హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన అహంకారపూరిత, నీచమైన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర జలహకులను కాపాడటం చేతగాని దద్దమ్మ అంటూ మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు గొంతుకోసి, సొంత జిల్లాకే దగా చేస్తున్న రేవంత్‌రెడ్డి.. తన నిర్వాకం బయటపడటంతో తట్టుకోలేక అహంకారంతో అరుస్తున్నారని, దగుల్బాజీ కూతలు కూస్తున్నారని నిప్పులు చెరిగారు. నీటి హకులపై రాజీపడ్డ విషయాన్ని బయటపెడితే సమాధానం చెప్పలేక చిల్లర డైలాగులతో చిందులు తొకడం రేవంత్ నైజమని విమర్శించారు. సభ్యత, సంస్కారం లేని నీచవాగుడు చూసి జనం చీదరించుకుంటున్నా, ఛీకొడుతున్నా మారవా రేవంత్‌రెడ్డీ? అని చురకలంటించారు. ఈ మేరకు కేటీఆర్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
కాంగ్రెస్ జలద్రోహాన్ని అసెంబ్లీలో ఎండగడుతాం
రాబోయే శాసనసభలోనూ, జనసభలోనూ ప్రతిచోటా కాంగ్రెస్ చేస్తున్న జలద్రోహాన్ని ఎండగడుతామని కేటీఆర్ హెచ్చరించారు. పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రానికి నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమని, పౌరుషంగల్ల బిడ్డలుగా ప్రశ్నిస్తామని పునరుద్ఘాటించారు. తాము ఆత్మగౌరవం లేని ఢిల్లీ బానిసలం కాదని, రైతన్నల హకులకు భంగం కలిగితే భగ్గున మండుతామని హెచ్చరించారు. తిట్లు, బూతులతో డైవర్షన్ డ్రామాలు ఆడుతూ ప్రజలను తమాషా పట్టించడం ప్రతిసారీ సాగదని, జనం అన్నీ గమనిస్తున్నారని హితవుపలికారు. సందర్భం వచ్చినప్పుడు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని తొకి నారతీస్తారని, 2028 ఎన్నికల్లో ఆ పార్టీని బొంద పెట్టడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. మరో వందేండ్ల దాకా పుట్టగతులు లేకుండా కాంగ్రెస్‌ను పాతిపెట్టడం తథ్యమని హెచ్చరించారు. ఎన్ని బూతులు తిట్టినా, ఎన్ని డ్రామాలు ఆడినా తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ తన పోరాటాన్ని ఆపదని కేటీఆర్ స్పష్టం చేశారు.
కోవర్ట్ బతుకు రేవంత్‌రెడ్డిది
తెలంగాణ సోయి లేని, రాష్ట్ర ప్రయోజనాలను రక్షించలేని కోవర్ట్ బతుకు రేవంత్‌రెడ్డిదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. అడ్డంగా దొరికిపోవడం, ఆగమాగం కావడం, అడ్డదిడ్డంగా వాగడం ఆయనకు అలవాటేనని మండిపడ్డారు. రాష్ట్రంలో విధ్వంసక పాలనతో ప్రజలను చావగొడుతున్నారని, వికృత మనస్తత్వంతో చావులు కోరుకుంటున్న నీచమైన వాగుడు చూసి జనం చీదరించుకుంటున్నా ముఖ్యమంత్రికి బుద్ధి రావడం లేదని విమర్శించారు. ‘పట్టపగలు నోట్ల కట్టలతో దొరికిపోయిన ఓటుకు నోటు దొంగని, అదే నీ స్థాయి’ అంటూ రేవంత్‌రెడ్డి గతాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. పనికిమాలిన శపథాలు చేయడం, తీరా సమయం వచ్చాక పత్తా లేకుండా పారిపోవడం రేవంత్‌కు వెన్నతో పెట్టిన విద్య అని చురకలంటించారు.