జగిత్యాల, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): జగిత్యాల నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర, కాంగ్రెస్‌పై దండయాత్ర మొదలవుతుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. ఈ జనప్రభంజన సభతో బీఆర్ఎస్ పూర్వవైభవం దిశగా పురోగమిస్తుందని, కేసీఆర్ మరోసారి సీఎం అవుతారని ధీమా వ్యక్తంచేశారు. ‘సింహం బయటికి వస్తున్నది అంటే గుంట నకల గుండెల్లో ఈ రోజు రైళ్లు పరుగెడుతున్నయ్. కేసీఆర్ బహిరంగ సభకు వస్తున్నారని కాంగ్రెస్ ఎన్నో కుట్రలు, కుతంత్రాలకు తెరలేపి, సభను అడ్డుకునే చిల్లర ప్రయత్నం చేస్తున్నది. ఎన్ని కుట్రలు చేసినా సభ విజయవంతమై తీరుతుంది’ అని తేల్చిచెప్పారు.
మాజీమంత్రి జీవన్‌రెడ్డి ఈ నెల 20న బీఆర్ఎస్లో చేరనున్న సందర్భంగా జగిత్యాల మినీస్టేడియంలో ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను శనివారం బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌తో కలిసి కేటీఆర్ పరిశీలించారు. ముందుగా మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ఇంటికి వెళ్లిన ఇద్దరు నేతలు, ఆయనతో సమావేశమై పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆ తర్వాత సభా స్థలి వద్దకు వచ్చి, సభ నిర్వాహకులకు పలు సూచనలు సలహాలిచ్చారు.
ఈ సందర్భంగా మినీస్టేడియంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. జగిత్యాలలో కోలాహలం, పండుగ వాతావరణం కనిపిస్తున్నదని, రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరుగుతున్నదని చెప్పారు. జగిత్యాల సభను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి, మంత్రులు సిల్లీ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ‘కేసీఆర్ జగిత్యాలకు వస్తున్న రోజే సీఎం రేవంత్‌రెడ్డి మేడిగడ్డకు వెళ్తారట? రెండున్నరేండ్లుగా మేడిగడ్డకు వెళ్లేందుకు ముఖ్యమంత్రికి సమయమే దొరకలేదా? కేసీఆర్ బహిరంగ సభ ఇకడ ఉన్నప్పుడే ఆయనకు అర్జంట్‌గా మేడిగడ్డకు పోయే పనిపడిందా?’ అని ఎద్దేవా చేశారు.
‘టీవీల్లో సగం కేసీఆర్‌ను చూపెట్టాలి, సగం తనను చూపెట్టాలి! పేపర్లలో సగం కేసీఆర్ వార్త రాయాలి.. మరో సగం తన వార్త రాయాలి అనే చిల్లర ప్రయత్నమే తప్ప మరొకటి కాదు. ఇంత కుత్సిత, కుసంసార మనస్తత్వం ఉన్న ముఖ్యమంత్రి దేశంలో రేవంత్ తప్ప మరొకరు ఎవరూ ఉండరు’ అని ఎద్దేవా చేశారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చేసే రాజకీయాలు ఇంత చిల్లరగా ఉండకూడదని హితవు పలికారు. కేసీఆర్ దార్శనికత కలిగిన నాయకుడిగా, ఉద్యమనేతగా, రాష్ట్ర సాధకుడిగా, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఉన్నత స్థాయికి చేరుకున్నారని చెప్పారు.
ఈ స్థాయికి చేరుకున్న ఆయనకు టీవీ వాళ్లు ఏం చూపెడుతారు? పేపర్ వాళ్లు ఏం రాస్తారు? అనే విషయాలపై పెద్దగా పట్టింపు ఉండదు అని తెలిపారు. జగిత్యాలకు వచ్చి, జనాలను కలుసుకొని, అందరి ముందూ మాట్లాడి, లక్షలాది మందితో సంభాషించడమే కేసీఆర్‌కు తెలుసునని, ఆయన ప్రస్థానమే జనమమేకంతో సాగిందని గుర్తుచేశారు. అలాంటి నాయకుడు జగిత్యాలకు వస్తుంటే, కోరుట్ల వైపు నుంచి వచ్చేవారిని ఇకడికి రానివ్వకుండా రోడ్డు తవ్వేశారని, మూడేండ్లుగా గుర్తుకు రాని ఈ రోడ్డు, ఇప్పుడే గుర్తుకు వచ్చిందా? అని ప్రశ్నించారు. ‘ఇంత చీప్ రాజకీయాలు, చిల్లర ప్రయత్నాలతో జగిత్యాలలో జన ప్రభంజనాన్ని అడ్డుకుంటామని అనుకోవడం అకాశం మీద ఉమ్మేయడం లాంటిదే’ అని స్పష్టంచేశారు.
కేసీఆర్ గతంలో జగిత్యాలలో నిర్వహించిన బహిరంగ సభలన్నీ విజయవంతం అయ్యాయని, ఈ సభ సైతం అద్భుతంగా విజయవంతం అవుతుందని కేటీఆర్ స్పష్టంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని చిల్లర కుట్రలు చేసినా అధిగమించేందుకు తమ పార్టీ నాయకత్వం అహర్నిశలూ కష్టపడుతున్నదని చెప్పారు. ‘జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జగిత్యాల కేంద్రంగా, ధర్మపురి నియోజకవర్గానికి ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, చొప్పదండి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, కోరుట్లలో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, వేములవాడలో మాజీ ఎంపీ బాల సుమన్ బాధ్యతలు తీసుకొని అక్కడి నాయకులతో సమష్టిగా సభ విజయవంతం కోసం కృషి చేస్తున్నారని తెలిపారు.
బీఆర్ఎస్ నాయకులు బాలమల్లు, శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో సభా ప్రాంగణం రూపుదిద్దుకుంటున్నదని చెప్పారు. మాజీమంత్రి జీవన్‌రెడ్డి చేరికను స్వాగతిస్తూ జగిత్యాల రైతాంగం, ప్రజానీకం బ్రహ్మాండంగా కదిలి వచ్చేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. పార్టీ తరఫున సభకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ఘనంగా చేపడుతున్నామని వివరించారు. ఎండలను దృష్టిలో పెట్టుకొని దాదాపు మూడు లక్షల మంచినీళ్ల బాటిళ్లు, రెండు లక్షల మజ్జిగ ప్యాకెట్లు సైతం తెప్పిస్తున్నామని తెలిపారు. కేసీఆర్ సోమవారం సాయంత్రం 5.30 గంటలకు సభాస్థలికి చేరుకుంటారని, ఎండ తగ్గిన తర్వాతే సభ ప్రారంభమవుతుందని వెల్లడించారు. ప్రభుత్వం ఎన్ని చికులు సృష్టించినా, ఎన్ని ఇబ్బందులు కలిగించినా ప్రజలు, కార్యకర్తలు సంయమనంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
‘కేసీఆర్ చాలా కాలం తర్వాత జగిత్యాల వేదిక నుంచి తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. ఆయన ఏం మాట్లాడుతారో వినాలని తెలంగాణ రైతులు, మహిళలు, విద్యార్థులు, యువకులు, పెద్దలు ఎదురుచూస్తున్నరు. జగిత్యాలలో ఉన్న ప్రతి సోదరుడు, సోదరీమణికి నా విన్నపం. ఇది మీ సభ, మీరు మాకు ఆతిథ్యం ఇస్తున్నరు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి’ అని పిలుపునిచ్చారు.
సభకు వచ్చే ప్రజల కోసం కార్యకర్తలు ఒక మెట్టు దిగివచ్చి సహకరించాలని విన్నవించారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేరికను స్వాగతిస్తూ ఒక వరుస వెనక్కి తగ్గి కొత్తగా వచ్చే వారిని ఆహ్వానించే సంస్కారం చూపిన ఎమ్మెల్సీ ఎల్ రమణ, జడ్పీ మాజీ చైర్ పర్సన్ వసంతకు ధన్యవాదాలు తెలిపారు. పాత్రికేయ మిత్రులు సభ విజయవంతానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జీవన్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించేందుకు వచ్చిన సందర్భంలో మీడియా మిత్రులకు కొంత అసౌకర్యం కలిగిందని, దానికి పెద్ద మనసుతో మన్నించాలని కోరారు. ఒక పాత్రికేయ సోదరుడి కాలు ఫ్రాక్చర్ కావడమే గాక, కొన్ని కెమెరా ట్రైపాడ్లు కూడా విరిగినట్టు తమ దృష్టికి వచ్చిందని, తప్పకుండా ఆ నష్టాన్ని తాము భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.
జగిత్యాల సభను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి, మంత్రులు సిల్లీ రాజకీయాలు చేస్తున్నరు. కేసీఆర్ జగిత్యాలకు వస్తున్న రోజే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మేడిగడ్డకు వెళ్తారట! రెండున్నరేండ్ల నుంచి మేడిగడ్డకు వెళ్లేందుకు సీఎంకు సమయమే లేకుండెనా? కేసీఆర్ బహిరంగ సభ ఇకడ ఉన్నప్పుడే ఆయనకు అర్జెంట్‌గా మేడిగడ్డకు పోయే పనిపడిందా?
