జనగామ, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ వైస్ చైర్మన్ భూష పర్వతాలును పోలీసులు, అధికారపార్టీ సభ్యులు కలిసి బలవంతంగా లేపి సీటు తొలగించి అవమానించిన ఘటన జనగామలో చోటుచేసున్నది. వివరాల్లోకి వెళితే.. జనగామ మున్సిపల్ సాధారణ సమావేశం గురువారం నిర్వహించారు. వేదికపై కూర్చున్న వైస్ చైర్మన్ భూష పర్వతాలును కాంగ్రెస్ సభ్యులు బలవంతంగా లేపేందుకు యత్నించారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు అడ్డుకొని చైర్పర్సన్, కమిషనర్, కాంగ్రెస్ సభ్యులతో తీవ్ర వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
చైర్పర్సన్ ఆదేశాలతో కౌన్సిల్‌హాల్‌కు వచ్చిన పోలీసులు వేదికపై కుర్చీలో కూర్చున్న వైస్‌చైర్మన్‌ను బలవంతంగా లేపి కిందకు దించారు. దీంతో భగ్గుమన్న వైస్ చైర్మన్సహా బీఆర్ఎస్ కౌన్సిలర్లు చైర్పర్సన్ పోడియం ఎదుట ధర్నాకు దిగారు.
ఇటీవల జిల్లా సమీకృత కార్యాలయంలో మున్సిపల్ అభివృద్ధిపై కలెక్టర్ నిర్వహించిన సమీక్షాసమావేశంలో ఎలాంటి హోదా లేని చైర్పర్సన్ భర్త కడకంచి శ్రీనివాస్‌ను అధికారుల పక్కనే కూర్చోబెట్టుకోవడంపై బీఆర్ఎస్ సభ్యులు కమిషనర్, చైర్‌పర్సన్‌ను నిలదీశారు. దీంతో ఎజెండా అంశాలను చర్చించకుండానే చైర్పర్సన్ కౌన్సిల్ సమావేశాన్ని వాయిదావేశారు.