హైదరాబాద్, మే7 (నమస్తే తెలంగాణ)/ఖైరతాబాద్: ‘జనగణనలో భాగంగా మొదటి విడత ఇండ్ల గుర్తింపులోనూ ఎస్సీ, ఎస్టీలతోపాటు బీసీ కుటుంబాలనూ లెక్కించాలి. పార్టీలకతీతంగా ఓబీసీ కులగణన సాధన కోసం ఉద్యమాన్ని తీవ్రం చేయాలి. ఈ మేరకు 10న చేపట్టబోయే నిరసన కార్యక్రమాలు ఢిల్లీకి వినిపించేలా రూపొందించాలి. అందుకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఉంటుంది’ అని శాసనమండలిలో బీఆర్ఎస్ పక్షనేత సిరికొండ మధుసూదనాచారి తేల్చిచెప్పారు. మొదటి విడత ఇండ్ల గుర్తింపు సర్వేలో బీసీ కాలమ్ పెట్టకపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. హైదరాబాద్ లక్డీకాపూల్ అశోక హోటల్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన అఖిలపక్ష బీసీ నేతల సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి మధుసూదనాచారి పాల్గొని మాట్లాడారు. ఓబీసీలను లెకించకపోవడమంటే దేశంలో ఓబీసీల అస్తిత్వాన్ని కనుమరుగు చేయాలనే కుట్ర దాగి ఉన్నదని మండిపడ్డారు.
ఇటు తెలంగాణకు, మరోపక్క ఓబీసీలకు వ్యతిరేకమైన బీజేపీకి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పష్టంచేశారు. బీసీల తడాఖా ఏమిటో కేంద్ర ప్రభుత్వానికి రుచి చూపించాలని తెలిపారు. దేశంలో బీసీలు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ తగిన రాజకీయ, సామాజిక ప్రాధాన్యం లభించడం లేదని వివరించారు. అనంతరం 10 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీని డిమాండ్ చేస్తూ రూపొందించిన పోస్టర్‌ను అ ఖిలపక్ష నేతలు ఆవిష్కరించారు. 10న తెలంగాణకు రానున్న సందర్భంగా ప్రధాని ఆ ప్రశ్నలకు సమాధానమివ్వాలని డిమాండ్ చేశారు. 9, 10 తేదీల్లో బీసీ జేఏసీ చేపట్టబోయే నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని అఖిలపక్షనేతలు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ హ న్మంతరావు, కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ రాష్ట్ర చైర్మన్ ఈర్లపల్లి శంకర్, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, బీసీ నాయకులు గుజ్జ కృష్ణ, విక్రమ్‌గౌడ్, కులకచర్ల శ్రీనివాస్, గణేశ్‌చారి, కోల జనార్దన్, శేఖర్‌సాగర్, మణిమంజరి తదితరులు పాల్గొన్నారు.