హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : బీసీలు న్యాయం కోసం ఎదురుచూస్తున్న సమయంలో వారికి బీఆర్ఎస్ బాసటగా నిలువడం గొప్ప విషయమని తమిళనాడు మాజీ చీఫ్ సెక్రటరీ రామ్మోహన్రావు పేర్కొన్నారు. తమిళనాడు రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అమలుపై అధ్యయనం కోసం వెళ్లిన బీఆర్ఎస్ నేతలు శుక్రవారం చెన్నైలో ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ అనేక ఘనవిజయాలు నమోదు చేసిందని ప్రశంసించారు. కేసీఆర్‌తో తనకున్న వ్యక్తిగత సంబంధాన్ని గుర్తుచేసుకున్నారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో మాదిరిగానే తెలంగాణలోనూ బీసీలు తమకు దకాల్సిన వాటా కోసం పోరాడుతున్నట్టు తెలిపారు. మద్రాస్ ప్రెసిడెన్సీలో మొదలైన బీసీల హకుల పోరాటం సుదీర్ఘకాలం అనేక రూపాల్లో కొనసాగిందని, ప్రజల డిమాండ్లపై తమిళనాడు ప్రభుత్వాలు సామాజిక దృక్పథంతో వ్యవహరించాయని చెప్పారు.
తమిళనాడు రాష్ట్ర విద్య, ఉద్యోగాల్లో 69 శాతం రిజర్వేషన్ల అమలు వెనుక సుదీర్ఘ చరిత్ర ఉన్నదని తెలిపారు. తమిళనాడు ప్రజల చైతన్యం, రాజకీయ పార్టీల విధానం, తమిళ ఉద్యమాలు, సాధించిన విజయాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ సాధనతో పాటు స్వల్పకాలంలో స్వరాష్ట్రాన్ని ప్రగతిశీల రాష్ట్రంగా తీర్చిదిద్దిన కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్.. బీసీల కోసం కూడా అద్భుత విజయాలు సాధించి తీరుతుందనే విశ్వాసాన్ని వ్యక్తంచేశారు.
అనంతరం తమిళనాడు ప్రభుత్వ బీసీ, ఎంబీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి విజయ్‌రాజా కుమార్, కమిషనర్ వెంకటేశ్ తదితర ఉన్నతాధికారులతో బీఆర్ఎస్ నేతలు సమావేశమై పలు అంశాలపై అధ్యయనం చేశారు. కేసీఆర్ ఆదేశాల మేరకు తమిళనాడు రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రతినిధి బృందం అధ్యయనంలో ఎంతో విలువైన సమాచారం లభించిందని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, శాసనమండలిలో విపక్షనేత సిరికొండ మధుసూదనాచారి తెలిపారు. రిజర్వేషన్ల విధానంపై చారిత్రక, సామాజిక, రాజకీయ పరిణామాల నివేదిక రూపొందించి కేసీఆర్‌కు అందజేస్తామని చెప్పారు.
బీఆర్ఎస్ రాజ్యసభ పక్ష ఉపనేత వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్, జోగు రామన్న, శాసనమండలి వైస్ చైర్మన్ బండ ప్రకాశ్, శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్ర బీసీల హకుల సాధన కోసం బీఆర్ఎస్ పక్షాన కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిడి కొనసాగిస్తామని తెలిపారు.
సమావేశంలో తమిళనాడు రాష్ట్ర బీసీ సంఘాల ప్రతినిధులు, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యేలు వినయ్‌భాసర్, పుట్ట మధు, కోరుకంటి చందర్, భిక్షమయ్యగౌడ్, మాజీ చైర్మన్లు జూలూరు గౌరీశంకర్, ఆంజనేయగౌడ్, పల్లె రవికుమార్, తుల ఉమ, గెల్లు శ్రీనివాస్‌యాదవ్, నాగేందర్‌గౌడ్, రవీంద్రసింగ్, దూదిమెట్ల బాలరాజుయాదవ్, బీసీ కమిషన్ మాజీ సభ్యులు సుభప్రద పటేల్, కిశోర్‌గౌడ్, బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రీనివాస్, చెరుకు సుధాకర్, రాజ్యలక్ష్మి, బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్, విద్యార్థి సంఘం నేత దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్‌బాపూజీ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మధుసూదనాచారి నేతృత్వంలోని బృందం ద్రవిడ కళగం పార్టీ కార్యాలయాన్ని సందర్శించింది. ఆ పార్టీ అధ్యక్షుడు వీరమణితో సమావేశమయ్యారు.