రాయపర్తి, ఆగస్టు 4 : వరంగల్ జిల్లా రాయపర్తి శివారులోని ఎండిపోయిన ఎస్సారెస్పీ స్టేజ్-2 కాల్వను సోమవారం బీఆర్ఎస్ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని సాగు నీటి ప్రాజెక్ట్లు, కాల్వలన్నీ నిరంతరం ప్రవహించేవని గుర్తుచేశారు. రేవంత్రెడ్డి సర్కారు కొలువుదీరాక నీళ్లు లేక కాల్వలు ఎండిపోతున్నాయని, పంటలకు నీరందక అన్నదాతలు అరిగోస పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఎస్సారెస్పీ కాల్వకు వారం రోజుల్లో నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులతో కలసి పోరాటం చేస్తామని హెచ్చరించారు.
ప్రజల దృష్టిని మళ్లించేందుకే చిల్లర డ్రామాలు ; ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్రెడ్డి ధ్వజం
హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తేతెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కాళేశ్వరం కమిషన్ పేరిట చిల్లర డ్రామాలు ఆడుతున్నదని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్రెడ్డి మండిపడ్డారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన 665 పేజీల నివేదికను ప్రభుత్వం 60 పేజీలకు కుదించి తనకు అనుకూలంగా మార్చుకున్నదని సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రేవంత్రెడ్డి సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే ఆ నివేదికను ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. ఓవైపు కాళేశ్వరంపై విషం చల్లుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మరోవైపు ఆ ప్రాజెక్టు నీటినే విడుదల చేయడం విడ్డూరంగా ఉన్నదని విమర్శించారు. తెలంగాణ రైతులకు సాగునీరు, హైదరాబాద్ ప్రజలకు తాగునీరు అందిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని ప్రచారం చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు.