Kavitha | హైదరాబాద్ మే 23 (నమస్తేతెలంగాణ): ‘కేసీఆరే మా నాయకుడు.. ఆయన నాయకత్వంలోనే ముందుకు సాగుతాం’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టంచేశారు. ఆమె రాసినట్టుగా చెప్తున్న లేఖపై కొన్ని రోజులుగా మీడియాలో జరుగుతున్న చర్చకు కవిత స్వయంగా తెరదించారు. పార్టీలో ఎలాంటి గందరగోళమూ లేదని నొక్కి చెప్పారు. తెలంగాణకు కాంగ్రెస్, బీజేపీ చేసిందేమీ లేదని నిప్పులు చెరిగారు. ఈ నెల 16న అమెరికా పర్యటనకు వెళ్లిన కవిత శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నారు. విమానాశ్రయంలో తెలంగాణ జాగృతి శ్రేణులు కవితకు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా విమానాశ్రయం బయట ఆమె మీడియాతో మాట్లాడారు. ‘కేసీఆర్ మా దేవుడు. ఆయన నాయకత్వమే తెలంగాణకు రక్ష. వ్యక్తిగతంగా నాకు ఎలాంటి ఎజెండా లేదు. నా కొడుకు ఆదిత్య గ్రాడ్యుయేషన్ సెర్మనీ పూర్తి చేసుకొని అమెరికా నుంచి వచ్చే లోపలే నేను రాసిన లేఖ ఏదో లీకైందని చెప్పి రెండు, మూడు రోజులుగా ఇక్కడ చాలా హంగామా నడుస్తున్నది. ఈ సందర్భంగా నేను చెప్పదలుచున్నది ఒకటే.
రెండు వారాల క్రితం కేసీఆర్‌కు లేఖ రాసిన. గతంలోనూ పలుమార్లు నా అభిప్రాయాలను లేఖ ద్వారా చెప్పిన. అయితే కేసీఆర్‌కు అంతర్గతంగా రాసిన ఉత్తరం బహిర్గతమైంది. దీనినిబట్టి ఏం జరుగుతున్నదో మనందరం, తెలంగాణలోని అందరం ఆలోచించుకోవాల్సిన విషయం. నేను కేసీఆర్‌గారి కూతురిని, అంతరంగికంగా నేను రాసిన లేఖను బయటకు తీశారంటే ఇతరుల పరిస్థితి ఏమిటన్నది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. నేను వేరే ఏ విషయాలూ చెప్పలేదు. పార్టీలోని అన్ని స్థాయుల్లో అనుకుంటున్న విషయాలనే ప్రస్తావించిన’ అని కవిత వివరించారు. ఇటీవలి కాలంలో తెలంగాణలోని సగం ప్రాంతాన్ని చుట్టివచ్చానని, గ్రౌండ్లెవల్లో అనుకుంటున్న విషయాలనే చెప్పానని, ఇందులో తన వ్యక్తిగత ఎజెండా ఏమీ లేదని స్పష్టంచేశారు.
‘నాకు ఎవరిపైనా ప్రేమా లేదు, ద్వేషమూ లేదు. పార్టీలోని లోపాలను చర్చించుకొని, సవరించుకుంటూపోతే పార్టీ పదికాలాలపాటు చల్లగా ఉంటుందనేది నా భావన. నేను రాసిన లేఖ బయటకు రావడంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కోతికి కొబ్బరిచిప్ప దొరికిన చందంగా సంబురపడుతున్నయి. ఆ పార్టీలకు అంత సీన్ లేదు. మా నాయకుడు కేసీఆరే. ఆయన నాయకత్వంలోనే తెలంగాణకు మేలు జరుగుతుంది. పార్టీలో ఉన్నటువంటి చిన్నచిన్న లోపాలను చర్చించుకొని, సవరించుకుంటే పార్టీ మరింత పటిష్టమవుతుంది. తెలంగాణను ఫెయిల్ చేసిన కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయం కేసీఆర్ నాయకత్వమే. ఆయన నేతృత్వంలోనే తెలంగాణ ముందుకు పోతదని బలంగా నమ్ముతున్న’ అని కవిత పేర్కొన్నారు.