– కేటీఆర్
డీలిమిటేషన్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదించిన హైబ్రీడ్ విధానం ఏంటో ఇవాళ స్పష్టమైందని, అది హైబ్రిడ్ కాదు క్రాస్ బ్రీడ్ అని దేశానికి తెలిసిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవాచేశారు. ఈ క్రాస్ బ్రీడ్ సిద్ధాంతం రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి అర్థమవుతున్నదో? లేదోనని అనుమానం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజకీయాల్లో ఎంతో విలువలతో కూడిన రాజకీయాలు చేసిన మాజీమంత్రి జీవన్‌రెడ్డి ఈ నెల 20న కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్లో చేరుతుండటం సంతోషంగా ఉన్నదని చెప్పారు.
జీవన్‌రెడ్డి చేరిక కరీంనగర్ జిల్లాకే కాదు, యావత్ ఉత్తర తెలంగాణలో తమ పార్టీకి ఎంతో బలాన్ని ఇస్తుందని తెలిపారు. రెండున్నరేండ్ల ప్రజాకంటక పాలనతో రాష్ట్రంలో ప్రజలందరికీ స్పష్టమైన క్లారిటీ వచ్చిందని, ‘సీఎం రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి’ అని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని చెప్పేందుకు జీవన్‌రెడ్డి చేరికనే ఒక సజీవ సాక్ష్యమని స్పష్టంచేశారు. ‘నిన్న పార్లమెంట్లో జరిగిన రెండు పరిణామాలు తెలంగాణ సమాజాన్ని తీవ్రంగా కలచివేసినయ్. కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య, నిండు సభలో మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటును ఇండియా- పాకిస్థాన్ విభజనతో పోల్చడం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీయడమే.
తేజస్వీ వ్యాఖ్యల విషయంలో ఆయనతో బేషరతుగా క్షమాపణలు చెప్పించాల్సింది పోయి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేయడం అత్యంత దుర్మార్గం. తేజస్వీ సూర్య మాట్లాడిన మాటలు చూస్తుంటే తెలంగాణ ప్రజల గుండెలు రగిలిపోతున్నయ్. కేసీఆర్ నాయకత్వంలో సకల జనులు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని కించపరుస్తరా?’ అంటూ ధ్వజమెత్తారు. డాక్టర్ బీఆర్ అంబేదర్ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం, లోక్‌సభ, రాజ్యసభలో బిల్లులు ఆమోదం పొంది, రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ప్రజాస్వామిక పద్ధతిలో తెలంగాణ ఏర్పడిందని గుర్తుచేశారు. ఒక ఎంపీ తప్పు మాట్లాడితే ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం దాన్ని ఖండించాల్సింది పోయి సమర్థించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బీజేపీ తక్షణమే తేజస్వి వ్యాఖ్యలపై బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేదంటే తెలంగాణ మనోభావాలను దెబ్బతీసిన పార్టీగా బీజేపీ మిగిలిపోతుందని హెచ్చరించారు.
మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్‌కు సంబంధించి నిర్వహించిన లోక్‌సభ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎంపీలు లేని లోటు స్పష్టంగా కనిపించిందని హరీశ్ చెప్పారు. ‘మన ఎంపీలు సభలో ఉండి ఉంటే తేజస్వీకి తెలంగాణ బిడ్డల తరఫున దీటైన, మూతి పగిలే సమాధానం చెప్పేవాళ్లు. మన రాష్ట్రం నుంచి 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ ఎంపీలున్నా పెదవులు మూసుకొని మౌనంగా కూర్చోవడం సిగ్గుచేటు.
తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంటే ప్రశ్నించాల్సిన బాధ్యత మీపై లేదా? రాజ్యసభలో ఉన్న ముగ్గురు బీఆర్ఎస్ ఎంపీలు ప్రాజెక్టులపై అవాకులు, చవాకులు పేలిన కేంద్ర జలవనరుల మంత్రికి దీటైన సమాధానం ఇచ్చారు. స్పీకర్‌ను కలిసి ఆధారాలు చూపించి రికార్డులను సైతం సవరించారు. రేవంత్‌రెడ్డి, బీజేపీ మధ్య ఉన్న బడే భాయ్, చోటే భాయ్ బంధం మరోసారి బట్టబయలైంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతల ఇండ్లు ముట్టడించాలని బీజేపీ పిలుపునిస్తే.. రేవంత్‌రెడ్డి మాత్రం ఢిల్లీలో బీజేపీ కేంద్రమంత్రి శ్రీనివాస్‌వర్మ ఇంటికి భోజనానికి వెళ్లాడు.
ఇరు పార్టీల కార్యకర్తలేమో కొట్లాడుకోవాలి.. మీరేమో విందులు చేసుకోవాలా? ఇదేం వ్యవహారం?’ అంటూ మండిపడ్డారు. సమావేశంలో బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, మాజీమంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సంజయ్ కల్వకుంట్ల, పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మె ల్సీ ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, జీవన్‌రెడ్డి, బాల్క సుమన్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, మాజీ వైస్ చైర్మన్ హరిచరణ్‌రావు, బీఆర్ఎస్ నాయకులు ఓరుగంటి రమణారావు పాల్గొన్నారు.
జగిత్యాల వేదిక నుంచి తెలంగాణ ప్రజలనుద్దేశించి కేసీఆర్ మాట్లాడబోతున్నరు. ఆయన ఏం మాట్లాడుతారో వినాలని తెలంగాణ రైతులు, మహిళలు, విద్యార్థులు, యువకులు, పెద్దలంతా ఎదురుచూస్తున్నరు. జగిత్యాలలో ఉన్న ప్రతి సోదరుడు, సోదరీమణికి నా విన్నపం. ఇది మీ సభ, మీరు మాకు ఆతిథ్యం ఇస్తున్నరు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
– కేటీఆర్
‘జగిత్యాల సభ అంటేనే ఇవాళ రేవంత్ రెడ్డికి భయం పట్టుకున్నది. జగిత్యాలకు కేసీఆర్ వచ్చి, జీవన్‌రెడ్డి, కేసీఆర్, ఎల్ రమణ అందరూ కలిసి ఒకే వేదికపై మాట్లాడితే జగిత్యాల నుంచే మళ్లీ బీఆర్ఎస్ జైత్రయాత్ర మొదలవుతుందన్న దడ ముఖ్యమంత్రి గుండెల్లో మొదలైంది’ అని కేటీఆర్ తేల్చిచెప్పారు. ‘కాంగ్రెసోళ్లకు మరోసారి చెప్తున్నా.. జగిత్యాల నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర, దండయాత్ర మొదలవుతుంది’ అని స్పష్టంచేశారు.
రేవంత్ భరతం పట్టేందుకు తెలంగాణ ప్రజలు ఇప్పటికే రంగం సిద్ధం చేసిన వాతావరణం ఆవిష్కృతమైందని, ఇది బయట ప్రపంచం ముందు ప్రస్ఫుటమవుతుందన్న భయం రేవంత్‌రెడ్డికి, కాంగ్రెస్ సర్కార్‌కు పట్టుకున్నదని, రేవంత్‌ది అట్టర్ ఫ్లాప్ పాలన అని ఎద్దేవా చేశారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు, 13 డిక్లరేషన్లు.. అన్ని వర్గాలకు కాంగ్రెస్ చేసిన మోసం జగిత్యాల జైత్రయాత సభతో బయటపడుతుందని చెప్పారు.
‘సీఎం రేవంత్‌రెడ్డి, జగిత్యాల హైబ్రిడ్ ఎమ్మెల్యే.. హైబ్రిడ్ కూడా కాదు, అదేం బ్రీడో.. క్రాస్ బ్రీడ్.. ఆ బ్రీడ్‌కు చెం దిన జగిత్యాల ఎమ్మెల్యే సభకు ఆటంకాలు సృష్టించాలని చేస్తున్న ప్రయత్నాలన్నీ కొట్టుకుపోతయ్’ అని స్పష్టం చేశా రు. ‘జగిత్యాల ఎమ్మెల్యే తనది ఏ పార్టీనో ఆయనకే తెలియని పరిస్థితిలో ఉన్నరు. ప్రెస్మీట్లో బీఆర్ఎస్ అంటడు. కానీ, కాంగ్రెస్ ఆఫీసులో కూర్చుంటడు. కాంగ్రెస్ మంత్రి పకన కూర్చొని మాట్లాడుతడు. అలాంటి వ్యక్తిని క్రాస్ బ్రీడ్ అనాలా? హైబ్రిడ్ అనాలా? ఏ బ్రీడ్ అనాలి?’.. ఆయన ఏమిటో ఆయనే చెప్పుకోవాలి’ అని సూచించారు.