇప్పటికే అనేకసార్లు స్పష్టం చేశారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలే తెలంగాణలో వస్తాయని కాంగ్రెస్ నేతలు కలలు కంటున్నాయి. కర్ణాటకలో పరిస్థితులు వేరు.. ఇక్కడ బీఆర్ఎస్కు, కేసీఆర్‌కు ప్రజల్లో ఆదరణ వేరు. అన్ని వర్గాలను సమదృష్టితో చూస్తూ అభివృద్ధి, సంక్షేమాల్లో భాగస్వామ్యం చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణకు కర్ణాటకతో పోల్చి చూడలేమని కాంగ్రెస్ నేతలే చెప్పుకొంటున్నారు. బీజేపీది పాలపొంగు మాత్రమే. ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి అప్పటికప్పుడు ప్రయోజనం పొందాలనే బీజేపీ ఆలోచనకు తెలంగాణ అవకాశం ఇవ్వదు. రాష్ట్రంలో పట్టుమని 10 స్థానాల్లో అభ్యర్థులు పెట్టేస్థితిలో బీజేపీ లేదు.
తెలంగాణ మాడలే మాకు ఆశాదీపమని మహారాష్ట్ర ప్రజలు బలంగా నమ్ముతున్నారు. అందుకే ఈ మధ్య కాలంలో కేసీఆర్ మహారాష్ట్రలో పర్యటించిన ప్రతీ సందర్భంలోనూ మహారాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తెలంగాణ సరిహద్దులో ఉన్న సోలాపూర్, చంద్రాపూర్, నాందేడ్ వంటి ప్రాంతాలే కాకుండా మహారాష్ట్ర వ్యాప్తంగా రోజురోజుకు బీఆర్ఎస్కు ఆదరణ పెరుగుతున్నది. త్వరలోనే సోలాపూర్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించాలని అక్కడి ప్రజలు ఆహ్వానిస్తున్నారు. అన్ని పార్టీల నుంచి ఎంతోమంది బీఆర్ఎస్లో చేరారు. కొంతమంది కీలక నేతలు, ప్రజాప్రతినిధులు కేసీఆర్‌తో చర్చలు జరుపుతున్నారు. ఈ పరిణామాల పర్యవసానంగా మహారాష్ట్రలో జరిగే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీచేస్తుంది.
రాష్ట్రంలో మైనార్టీలు బీఆర్ఎస్తోనే ఉన్నారు. ఇందలో ఎవరికీ అనుమానం అవసరం లేదు. ఆ వర్గాలను ఎత్తిచూపాల్సిన అసవరం అంతకన్నాలేదు. స్వాతంత్య్రానంతరం మైనార్టీల అభివృద్ధి, సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినంతగా మరే ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టలేదని ఆయా వర్గాలే బహిరంగంగా చెప్పిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఎంఐఎంకు ఉన్న స్థానాల్లో కొన్నిచోట్ల మేం గెలిచినా ఆశ్చర్యంలేదు.
బీఆర్ఎస్ పార్టీ దేశవ్యాప్తంగా విస్తరిన్నది. సీఎం కేసీఆర్ ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవటానికి అనువైన మార్గాన్ని నిర్దేశించుకుంటారని కాంగ్రెస్, బీజేపీ అగ్రనాయకత్వాలకు స్పష్టంగా తెలుసు. అందుకే బీఆర్ఎస్ను ఏదో ఒక కూటమికి ఆపాదించి పలుచన చేసి, బలహీనపరచాలనే దురుద్దేశంతోనే కొంతమంది నాయకులు బీ-టీం, ఏ టీం అని మాట్లాడుతున్నారు. ఏదో ఒక ఛట్రంలో బీఆర్ఎస్ ఇమడదు. కేసీఆర్ అసలే ఇమడరు. దీనికి బలమైన ప్రాతిపదిక ఉన్నది. ప్రజల అవసరాలు తీర్చకుండా రాజకీయాలు చేస్తే భవిష్యత్తు క్షమించదు అన్నది టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా రూపాంతరం చెందినప్పుడు కేసీఆర్ స్పష్టంగా చెప్పారు. అంటే రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరచిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి మౌలిక, ప్రాధమిక అంశాల సాధన లక్ష్యంగా భారత ప్రజాస్వామ్య వ్యవస్థ సాగాలి. దురదృష్టవశాత్తు దేశంలో ఇప్పటిదాకా ఆ లక్ష్యాలు.. లక్ష్యాలుగానే మిగిలిపోయాయి. తెలంగాణ రాష్ట్రంగా అవతరించిన అనతికాలంలోనే ప్రజలందరి అభివృద్ధి, సంక్షేమమే ఎజెండాగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నది. సబ్బండ కులాలు, వర్గాలకు సమాన అవకాశాలు కల్పించి ఆర్థికంగా ఆయా వర్గాలను ఉన్నతిలోకి తీసుకురావడం కోసం చేపట్టిన కార్యక్రమాలతో ఇవ్వాళ తెలంగాణ దేశంలోనే నంబర్ 1 స్థానంలో నిలిచింది. 9 ఏండ్ల కాలంలోనే తెలంగాణ ఆచరించిన మార్గాన్ని దేశం అనుసరించేలా చేసింది. తెలంగాణ మాడలే దేశానికి దిక్సూచిలా నిలిచింది. అందుకే మేము రాజకీయంగా ఏ ఒక్కరికో టీం కాదు.. మాది ప్రజల టీం. ప్రజల యోగక్షేమాలే మాకు ముఖ్యం.