హైదరాబాద్, ఫిబ్రవరి 29 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం బరాజ్‌లపై ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. అందులో భాగంగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం శుక్రవారం మేడిగడ్డను సందర్శించనుంది.
పార్టీ ఎమ్మెల్యేలు, శాసనమండలి, పార్లమెంట్ సభ్యులు, ఇతర ముఖ్య నాయకులతో కూడిన బృందం ఉదయం తెలంగాణ భవన్ నుంచి బయలుదేరుతుంది. దాదాపు 200 మందితో కూడిన ఈ బృందం తమ వెంట మీడియాను, నిపుణులను కూడా తీసుకెళ్లి మేడిగడ్డ, అన్నారం బరాజ్‌లను పరిశీలిస్తుంది. కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బరాజ్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తున్న నేపథ్యంలో దానిని తిప్పికొట్టడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ఈ పర్యటన చేపట్టింది.