హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వ్యతిరేకి అయిన అభిషేక్ సింఘ్వీకి రాష్ట్రం నుంచి రాజ్యసభ సీటు ఇచ్చారని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆరోపించారు. గురువారం తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి రవిచంద్ర మీడియాతో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలోని బీసీ, మాదిగ, మైనార్టీల్లో ఎవరికైనా రాజ్యసభ సీటు ఇస్తారని అనుకున్నాం. వీ హనుమంతరావు లాంటి సీనియర్లు కాంగ్రెస్ అధిష్ఠానానికి కనిపించలేదు. సింఘ్వీ ఏ రోజూ తెలంగాణకు అనుకూలంగా మాట్లాడలేదు. గతంలో ఇక్కడి ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడారు. ఆయన తెలంగాణ వ్యతిరేకి. ఇక్కడివారికి పరిపాలన చేతకాదు అన్నట్టు మాట్లాడారు. తెలంగాణతో పాటు పలు రాష్ర్టాల డిమాండ్లు ఉన్నందున రెండో ఎస్సార్సీ వేయాలని అన్నడు.
హైదరాబాద్ లేని తెలంగాణ ఇవ్వాలని అన్నడు’ అని గుర్తుచేశారు. రాష్ట్రంలో అర్హులే లేరన్నట్టు ఢిల్లీవారికి రాజ్యసభ సీటు ఇవ్వటం రాష్ట్ర ప్రజలను అవమానించటమేనని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణ అస్థిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిందని ధ్వజమెత్తారు. ముస్లిం, ముదిరాజ్, మున్నూరుకాపు, యాదవ కులాలకు మంత్రివర్గంలో అవకాశం దక్కలేదని, కనీసం రాజ్యసభలోనైనా చాన్స్ దక్కుతుందని చూ శామని వెల్లడించారు. సామాజికవర్గాల పరంగా కేసీఆర్ సమన్యాయం చేశారని తెలిపారు. డీ శ్రీనివాస్, బండ ప్రకాశ్, లింగయ్యయాదవ్ లాంటి వెనకబడినవర్గాలకు అవకాశం కల్పించారని చెప్పారు. సీతారామ ప్రాజెక్టు ప్రారంభం చాలా సంతోషకరమని, కేసీఆర్ అంటేనే నీళ్లు గుర్తుకు వస్తాయని అన్నారు.
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో పదవులన్నీ తెలంగాణేతరులకే దక్కేవని గుర్తుచేశారు. పీసీసీ చీఫ్‌లు, సీఎం పదవులు అన్నీ వారికే వచ్చేవని తెలిపారు. తెలంగాణ ఉద్యమం రావడానికి అసమానతలు కూడా కారణమని వెల్లడించారు. కేసీఆర్ తెలంగాణ తెచ్చినందుకే రేవంత్‌రెడ్డి సీఎం, కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రి అయ్యారని అన్నారు. కేసీఆర్‌పై పెద్ద స్థాయిలో ఒత్తిళ్లు వచ్చినా ఇతర రాష్ట్రాల వారికి రాజ్యసభ సీటు ఇవ్వలేదని స్పష్టం చేశారు. తెలంగాణ వ్యతిరేకులకు ఇకడి నుంచి పదవులు ఇవ్వడం బాధ కలిగిస్తున్నదని చెప్పారు. బీసీలకు అవకాశం ఇస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు.